Share News

ఎండలో ఏడిపింఛెన్‌

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:20 AM

కంకిపాడు మండలం గంగూరులో వజ్రమ్మ (75) అనే వృద్ధురాలు పింఛన్‌ కోసం ఎదురుచూస్తూ ఇంటి వద్దే కింద పడిపోయి చనిపోయింది. చల్లపల్లిలో పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాపులపాడు మండలం కొత్తపల్లిలో ఓ వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉన్నా.. ఆమెను స్థానిక వైసీపీ నాయకులు సచివాలయానికి తీసుకొచ్చారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను యాంగ్యులర్‌ సాయంతో అలాగే నిలబెట్టారు. వైసీపీ నాయకులు కావాలనే ఆ వృద్ధురాలిని తీసుకొచ్చారని తెలిసింది. ..ఇలా అనేక నరకయాతనల నడుమ వైసీపీ నాయకుల యాక్షన్‌లో, వలంటీర్ల డైరెక్షన్‌లో బుధవారం రెండు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇదిగో అదిగో.. అంటూ ఎండలో వృద్ధులు, దివ్యాంగులను సచివాలయాల సిబ్బంది ముప్పుతిప్పలు పెట్టగా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు పెన్షన్‌దారులను ఆటోల్లో సచివాలయాలకు తరలించారు. ఇక చాలాచోట్ల వలంటీర్ల పర్యవేక్షణలోనే పింఛన్లు ఇప్పించడం వివాదాస్పదమైంది.

ఎండలో ఏడిపింఛెన్‌

వలంటీర్ల డైరెక్షన్‌.. వైసీపీ నాయకుల యాక్షన్‌..

సచివాలయాల సిబ్బంది ఓవరాక్షన్‌

పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులకు ముప్పుతిప్పలు

ఎండలో అష్టకష్టాలు పడిన ముదుసలులు

పింఛన్‌దారులను ఆటోల్లో తిప్పిన వైసీపీ నాయకులు

సచివాలయాల వద్దే వలంటీర్ల తిష్ట

నడవలేని స్థితిలోనూ వచ్చిన దివ్యాంగులు

రాత్రి 7.30 గంటల వరకూ సాగిన పంపిణీ

కొన్నిచోట్ల అరకొరగానే.. వచ్చినవారు వెనక్కి..

కంకిపాడు మండలం గంగూరులో వజ్రమ్మ (75) అనే వృద్ధురాలు పింఛన్‌ కోసం ఎదురుచూస్తూ ఇంటి వద్దే కింద పడిపోయి చనిపోయింది.

చల్లపల్లిలో పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

బాపులపాడు మండలం కొత్తపల్లిలో ఓ వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉన్నా.. ఆమెను స్థానిక వైసీపీ నాయకులు సచివాలయానికి తీసుకొచ్చారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను యాంగ్యులర్‌ సాయంతో అలాగే నిలబెట్టారు. వైసీపీ నాయకులు కావాలనే ఆ వృద్ధురాలిని తీసుకొచ్చారని తెలిసింది.

..ఇలా అనేక నరకయాతనల నడుమ వైసీపీ నాయకుల యాక్షన్‌లో, వలంటీర్ల డైరెక్షన్‌లో బుధవారం రెండు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇదిగో అదిగో.. అంటూ ఎండలో వృద్ధులు, దివ్యాంగులను సచివాలయాల సిబ్బంది ముప్పుతిప్పలు పెట్టగా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు పెన్షన్‌దారులను ఆటోల్లో సచివాలయాలకు తరలించారు. ఇక చాలాచోట్ల వలంటీర్ల పర్యవేక్షణలోనే పింఛన్లు ఇప్పించడం వివాదాస్పదమైంది.

విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : రెండు జిల్లాల్లో కొన్నిచోట్ల బుధవారం మధ్యాహ్నం, మరికొన్నిచోట్ల సాయంత్రం పింఛన్ల పంపిణీ జరిగింది. కదల్లేని స్థితిలో ఉన్న వారందరికీ ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సచివాలయాలకు రావాల్సిందేనని ఆదేశించారు. కొందరు తాము ఆసుపత్రుల్లో ఉన్నామని, రాలేమని చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సహనానికి పరీక్ష పెట్టారు. కొన్నిచోట్ల పింఛన్లు ఎప్పుడిస్తారో తెలియక బుధవారం ఉదయం నుంచే పింఛన్‌దారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయాలు తెరిచినా.. ఇంకా నగదు చేతికందలేదని, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇస్తామని సచివాలయ సిబ్బంది చెప్పి పంపేయడంతో వృద్ధులు, దివ్యాంగులు వెనుదిరిగారు. కొన్నిచోట్ల రాత్రి 7.30 గంటల వరకూ పెన్షన్‌ పంపిణీ జరిగింది. చాలా సచివాలయాల పరిధిలో డబ్బు సరిపడా తీసుకురాలేదు.

