Share News

వీడిన వివాదం

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:06 AM

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో ల్యాంకో ట్రాన్స్‌మిషన్‌ విద్యుత టవర్ల వివాదం చిక్కుముడి వీడింది. రైతుల పోరాటం, ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు ఆదేశించటంతో సమస్య దాదాపు పరిష్కారమైంది.

వీడిన వివాదం

  • ల్యాంకో టవర్ల మార్పిడి పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే..

  • సీఎం నియమించిన ప్రత్యేక కమిటీ నిర్ణయం

  • ఫలించిన రైతుల ఉద్యమాలు, ఆంధ్రజ్యోతి కథనాలు

  • తాజా నిర్ణయం ద్వారా కేంద్రానికి రూ.100 కోట్ల ఆదా

  • దాదాపు 40 ఎకరాల రైతులకు ఊరట

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో ల్యాంకో ట్రాన్స్‌మిషన్‌ విద్యుత టవర్ల వివాదం చిక్కుముడి వీడింది. రైతుల పోరాటం, ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు ఆదేశించటంతో సమస్య దాదాపు పరిష్కారమైంది. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే టవర్ల ఎత్తు పెంచి కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.100 కోట్ల అదనపు భారం తగ్గింది.

సమస్య ఇదీ..

విద్యుత టవర్ల రీ లొకేషన్‌కు సంబంధించి గత జూన్‌ 14న కేంద్ర విద్యుత మంత్రిత్వ శాఖ కీలకమైన ఆదేశాలిచ్చింది. గైడ్‌లైన్‌-3 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ విలువ కంటే మార్కెట్‌ విలువ ఎక్కువగా ఉండాలి. మార్కెట్‌ విలువ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలి. ల్యాంకో ట్రాన్స్‌మిషన్‌ పవర్‌ లైన్స్‌ వెళ్తున్న ప్రాంతాలైన జక్కంపూడి, నైనవరం ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ విలువ ఎకరం రూ.80 లక్షలు ఉంది. కమర్షియల్‌గా చూస్తే రూ.5 కోట్లు ఉంది. ఈ లెక్క ప్రకారం రైతులకు పరిహారాన్ని చెల్లించాలి. గైడ్‌లైన్‌-4లోని టవర్‌ బేస్‌ కాంపన్సేషన్‌ విషయానికొస్తే.. మార్కెట్‌ రేటుకు 200 శాతం చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈ లెక్కన 41 ఎకరాలకు సంబంధించి రైతులకు రూ.60 కోట్ల మేర పరిహారం ఇవ్వాలి. అలాగే, లైన్లు వెళ్లే పొలాలకు కూడా గైడ్‌లైన్‌-5 ప్రకారం మార్కెట్‌ రేటులో 30 శాతం అంటే.. రూ.40 కోట్ల మేర పరిహారం చెల్లించాలి. ఈ రెండూ కలిపితే రూ.100 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వాలి. రైతుల ఉద్యమం, ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాల ఫలితంగా రూ.100 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వానికి ఆదా అయింది.

రైతులకు వరం

నేషనల్‌ హైవే ఆర్వో కార్యాలయ అధికారులు అనాలోచితంగా, ల్యాంకో సంస్థ ప్రయోజనాల కోసం రూ.32.58 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఖర్చుపెట్టగా, మిగిలిన మరో రూ.20 కోట్ల మేర కేంద్రానికి ఆదా అవుతుంది. తాజాగా బీదర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా జక్కంపూడి, నైనవరం రైతులకు వరంగా మారాయి. బీదర్‌లో ఇలాంటి అంశంపైనే కేసు విచారణకు రాగా, కేంద్ర విద్యుత మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తీర్పు వెలువడింది. ఇదే తీర్పును తాజాగా రైతులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ కేసుల్లో కోర్టు ఇప్పటికే 11 స్టేలు ఇచ్చింది. తుది తీర్పు రాకముందే సమస్య పరిష్కారం కావటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 01:06 AM