Share News

మా భూముల్లో ఇసుక తవ్వొద్దు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:31 AM

మండలంలోని రొయ్యూరు క్వారీలో అడ్డగోలు ఇసుక దోపిడీని ఎస్సీ సొసైటీ రైతులు శనివారం అడ్డుకున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిందని అడ్డగోలుగా తమ సొసైటీ భూముల్లో దారివేసి ఎలా ఇసుక దోపిడీ చేస్తారని నిర్వాహకులకు రైతులు ఎదురు తిరిగారు.

మా భూముల్లో ఇసుక తవ్వొద్దు
రొయ్యూరు క్వారీలో ఇసుక లారీలను అడ్డుకున్న ఎస్సీ సొసైటీ రైతులు

ప్రభుత్వ జీవోను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారు

రొయ్యూరులో క్వారీ నిర్వాహకులకు ఎదురుతిరిగిన ఎస్సీ సొసైటీ రైతులు

ఇసుక లారీల నిలిపివేత

తోట్లవల్లూరు: మండలంలోని రొయ్యూరు క్వారీలో అడ్డగోలు ఇసుక దోపిడీని ఎస్సీ సొసైటీ రైతులు శనివారం అడ్డుకున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిందని అడ్డగోలుగా తమ సొసైటీ భూముల్లో దారివేసి ఎలా ఇసుక దోపిడీ చేస్తారని నిర్వాహకులకు రైతులు ఎదురు తిరిగారు. దీంతో ఇసుక లారీలు నిలిచిపోయాయి. ఈ నెల 12వ తేదీన ఇసుక తవ్వకాలు మొదలు పెట్టగా ఎలాంటి అనుమతులు లేవని, తవ్వకాలను నిలిపివేయాలని తహసీల్ధార్‌ ఎం కుసుమకుమారి సూచించినా నిర్వాహకులు వెనక్కి తగ్గలేదు. ఎక్కడకు వెళుతుందో తెలియకుండా విచ్చిలవిడిగా తవ్వకాలు జోరందుకోవటంతో ఎస్సీ సొసైటీ ప్రతినిధి పులి ప్రసాద్‌ నేతృత్వంలో రైతులు ముందుకువచ్చి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లారీల యజమానులు క్వారీ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకుని తహసీల్ధార్‌ కుసుమకుమారి క్వారీ వద్దకు వచ్చారు. ఎస్సై విశ్వనాథ్‌ను పిలిపించారు. ఇసుక లారీలను కార్యాలయానికి తీసుకెళతామని తహసీల్దార్‌ చెప్పటంతో లారీల యజమానులు అంగీకరించలేదు. ఇసుక క్వారీ తెరిచామంటే తమ లారీలను పంపామని, ఇసుక తవ్వేవారికి జరిమానాలు వేయకుండా లారీలకు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడంది. లారీలను తీసుకురాలేకపోయారు. ఇసుక తవ్వవద్దని సిబ్బందికి తహసీల్దార్‌ సూచిం చారు. అధికారపార్టీ పెద్దల అండదండలతోనే జిల్లాకు ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకుని నిర్వాహకులు అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - Jan 21 , 2024 | 01:31 AM