Share News

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ మాకొద్దు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:46 AM

సామాజిక భద్రత లేని నూతన పెన్షన్‌ విధానం వద్దని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి లీల అన్నారు. ఉద్యోగులకు భద్రత లేని ఈ విధానాన్ని రైల్వే కార్మికులు ముక్తకంఠంతో తిప్పికొట్టాలన్నారు.

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ మాకొద్దు
విజయవాడ రైల్వే డివిజన్‌ ఉద్యోగుల నిరసన దీక్ష

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సామాజిక భద్రత లేని నూతన పెన్షన్‌ విధానం వద్దని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) విజయవాడ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి లీల అన్నారు. ఉద్యోగులకు భద్రత లేని ఈ విధానాన్ని రైల్వే కార్మికులు ముక్తకంఠంతో తిప్పికొట్టాలన్నారు. గురువారం అలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌ఎఫ్‌), దక్షిణ మధ్యరైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ)లు సంయుక్త పిలుపు మేరకు విజయవాడ డివిజన్‌ వ్యాప్తంగా ఎన్‌పీఎస్‌ రద్దు-ఓపీఎస్‌ సాధన కోసం నిరాహార దీక్షలు నిర్వహించారు. డివిజినల్‌ పరిధిలోని అన్ని స్టేషన్లు, యూనిట్లు, డిపోలు, ఇంజనీరింగ్‌ విభాగాల వద్ద రైల్వే కార్మికులు నిరాహార దీక్షలు చేశారు. విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో లీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాత పెన్షన్‌ విధానంలో నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీవిరమణ చేస్తే చివరి రోజు వచ్చే జీతంలో సగం భాగం మాత్రమే పెన్షన్‌ వస్తుందని, నూతన పెన్షన్‌ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు రెండువేల నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే పెన్షన్‌ ఇవ్వడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో పాత పెన్షన్‌ కొనసాగిస్తామని చెప్పిన వారినే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్‌ అధ్యక్షులు రామగుప్త మాట్లాడుతూ, నూతన పెన్షన్‌ విధానం వల్ల ఉద్యోగులకు చివరికి మిగిలేది ఏమీ ఉండదని, ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటం కోసమే తాము ఆందోళనలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దీనిలో భాగంగా దే శవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మెకు కూడా వెళ్లే పరిస్థితులు ఉన్నందున కార్మికులంతా కలిసికట్టుగా రావాలన్నారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు పాల్గొని మద్దతు పలికారు. కార్యక్రమంలో లక్ష్మి, శేఖర్‌బాబు, ప్రసాద్‌, సుధీర్‌, భానుబాబు, అహ్మద్‌ షరీఫ్‌, శ్రీనివాసరావు, హారిక, అప్పలనాయుడు, షోకత్‌ ఆలీ, వెంకటేశ్వరరావు, శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:46 AM