డ్రోన్లొచ్చాయ్!
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:15 AM
విజయవాడకు డ్రోన్లొచ్చాయ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల డ్రోన్లు వచ్చాయ్. ఆకాశమే హద్దుగా మంగళ, బుధవారాల్లో షో నిర్వహిం చేందుకు డ్రోన్లన్నీ సిద్ధమయ్యాయి. ఆదివారం బబ్బూరి గ్రౌండ్స్‌కు పెద్ద ఎత్తున డ్రోన్ ఆపరేటర్లు చేరుకున్నారు.
ఆకాశం అదిరేలా రేపు, ఎల్లుండు డ్రోన్ షో
బబ్బూరి గ్రౌండ్స్‌కు చేరిన 5 వేల డ్రోన్లు
షోకు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు
సెన్సార్లు, బ్యాటరీలు తనిఖీ
పూర్తి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా డ్రోన్ షో
వీక్షకుల కోసం పున్నమి ఘాట్‌లో గ్యాలరీలు ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడకు డ్రోన్లొచ్చాయ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల డ్రోన్లు వచ్చాయ్. ఆకాశమే హద్దుగా మంగళ, బుధవారాల్లో షో నిర్వహిం చేందుకు డ్రోన్లన్నీ సిద్ధమయ్యాయి. ఆదివారం బబ్బూరి గ్రౌండ్స్‌కు పెద్ద ఎత్తున డ్రోన్ ఆపరేటర్లు చేరుకున్నారు. పూర్తి కంప్యూటరైజ్డ్ విధానంలో నడిచే ఈ డ్రోన్ షోకు డ్రోన్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. డ్రోన్లను సీరియల్ నంబర్‌గా వరుస క్రమంలో పెడుతున్నారు. డ్రోన్లలోని బ్యాటరీలను తీసి ఫుల్ చార్జింగ్ పెట్టడంతో పాటు వాటిని కూల్ చాంబర్లలో ఉంచుతున్నారు. మొత్తం ఐదు వేల డ్రోన్లలో ఏ ఒక్క డ్రోన్ కూడా షో సందర్భంలో ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి వీలుగా వాటిని సంసిద్ధం చేస్తున్నారు. ఈ డ్రోన్లన్నీ కూడా పూర్తి సెన్సార్లతో కూడుకుని ఉంటాయి. ఒక డ్రోన్‌కు మరో డ్రోన్ టచ్ కాకుండా ఉంటాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా సెన్సార్లకు వచ్చే సిగ్నల్స్ ఆధారంగా డ్రోన్లు ముందుకు కదులుతాయి. డ్రోన్ షోలో ప్రదర్శించే చిత్రాలను ముందుగా ప్రోగ్రామింగ్ చేస్తారు. సెన్సార్లకు వచ్చే సిగ్నల్స్ ద్వారా వెంటనే నిర్ణీత ప్రదేశాలలో డ్రోన్లు ఉంటాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇచ్చే ఆకృతిలో ఏ డ్రోన్ ఎక్కడ ఉండాలో సెన్సార్ల ద్వారా ఆయా డ్రోన్లకు సంకేతాలు అందుతాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆకాశంలో డ్రోన్లు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. డ్రోన్లకు ఉండే సెన్సార్లు చాలా సున్నితంగా ఉంటాయి. సెన్సార్లు దెబ్బతింటే ’షో’ కు ఇబ్బంది ఎదురవుతుంది. అందువల్ల సెన్సార్ల పనితీరును ఆదివారం డ్రోన్ ఆపరేటర్లు పరీక్షించారు. ఇలా ఐదు వేల డ్రోన్లకు సంబంధించిన సెన్సార్లను పరీక్షించారు.
వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు
డ్రోన్ షో ఈవెంట్‌కు భారీగా తరలివ చ్చే సందర్శకుల కోసం మరో వైపు పున్నమి ఘాట్‌లో పెద్ద ఎత్తున గ్యాలరీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ గ్యాలరీలలో భారీ సంఖ్యలో సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, సందర్శకుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు
బబ్బూరి గ్రౌండ్స్‌లో వీక్షకులకు ఆనందాన్ని పంచేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు ముంబై డ్యాన్సర్లతో ప్రత్యేక షో నిర్వహించనున్నారు.