ఎక్కడికక్కడ వైసీపీ మాయ

ఎక్కువ మంది వృద్ధులను రప్పించేందుకు అధికార పార్టీ నాయకులు ఫోన్లు మీద ఫోన్లు చేశారు. దీంతో సచివాలయాల వద్ద రద్దీ ఏర్పడింది. ఈ రద్దీని ఎక్కువగా చూపించడానికి విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లోని పలు సచివాలయాల్లో సాయంత్రం వరకు కూడా పింఛన్లు ఇవ్వలేదు. అదేమని అడిగితే.. బ్యాంకుల నుంచి ఇంకా డబ్బు రాలేదని సమాధానం చెప్పారు. దీంతో వృద్ధులు రెండు, మూడు గంటలకు పైగా అక్కడే పడిగాపులు పడాల్సి వచ్చింది. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ అందజేస్తారని చెప్పినా వైసీపీ నాయకులు వారిని ఆటోల్లో సచివాలయాల వద్దకు తీసుకొచ్చారు. కొందరు వృద్ధులు నడవలేని స్థితిలో, కళ్లు సక్రమంగా కనిపించకున్నా ఇబ్బందులు పడుతూ వచ్చారు. అవనిగడ్డ మండలంలో ఆటోల ద్వారా పింఛనుదారులను సచివాలయాలకు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ నాయకులు వృద్ధులు, దివ్యాంగులను ఇలా వాడుకున్నారు.

చాలాచోట్ల వలంటీర్లు ప్రత్యక్షం

వలంటీర్లు పింఛన్‌ పంపిణీకి దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినా పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ నాయకుల సూచనలతో వలంటీర్లు సచివాలయ వద్దే కనిపించారు. మచిలీపట్నంలోని 45వ డివిజన్‌లో పదిమందికి పైగా వలంటీర్లు పింఛనుదారులను ఆటోల్లో తీసుకొచ్చారు. కొంతమంది పింఛనుదారులకు వలంటీర్లు ఫోన్లు చేసి మరీ సచివాలయం వద్దకు పిలిపించారు. సచివాలయం వద్ద వలంటీర్లు ఉండగా, మీడియా వారు ఫొటోలు తీశారు. వైసీపీ 45వ డివిజన్‌ ఇన్‌చార్జి ఎ.శ్రీనివాస్‌ అక్కడకు వచ్చి.. వలంటీర్ల ఫొటోలు ఎవరు తీశారంటూ వీరంగం సృష్టించాడు. ఫొటోలు తీసిన వారిపై కేసు పెట్టాలంటూ పెద్దపెద్ద కేకలు వేశాడు. 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఓ మహిళ కాగా, తానే డివిజన్‌కు ఇన్‌చార్జినంటూ ఈయన చేసే హంగామా అంతా ఇంతా కాదని అక్కడున్న పింఛనుదారులే గుసగుసలాడుకున్నారు. తాము తీసుకొచ్చిన పింఛనుదారులు బయటకు వచ్చే వరకు వలంటీర్లు అక్కడే వేచి ఉన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

జిల్లాలో ఇలా..

ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించినా విజయవాడ నగరం, జగ్గయ్యపేటలో మాత్రం సాయంత్రం నుంచి చేపట్టారు. కేవలం 43 శాతం మేర పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 2,72,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి రూ.71 కోట్ల మేర పెన్షన్‌ ఇవ్వాల్సి ఉంది. బుధవారం రాత్రి 8 గంటల నాటికి 1,15,000 మందికి అందించారు. సచివాల యాలకు పూర్తిస్థాయిలో డబ్బు జమ కాలేదు. సచివాలయాలకు పెన్షన్ల డబ్బు రాక ఇబ్బందులు పడుతుంటుంటే, మరోపక్క పెన్షన్ల కోసం రావాల్సిందిగా గ్రామాల్లోని వైసీపీ నాయకులు పెన్షనర్లకు ఫోన్లు చేసి చెప్పారు. దీంతో బుధవారం ఉదయమే వచ్చినవారితో రద్దీ పెరిగింది. వృద్ధులను ఉద్దేశపూర్వకంగా గ ంటల తరబడి కూర్చోబెట్టారు.

జిల్లాలో ఇలా..

అధికారుల లెక్కల ప్రకారం కృష్ణాజిల్లాలో 2,44,262 మంది సామాజిక పింఛన్‌ తీసుకునే వారున్నారు. వీరికి పింఛన్ల రూపంలో రూ.72 కోట్లు ఇవ్వాలి. బుధవారం సాయంత్రానికి రూ.68 కోట్లే బ్యాంకుల నుంచి డ్రా చేశారు. మిగిలిన రూ.4 కోట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి డ్రా చేయాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో కుదరలేదు. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి కృష్ణాజిల్లాలో 80 వేల మందికి పింఛన్‌ అందజేశామని, రాత్రి పొద్దుపోయే వరకు 50 శాతం మందికి అందజేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్‌డీఎ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. లేవలేని స్థితిలో ఉన్నవారికి సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి ఇస్తారన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 01:20 AM