Share News

ఎన్నికల కోడ్‌ వల్ల తాగునీటి సరఫరాకు తగినన్ని ట్యాంకర్లు పెట్టలేదు

ABN , Publish Date - May 30 , 2024 | 01:01 AM

ఎన్నికల కోడ్‌ ఉండటం వల్ల తగినన్ని ట్యాంకర్లు పెట్టలేదని కౌన్సిల్‌ సమా వేశంలో మునిసిపల్‌ ఏఈ రోహిత్‌ సమాధానం చెప్పడంపై టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యం తరం తెలిపారు.

ఎన్నికల కోడ్‌ వల్ల తాగునీటి సరఫరాకు తగినన్ని ట్యాంకర్లు పెట్టలేదు
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం

తిరువూరు కౌన్సిల్‌ సమావేశంలో ఏఈ రోహిత్‌

ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిలర్లు

నీటి సరఫరా కోడ్‌ ఉల్లంఘన ఎలా అవుతుందని నిలదీత

తిరువూరు, మే 29: ఎన్నికల కోడ్‌ ఉండటం వల్ల తగినన్ని ట్యాంకర్లు పెట్టలేదని కౌన్సిల్‌ సమా వేశంలో మునిసిపల్‌ ఏఈ రోహిత్‌ సమాధానం చెప్పడంపై టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యం తరం తెలిపారు. వేసవిలో తాగునీటి సరఫరా అత్యవసరమని అది కోడ్‌ ఉల్లంఘన ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. బుధవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ పట్టణంలో తాగునీటి సమస్యపై, 8వ వార్డు కౌన్సిలర్‌ నాళ్లా సురేంద్ర ధ్వంస మైన కల్వర్టు నిర్మాణంపై ప్రశ్నిచారు. ఏఈ రోహిత్‌ సమాధానం చెబు తూ ఎన్నికల కోడ్‌వల్ల తాగునీటి సరఫరాకు ఎక్కువ ట్యాంకర్లు పెట్టలేదని, వార్డులో కొందరు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో కల్వర్టు పనులు ప్రారంభించలేదని తెలిపారు. పనులు ఎవరు చేయొద్దన్నారో చెప్పాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ప్రస్తుతం 7 ట్యాంకర్లద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని, వైసీపీ కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు(బీరువాలబాబు)లు చెప్పడంతో, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివా దం జరిగింది. వార్డుల్లో తాగునీరు సక్రమంగా అందక మహిళలు వార్డు సచివాలయాల వద్ద, ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్నా పాలకపక్షం పట్టించుకోవడం లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మీరే వార్డుల్లో మహిళలకు డబ్బులిచ్చి ఆందోళన చేయిస్తున్నారని, వైసీపీ కౌన్సిలర్లు అన్నారు. ఇదే సందర్భంలో ఏఈ తానొక ఉద్యోగినని విస్మరించి, వైసీపీ కౌన్సిలర్లతో పాటుగా, టీడీపీ సభ్యులపై తీవ్రస్వరంతో వాదనకు దిగాడు. వేసవిలో తాగునీటి సరఫరా కోసం ట్యాంకర్లు అవసరమని తీర్మానం చేస్తే 6 ట్యాంకర్లు మునిసిపాలిటికి వచ్చాయని, వాటితో నీటి సరఫరా జరుగుతుందని కొందరు కౌన్సిలర్లు అనగా ప్రజల అవసరం నిమిత్తం అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవచ్చని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. గ్రంథాలయం పన్ను చెల్లింపునకు రూపొందించిన సింగిల్‌ అజెండాను సభ్యులు ఆమోదించారు. వైస్‌చైర్‌పర్సన్లు వెలుగొటి విజయలక్ష్మి, గుమ్మ వెంకటేశ్వరి, ఆర్‌ఐ విజయ్‌, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 01:01 AM