Share News

తూర్పు బై‘పాస్‌’

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:33 AM

ఇన్నాళ్లూ వైసీపీ తొక్కిపెట్టిన కీలక ప్రాజెక్టులన్నింటికీ వరుసగా మోక్షం లభిస్తోంది. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో జిల్లాకు వరాలజల్లు కురిసింది. తూర్పు బైపాస్‌ రోడ్డుకు లైన్‌క్లియర్‌ కావడంతో పాటు వెస్ట్‌ బైపాస్‌ను త్వరగా పూర్తిచేసేలా, విజయవాడ నగరంలో అతిపెద్ద ఫ్లై ఓవర్‌కు, అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అనుమతి లభించింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని చిన్ని జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి.

తూర్పు బై‘పాస్‌’
ఢిల్లీలో చర్చల అనంతరం కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని చిన్ని, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీల మాటామంతీ..

కేంద్రమంత్రితో చంద్రబాబు, ఎంపీ కేశినేని చిన్ని భేటీ

ప్రాజెక్టుల అవసరం గురించి సుదీర్ఘ వివరణ

అన్నింటికీ సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

వెస్ట్‌ బైపాస్‌ ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ

నిడమానూరు ఫ్లై ఓవర్‌కు కూడా ఓకే..

అమరావతి రింగ్‌రోడ్డు సాకారానికి సానుకూలత

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : డీపీఆర్‌ పూర్తయిన విజయవాడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను గత వైసీపీ ప్రభుత్వం తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉండేలా మార్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌ అనేది ప్రస్తుతం చిన్న అవుటపల్లి దగ్గర వెస్ట్‌ బైపాస్‌తో అనుసంధానిస్తూ నిర్మించాల్సి ఉండగా, దీనిని పొట్టిపాడు వరకు పొడిగించారు. మాజీమంత్రికి చెందిన లే అవుట్ల వెంబడి వెళ్లేలా చేయటం కోసమే ఇలా చేశారని తెలుస్తోంది. ఈ అలైన్‌మెంట్‌పై పలు విమర్శలొచ్చాయి. తూర్పు బైపాస్‌ డీపీఆర్‌ పూర్తయిన దశలో కేంద్రం లాజిస్టిక్‌ పార్కుకు భూములు ఇవ్వాల్సిందిగా కోరింది. లాజిస్టిక్‌ పార్క్‌ అనేది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు కావటంతో వైసీపీ ప్రభుత్వం సహకరించలేదు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ప్రస్తుతం విజయవాడ తూర్పు బైపాస్‌ అంశాన్ని ఎంపీ కేశినేని చిన్ని తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. స్పందించిన చంద్రబాబు కచ్చితంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టుపై చర్చ జరగడం, గడ్కరీ అంగీకరించడం జరిగిపోయాయి. త్వరలోనే తూర్పు బైపాస్‌కు టెండర్లు పిలిచేందుకు ఆయన ఆమోదం కూడా తెలిపారు. అయితే, చిన్న అవుటపల్లి నుంచి నిర్మించేలా అలైన్‌మెంట్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని జాతీయ రహదారుల సంస్థ దృష్టికి తీసుకురావాలి. అలాగే, కృష్ణానదిలో మూడు కిలోమీటర్ల మేర బ్రిడ్జిని కూడా నిర్మించాలి. ఈ రోడ్డు కాజా వద్ద ఎన్‌హెచ్‌-16కు కలుస్తుంది.

ఆరు నెలల్లో వెస్ట్‌ బైపాస్‌ పూర్తి

గడ్కరీతో జరిగిన చర్చల్లో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దాదాపు 90 శాతం పనులు పూర్తయినా హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కారణంగా అసంపూర్తిగా ఉంది. ఇవన్నీ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావటానికి ఆరు నెలల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు. డిసెంబరులో ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అతిపెద్ద ఫ్లైఓవర్‌కు ఓకే

విజయవాడ నగరంలో అతిపెద్ద ఫ్లై ఓవర్‌కు మార్గం సుగమమైంది. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు జంక్షన్‌ వరకు 6.50 కిలోమీటర్ల పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్‌కు డీపీఆర్‌ సిద్ధమైన దశలో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్టు అవసరం గురించి విజయవాడ ఎంపీ వివరించటంతో మార్గం సుగమమైంది. డీపీఆర్‌ దాదాపు పూర్తికావటం వల్ల త్వరలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

అమరావతి అవుటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టుకు కూడా కేంద్రమంత్రి గడ్కరీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమైన జాతీయ రహదారులన్నింటినీ అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానమ య్యేలా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రాజెక్టు ఐదేళ్లుగా మూలనపడింది. టీడీపీ ప్రభుత్వం తిరిగి రావటంతో ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది.

Updated Date - Jul 05 , 2024 | 12:33 AM