Share News

కొర్లమండలో అత్యవసర వైద్యశిబిరం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:17 AM

మండలంలోని కొర్లమండ గ్రామంలోని గొల్లగూడెం, గౌడ బజారుల్లో కొంత మంది శనివారం ఉదయం నుంచి డయేరియాతో బాధపడుతుండటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

కొర్లమండలో అత్యవసర వైద్యశిబిరం
మెడికల్‌ క్యాంప్‌లో రోగితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుహాసిని

విస్సన్నపేట, జూలై 27: మండలంలోని కొర్లమండ గ్రామంలోని గొల్లగూడెం, గౌడ బజారుల్లో కొంత మంది శనివారం ఉదయం నుంచి డయేరియాతో బాధపడుతుండటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఎంపీడీవో విజయ్‌కుమారి, మండల వైద్యాధికారి శ్రీనివాసరావు స్థానిక వెల్‌నెస్‌ సెంటర్లో మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించారు. డీఐవో హుటాహుటిన కొర్లమండ చేరుకున్నారు. గ్రామానికి చెందిన బి.చిట్టెమ్మ అనే వృద్ధురాలికి విపరీతమైన విరేచనాలు అవ్వడంతో ఆమెను హుటాహుటిన 108లో తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో యువతి ఎం.అనుషాకు ప్రథమ చికిత్స అందించి తిరువూరుకు పంపారు. సమాచారం తెలుసుకున్న డీఎంఅండ్‌హెచ్‌వో సుహాసిని గ్రామానికి చేరుకొని మెడికల్‌ క్యాంప్‌ను సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాగునీరు కలుషితమే విరేచనాలకు కారణమని ప్రఽథమికంగా నిర్ధారణకు వచ్చారు. గ్రామంలో ఉన్న ప్రయివేటు వాటర్‌ ప్లాంట్స్‌ నుంచి శాంపిల్స్‌ తీసుకొని విజయవాడకు పంపినట్లు తెలిపారు. వాటర్‌ ప్లాంట్స్‌లో నీటి అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిపారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తారని, రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆమె తెలిపారు. మొత్తం ఆరుగురు బాధితులను గుర్తించి వారికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:17 AM