జిల్లా అధికారులపై ఎలక్షన్ కమిషన్ నిఘా
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:03 AM
ఎలక్షన్ కమిషన్ నిఘాపెట్టినా.. ఎన్టీఆర్ జిల్లాలో కొందరు అధికారుల్లో లెక్కలేనితనం కనిపిస్తోంది. కోడ్ అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బదిలీ నేపథ్యంలో అయినా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని శాఖల అధికారులు కళ్లు తెరవాలి. కొందరు జిల్లా అధికారులు అధికార పార్టీకి తాబేదుల్లా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోడ్ వచ్చినా అధికార పార్టీ మత్తు వీడని కొందరు అధికారులు
స్వేచ్ఛగా మాట్లాడలేరు.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు
జగన్ పత్రిక మినహా.. మిగిలిన పత్రికలకు దూరం..
పద్ధతి మార్చుకోక పోతే చర్యలు తప్పవు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఎన్టీఆర్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జయచంద్ర గాంధీ విధుల్లో చేరినప్పటి నుంచి అధికార పార్టీకి భజన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు, ఉద్యోగుల గ్రూపుల్లో అధికార పార్టీ అనుకూల సందేశాలు పంపటంతో పాటు, ప్రైవేటుగా పబ్లిక్ గ్రూపుల్లో ఫక్తు వైసీపీ కార్యకర్త మాదిరిగా పార్టీకి ప్రచారం చేస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఆ రెండు పత్రికలు మనల్ని ఫెయిల్యూర్ చేయాలని చూస్తాయంటూ మెసేజ్‌లు పెట్టారు. అంతర్గతంగా వైసీపీ ఏజంట్‌లా పనిచేస్తున్నారు. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుకు ఆయన సహాయ సహకారాలను అందిస్తు మంత్రిగా చూడాలన్న కాంక్షతో ఉన్నారు. స్థానిక జిల్లాకు చెందిన అధికారి ఎన్నికల సందర్భంలో మరోచోటకు బదిలీ చేయాల్సి ఉండగా.. ఆయన్ను అధికార పార్టీ ఒత్తిళ్లతో ఇక్కడే కొనసాగించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. నోడల్ అధికారులుగా కూడా కొందరు పనిచేస్తున్నారు. ఈ విషయంపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులు చూసయినా వారికి డ్యూటీలు ఇవ్వకూడదు. లేదంటే వారిని మరోచోటుకు బదిలీ చేయాలి. జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీ భయం నుంచి బయటపడటం లేదు. కోడ్ అమల్లోకి వచ్చినా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు మినహాయిస్తే ఆయా శాఖల అధికారులు కోడ్ వచ్చినా ఇంకా భయం భయంగానే ఉంటున్నారు. ఎన్నికల విధుల్లోనూ ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయి. మీడియాకు సమాచారం ఇవ్వాలన్నా భయపడిపోతున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి విషయం ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో ఓ పక్క ఎన్నికల సంఘం నిర్దేశిస్తున్నా కూడా.. కొందరు అధికారులు స్వామి భక్తి వీడటంలేదు. జిల్లాలో సమాచార కేంద్రం ఏర్పాటు జరిగినా జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారులకు, సంబంధిత ఎన్నికల విభాగం నుంచి సరిగా సమాచారం రావటం లేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి డిస్ర్టిక్ట్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (డీఈఎంపీ) తయారు కాలేదు. దీనిని బట్టి చూస్తే ఎన్నికల విభాగం ఏ విధంగా పనిచేస్తుందో అర్ధమౌతుంది. సమాచారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తుంటే అధికారులు భయపడిపోతున్నారు. కొందరు నోడల్ ఆఫీసర్లకు ఫోన్లు చేసి తాము ఫలాన పత్రిక అని చెప్పగానే ఫోన్లు పెట్టేస్తున్నారు. ఆ నెంబర్ నుంచి మళ్లీ ఫోన్లు వస్తేఎత్తరు. మీటింగ్‌లో ఉన్నామని, తర్వాత ఫోన్ చేస్తానన్న మెసేజ్ పంపిస్తున్నారు. సమాచారం చెప్పటానికి దాటవేస్తున్నారు. సమాచారం ఇస్తే అంతే సంగతులు అన్న చెడు ప్రచారాన్ని కొంత మంది అధికారులు మిగిలిన వారి దృష్టికి తీసుకువెళుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటున్నా.. నోడల్ ఆఫీసర్లు, అధికారులు మాత్రం ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన వారమన్న సంగతిని మరిచిపోతున్నారు. రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదులు వస్తే.. చెప్పటం కూడా నేరంగా భావించే పరిస్థితి నెలకొంది. కలెక్టర్ దిల్లీరావు, ఇతర రిటర్నింగ్ ఆఫీసర్లు తక్షణం అధికారుల ఫోబియోను వదిలించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి చెడ్డ పేరు తీసుకు వచ్చే అవకాశం ఉంది.