దేవినేని ఇంట విషాదం

ABN , First Publish Date - 2024-02-09T01:05:04+05:30 IST

టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంలో విషాదం నెలకొంది. దేవినేని ఉమా, దివంగత వెంకటరమణ సోదరుడైన చంద్రశేఖర్‌ (56) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు.

దేవినేని ఇంట విషాదం

కంచికచర్ల, ఫిబ్రవరి 8 : టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంలో విషాదం నెలకొంది. దేవినేని ఉమా, దివంగత వెంకటరమణ సోదరుడైన చంద్రశేఖర్‌ (56) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. చంద్రశేఖర్‌ కొద్దిరోజుల నుంచి ఊపిరితిత్తులకు సంబంధించిన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాసకు ఇబ్బంది కలగటంతో చికిత్స నిమిత్తం వారం క్రితం ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. వైద్యులు మంగళవారం శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యంగా తిరిగి వస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో బుధవారం రాత్రి చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ భౌతికకాయాన్ని గురువారం మధ్యాహ్నం స్వగ్రామం కంచికచర్లలోని ఇంటికి తీసుకొచ్చారు. ఉమాతో పాటు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు.. చంద్రశేఖర్‌ భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నెట్టెం రఘురామ్‌, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, టీడీపీ నాయకులు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, కనపర్తి శ్రీనివాసరావు, శ్రీరాం తాతయ్య, దాసరి బాలవర్ధనరావు, బోడె ప్రసాద్‌, నాగుల్‌మీరా, ఎంఎస్‌ బేగ్‌, నూతలపాటి బాల, చలసాని ఆంజనేయులు, ఆచంట సునీత, పట్టాభి, గన్నె వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్నా), కోట వీరబాబు, ఆళ్ల గోపాలకృష్ణ, జనసేన నాయకులు తంబళ్లపల్లి రమాదేవి, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌, బండారు హనుమంతరావు తదితరులు చంద్రశేఖర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గురువారం సాయంత్రం దేవినేని రమణ ఘాట్‌ వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2024-02-09T01:05:05+05:30 IST