Share News

ఎన్నికల సన్నాహం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:54 AM

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘ఈవీఎం ర్యాండమైజేషన్‌’ శుక్రవారం ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు, రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు.

ఎన్నికల సన్నాహం

  • కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమక్షంలో కేటాయింపు

  • కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రారంభం కానున్న ప్రక్రియ

  • నియోజకవర్గాల వారీగా డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లకు తరలింపు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘ఈవీఎం ర్యాండమైజేషన్‌’ శుక్రవారం ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు, రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈవీఎంలను అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కేటాయిస్తారు. ఈవీఎంలో బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ), కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ)లు ఉంటాయి. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌కు ప్రత్యేక కోడ్‌ ఉంటుంది. ఏ కోడ్‌ కలిగిన బ్యాలెట్‌ ఏ పోలింగ్‌ స్టేషన్‌కు వెళుతుందో ఎవరికీ తెలియకుండా చేసే పద్ధతినే ‘ఈవీఎం ర్యాండమైజేషన్‌’ అంటారు. ఇది కంప్యూటర్‌ ఆధారంగా రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహిస్తారు. ఈవీఎంల కోడ్స్‌ను పరిగణనలోకి తీసుకుని కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ద్వారా ఒక్కో నియోజకవర్గానికి అవసరానికి తగినట్టుగా ఆటోమేటిక్‌గా ఈవీఎంలను కేటాయిస్తుంది. ఎలాంటి అభ్యంతరాలు లేవన్న తర్వాతనే ఎన్నికల గోడన్‌లో భౌతికంగా ఈ ప్రక్రియ చేపడతారు. డేటా ప్రాతిపదికన అత్యంత రహస్యంగా ఈవీఎంలను బాక్సుల్లో సర్దుతారు. బాక్సులో సర్దే ఈవీఎంలు ఏ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోకి వెళతాయో కూడా అక్కడి సిబ్బందికి కూడా తెలియదు. అత్యంత రహస్యంగా, పారదర్శకంగా ఉండే ఈ పద్ధతిని శుక్రవారం గొల్లపూడి లోని జిల్లా ఈవీఎంల గోడౌన్‌లో నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు గొల్లపూడి వచ్చి భౌతికంగా ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తారు.

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం, వీవీప్యాట్లు

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం మొత్తం 1792 పోలింగ్‌ స్టేషన్లున్నాయి. ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ) 2150 అవసరం కాగా ప్రస్తుతం గోడౌన్‌లో 2787 బ్యాలెట్‌ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. కంట్రోల్‌ యూనిట్లు (సీయూ) 2150 అవసరం కాగా 2222 వరకు ఉన్నాయి. వీవీ పాట్లు 2330 అవసరం కాగా 2661 అందుబాటులో ఉన్నాయి.

ఫ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తిరువూరు పరిధిలో 234 పోలింగ్‌ స్టేషన్ల నిర్వహణకు 281 బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), కంట్రోల్‌ యూనిట్లు (సీయూ) కావాల్సి ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 253 పోలింగ్‌ స్టేషన్లకు గాను 304 బీయూ, సీయూలు కావాల్సి ఉన్నాయి. సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో 267 పోలింగ్‌ స్టేషన్లకు 320 బీయూ, సీయూలు, తూర్పు నియోజకవర్గంలో 298 పోలింగ్‌ స్టేషన్లకు 358 బీయూ, సీయూలు, మైలవరం నియోజకవర్గంలో 296 పోలింగ్‌ స్టేషన్లకు 355 బీయూ, సీయూలు, నందిగామ నియోజకవర్గంలో 222 పోలింగ్‌ స్టేషన్లకు 266 బీయూ, సీయూలు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 222 పోలింగ్‌ కేంద్రాలకు 266 బీయూ, సీయూలు అవసరం ఉంది.

ఫ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలకు సంబంధించి 2150 బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు అవసరం కాగా 2820 బీయూ, 2221 సీయూలు అందుబాటులో ఉన్నాయి. వీవీప్యాట్లు 2330 కావాల్సి ఉండగా 2702 అందుబాటులో ఉన్నాయి.

ఫ పార్లమెంట్‌, అసెంబ్లీ మొత్తంగా 1792 పోలింగ్‌ స్టేషన్లకు 4300 బ్యాలెట్‌ యూనిట్లు అవసరం కాగా 5607 బీయూలు అందుబాటులో ఉన్నాయి. 4300 కంట్రోల్‌ యూనిట్లు అవసరం కాగా 4443 కంట్రోల్‌ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 4660 వీవీప్యాట్లు అవసరం కాగా 5363 అందుబాటులో ఉన్నాయి.

ఫ బ్యాలెట్‌ యూనిట్లు 130 శాతం అందుబాటులో ఉన్నాయి. కంట్రోల్‌ యూనిట్లు 123 శాతం అందుబాటులో ఉన్నాయి. వీవీప్యాట్లు 129 శాతం ఉన్నాయి.

డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లకు ఈవీఎంల తరలింపు

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన ఈవీఎంలను డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్స్‌ (డీసీ)కు తరలిస్తారు. ప్రతి రిసెప్షన్‌ సెంటర్లలో ఉండే స్ర్టాంగ్‌రూముల్లో ఈవీఎంలను భద్రపరుస్తారు. తిరువూరులో బాలికల జెడ్పీ హైస్కూల్‌లో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గాంధీజీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌, సెంట్రల్‌లో ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం, తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎన్‌ఎ్‌సఎం పబ్లిక్‌ స్కూల్‌, మైలవరానికి సంబంధించి లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్‌ స్టేడియం, నందిగామ నియోజకవర్గానికి సంబంధించి కేవీఆర్‌ కాలేజీ, జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి జీవీజే బాలుర జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లలోని స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి పోలింగ్‌ ముందు రోజున పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర స్టేషనరీని అందజేస్తారు.

Updated Date - Apr 12 , 2024 | 12:54 AM