లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేట్ పరం చేయొద్దు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:50 AM
లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేట్‌పరం చేయడం వల్ల మోటారు రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కె.దుర్గారావు అన్నారు.

సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్
గవర్నర్‌పేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేట్‌పరం చేయడం వల్ల మోటారు రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కె.దుర్గారావు అన్నారు. లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్ సెంటర్‌లో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో మోటారు రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల మోటారు కార్మికులపై మరింత భారం పడుతుందని, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రభుత్వ అధీనంలోనే వీటి జారీ విధానం ఉండాలని కోరారు. ఆటో కార్మికుల కుటుంబాలు సరైన కిరాయిలు లేక పూట గడవడమే కష్టంగా మారిందని, ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఆటో, మోటారు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.రూబెన్‌కుమార్, సెంట్రల్ సిటీ ఆటో వర్క ర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, సిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటయ్య, నాగబ్రహ్మం, సూర్యనారాయణ పాల్గొన్నారు.