Share News

ఎండగట్టారు..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:47 AM

నడినెత్తిన ఎండ.. నడవలేని పరిస్థితి.. అయినా కాళ్లీడ్చుకుంటూ సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులకు రెండోరోజు గురువారం కూడా పెన్షన్ల పంపిణీలో సచివాలయాల సిబ్బంది చుక్కలు చూపించారు. డబ్బు రాలేదంటూ మధ్యాహ్నం వరకూ అలాగే కూర్చోబెట్టి, సరిగ్గా భోజన సమయంలో క్యూల్లో నిలబెట్టి పండుటాకులను ఇబ్బందులు పెట్టారు. సరైన సౌకర్యాలు లేక, సత్తువ రాక ముదుసలులు నానా అగచాట్లు పడ్డారు.

ఎండగట్టారు..!

పెన్షన్ల పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు ఎండదెబ్బ

రెండోరోజూ బ్యాంకుల నుంచి ఆలస్యంగా వచ్చిన డబ్బు

మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎండలోనే వృద్ధులు

భోజన సమయంలో హడావిడిగా పంపిణీ

క్యూలో నిలబడే సత్తువ లేక ముదుసలుల నరకయాతన

బందరు మండలంలో ఇంటి వద్ద 75ఏళ్ల వృద్ధుడు మృతి

ప్రతిపక్షాల వల్లేనని పేర్ని కిట్టూ వ్యాఖ్యలు.. వివాదం

నడినెత్తిన ఎండ.. నడవలేని పరిస్థితి.. అయినా కాళ్లీడ్చుకుంటూ సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులకు రెండోరోజు గురువారం కూడా పెన్షన్ల పంపిణీలో సచివాలయాల సిబ్బంది చుక్కలు చూపించారు. డబ్బు రాలేదంటూ మధ్యాహ్నం వరకూ అలాగే కూర్చోబెట్టి, సరిగ్గా భోజన సమయంలో క్యూల్లో నిలబెట్టి పండుటాకులను ఇబ్బందులు పెట్టారు. సరైన సౌకర్యాలు లేక, సత్తువ రాక ముదుసలులు నానా అగచాట్లు పడ్డారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల /మచిలీపట్నం) : పెన్షన్ల పంపిణీలో రెండోరోజు గురువారం కూడా రెండు జిల్లాల్లో హైడ్రామా నడిచింది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం వరకు బ్యాంకుల నుంచి డబ్బు రాలేదు. దీంతో పంపిణీ ప్రక్రియ మధ్యాహ్నం నుంచే చేపట్టారు. తొలిరోజు రద్దీగా ఉంటుందని పింఛన్లు తీసుకోవటానికి రానివారు గురువారం భారీగా గ్రామ సచివాలయాలకు వచ్చారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 12-1 గంటల మధ్య పింఛన్ల పంపిణీ చేపట్టారు. నందిగామ నియోజకవర్గంలో 2 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఉదయం నుంచి వచ్చిన వృద్ధులు సచివాలయాల్లోనే పడిగాపులు పడ్డారు. టెంట్ల కింద కూర్చున్నారు. గురువారం ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు అల్లాడిపోయారు. వీరులపాడు మండలం జుజ్జూరులో టెంట్ల కింద వృద్ధులు పడిగాపులు పడ్డారు. మైలవరం, తిరువూరు, గంపలగూడెం, జి.కొండూరు, పెనుగంచిప్రోలులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇంటికి వెళ్లిపోదామనుకున్న వృద్ధులను వెళ్లనివ్వలేదు. ఇదిగో డబ్బులు వచ్చేస్తున్నాయంటూ మభ్య పెట్టారు. అప్పటికి వృద్ధులు భోజన సమయం కూడా కావటంతో ఇబ్బందులు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులను క్యూలో వచ్చి పెన్షన్లు తీసుకోవాలని సూచించారు. సచివాలయాలకు తలుపులు వేసి పోలీసులను కాపలా పెట్టారు. సచివాలయ సిబ్బంది ఫ్యాన్ల కింద కూర్చుని పెన్షన్లు ఇస్తుంటే, బయట వృద్ధులు మాత్రం క్యూలో ఎండలో నిలబడాల్సి వచ్చింది. కంచికచర్ల టౌన్‌లోని సచివాలయంలోనూ ఇదే పరిస్థితి. గురువారం రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 90 శాతం పెన్షన్లు పూర్తిచేశారు. ఇంకా 40 వేల మంది వృద్ధులకు ఇవ్వాల్సి ఉంది. వీరికి శుక్రవారం అందజేస్తారు.

కృష్ణాజిల్లాలో..

కృష్ణాజిల్లాలో 2,44,262 మంది సామాజిక పింఛన్‌దారులు ఉండగా, గురువారం నాటికి 2,11,394 మందికి అందజేసినట్లు డీఆర్‌డీఏ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. 88 శాతం మందికి పింఛన్లు అందజేశామని, ఈ నెల 6 వరకు మిగిలిన వారికి ఇస్తామన్నారు. జిల్లాలో రూ.72.14 కోట్లు అందజేయాల్సి ఉండగా, గురువారం సాయంత్రానికి రూ.68.87 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తామని, అయినా ఇంకా మిగిలి ఉంటే, మరికొన్ని రోజులు గడువు పొడిగిస్తామని పేర్కొన్నారు.

వృద్ధుడు మృతి.. పేర్ని కిట్టూ రాజకీయం

బందరు మండలం కోన గ్రామానికి చెందిన వెంకట కృష్ణారావు (75) కొద్దిరోజులుగా రుద్రవరంలోని బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్‌ తీసుకోకుండానే ఆయన గురువారం ఉదయం మరణించాడు. రుద్రవరం వెళ్లిన వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టూ.. ప్రతిపక్ష నాయకుల కారణంగానే పింఛన్లు ఇవ్వడంలో జాప్యం జరిగిందని, అందుకే వెంకట కృష్ణారావు మరణించాడని ఆరోపించడం వివాదాస్పమైంది.

Updated Date - Apr 05 , 2024 | 12:47 AM