మరో ప్లాన్
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:56 AM
రెండడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు.. అన్న చందంగా ఉంది దుర్గగుడి అభివృద్ధి పనుల తీరు. ఇప్పటికే మూడు మాస్టర్ ప్లాన్లు రూపొందించగా, అసలు ఏ ప్లాన్ ప్రకారం పనులు జరుగుతున్నాయో తెలియని సందిగ్ధం నెలకొంది. తాజాగా నాల్గో మాస్టర్ ప్లాన్ తెరపైకి రావడంతో ప్రస్తుతం జరుగుతున్న పనులపై అనుమానాలు నెలకొన్నాయి.

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు మరో మాస్టర్ ప్లాన్
బ్లూప్రింట్‌గా వ్యవహరిస్తూ రూపకల్పన
వైసీపీ హయాంలోని ప్లాన్‌కు పడని ఆమోదముద్ర
అయినా పనులు ప్రారంభించేసిన గత పాలకులు
తాజా బ్యూప్రింట్‌తో నిర్మాణ పనులపై సందిగ్ధం
ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణం నిలుపుదల
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే మిగులుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి మాస్టర్ ప్లాన్లు తయారవుతున్నా ఒక్కటి కూడా అమలుకు నోచుకోవట్లేదు. తాజాగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులు మరో కొత్త ప్రణాళికను జత చేశారు. కొద్దిరోజులుగా దేవస్థాన అధికారులు ఓ కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. దీన్ని మాస్టర్ ప్లాన్‌గా కాకుండా బ్లూప్రింట్‌గా వ్యవహరిస్తున్నారు.
డ్రోన్ సర్వే పూర్తి
కొత్తగా రూపొందించనున్న బ్లూప్రింట్‌కు సంబంధించి ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ సర్వేను పూర్తి చేసిందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇంద్రకీలాద్రిపై ప్రధానాలయం, ఆలయం వెనుక ఉన్న ఇంద్రగిరులు, మల్లేశ్వరస్వామి ఆలయం, మహామండపం, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో ఈ డ్రోన్ సర్వే చేశారు. దీనికి అనుగుణంగా బ్లూప్రింట్‌ను తయారు చేస్తున్నారు.
తాజా ప్లాన్‌తో కలిపి మొత్తం నాలుగు
ఇంద్రకీలాద్రికి ఇప్పటికే మూడు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. వీటిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. దీని ప్రకారమే కనకదుర్గానగర్‌లో మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద అన్నదాన భవనం, మహామండపం పక్కన ప్రసాదాల తయారీ పోటు నిర్మిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ, దేవస్థాన అధికారులు కలిసి తయారుచేసిన ఈ ప్లాన్‌కు అప్పటి ప్రభుత్వం ఆమోదముద్ర వేయలేదు. తన పాలనలో కాగితాలకు ఎక్కి, త్రీడీ డిజైన్లను తీసుకున్న ఈ ప్లాన్‌కు ఆమోదముద్ర వేయకపోవడం గమనార్హం. అయినప్పటికీ కనకదుర్గానగర్‌లో నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈ ప్లాన్‌లో చూపించిన ఎలివేటెడ్ క్యూలైన్ నిర్మాణాన్ని మాత్రం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎలివేటెడ్ క్యూలైన్‌కు అవసరమైన గోతులను తవ్వారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవస్థాన అధికారులతో జరిగిన సమావేశాల్లో ఎలివేటెడ్‌పై కొత్తకొత్త అభిప్రాయాలు వచ్చాయి. ఎలివేటెడ్‌ను ఏం చేయాలన్న దానిపై తుది నిర్ణయం వచ్చే వరకు నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని భావించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రసాదం తయారీ పోటు, అన్నదాన కాంప్లెక్స్ పనులు పూర్తయ్యేలోపు కొత్తగా రూపొందిస్తున్న బ్లూప్రింట్‌కు ఒక రూపు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత దాని ప్రకారం పనులు జరుగుతాయి.