Share News

విలువలతో కూడిన విద్య అందించాలి

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:52 AM

వసతి గృహాల్లో వుండి చదువుకొంటున్న విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందేలా చూడటంతో పాటు భవిష్యత్తులో ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకొనే దిశగా వారిని నడిపించాలని, ఇందుకు షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

విలువలతో కూడిన విద్య అందించాలి

వసతి గృహాల విద్యార్థులను ఉజ్వల కెరీర్‌ దిశగా నడిపించాలి

ప్రణాళిక ప్రకారం ‘ప్రత్యేక’ పాఠ్య కార్యక్రమాల అమలు

వైద్య, ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష

విజయవాడ లీగల్‌, జూలై 2 : వసతి గృహాల్లో వుండి చదువుకొంటున్న విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందేలా చూడటంతో పాటు భవిష్యత్తులో ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకొనే దిశగా వారిని నడిపించాలని, ఇందుకు షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఈ శాఖల కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో ప్రవేశాలు జరిగేలా చూసి నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేసే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు ఆయా విభాగాల్లో నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, విలువలతో బయటకు వచ్చినప్పుడే వసతి గృహాల లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌, మోటివేషన్‌ క్లాసులు వంటివి నిర్వహించాలన్నారు. సబ్జెక్టు నిపుణులు, ట్యూటర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం, విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడివున్నారో ఆయా అంశాలపై పట్టు సాధించేలా చూడాలన్నారు. అకడమిక్‌, నాన్‌ అకడమిక్‌ పరంగా అవసరమైన అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.కిరణ్మయి, సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత, మైనార్టీ సంక్షేమ అధికారి షంషున్నీసా బేగం, బీసీ కార్పొరేషన్‌ ఈడీ కె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష

కలెక్టర్‌ సృజన, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై చర్చించారు. ఆసుపత్రుల్లో అందుబాటులో వున్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలందించాలన్నారు.

గర్భిణులకు సంబంధించి మొదటి త్రైమాసికంలో 100 శాతం నమోదు తప్పనిసరని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో గర్భిణులకు అవసరమైన వైద్యసేవలు అందించడంతో పాటు కాన్పులు జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఆరోగ్య కేంద్రం పనిచేయాలని, జిల్లాలో మాతా, శిశుమరణాల నివారణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ జె.సుమన్‌, డీఎల్‌ఏటీఓ జె.ఉషారాణి, డీఐవో అమృత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 12:52 AM