Share News

దయగల మాతా.. ధన్యులం

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:13 AM

గుణదలమాత నిష్కళంక మాతగా భక్తులచేత నీరాజనాలు అందుకొంటుందని.. తల్లి మరియ ద్వారా కారుణ్య రక్షకుడిగా యేసుక్రీస్తు ఉద్భవించారని ఇండియా, నేపాల్‌ పోప్‌ వాటికన్‌ రాయబారి లియోపొల్దొ జిరెల్లి తెలిపారు.

దయగల మాతా.. ధన్యులం
భక్తులను ఉద్దేశించి సందేశమిస్తున్న లియోపొల్దొ జిరెల్లి

గుణదల, ఫిబ్రవరి 11 : గుణదలమాత నిష్కళంక మాతగా భక్తులచేత నీరాజనాలు అందుకొంటుందని.. తల్లి మరియ ద్వారా కారుణ్య రక్షకుడిగా యేసుక్రీస్తు ఉద్భవించారని ఇండియా, నేపాల్‌ పోప్‌ వాటికన్‌ రాయబారి లియోపొల్దొ జిరెల్లి తెలిపారు. గుణదలమాత 100 వసంతాల మహోత్సవాలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి. చివరిరోజున శతాబ్ది మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన పోప్‌ రాయబారి లియోపొల్దొ జిరెల్లి భక్తులను ఉద్దేశించి సందేశమిస్తూ దేవుని తల్లి అయిన మరియమాతను శ్రీసభ నిష్కళంక ఉద్భవిగా, రక్షకుని తల్లిగా ప్రకటించిందని తెలిపారు. శతాబ్ది మహోత్సవాలకు విచ్చేసిన గుణదలమాత భక్తులందరికీ పోప్‌ ఫ్రాన్సిస్‌ శుభాశిస్సులు దీవెనలు అందజేస్తున్నానని చెప్పారు. శతాబ్ది మహోత్సవాలు జరుపుకుంటున్న కేథలిక్‌ డయోసిపై దేవుడు చేసిన మేలుకుగాను ఈ 100 వసంతాల దివ్యపూజాబలిలో కృతజ్ఞతలు చెల్లించుదామని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు.

గుణదలమాత పుణ్యక్షేత్రం నూరు వసంతాల వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో విశ్వశ్రీసభ కూడా పరిశుద్ధ లూర్దుమాత మహోత్సవాన్ని 32వ ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవాన్ని ఒకే రోజున జరుపుకోవడం చరిత్రపుటల్లో ఒక అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. శతాబ్ది మహోత్సవాల వేడుకల్లో పాలుపంచుకోవడం మిక్కిలి సంతోషంగా ఉందన్నారు. తిరునాళ్లకు వచ్చిన భక్తజనాన్ని చూస్తూ ఉంటే ఆదాం, అవ్వలను సృష్టించిన భావనగా గుణదల పుణ్యక్షేత్ర ప్రాంతం అనిపిస్తుందన్నారు. 100 వసంతాల వేడుకను విజయవంతంగా నిర్వహించిన ఘనత విజయవాడ కతోలిక పీఠం బిషప్‌, పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు విజయవాడ కతోలిక పీఠం పరిధిలో ఉన్న గురువులకే చెల్లుతుందని కొనియాడారు.

శతాబ్ది మహోత్సవాల కళావేదికపై లియోపొల్దొ జిరెల్లి, గౌరవ అతిథి విశాఖపట్నం ఆర్చ్‌ బిషప్‌ మల్లవరపు ప్రకాష్‌, విజయవాడ బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు, తదితర 180మంది గురువులతో కలిసి ముగింపు శతాబ్ది మహోత్సవాల సమిష్టి ద్యిపూజాబలి సమర్పించారు. అనంతరం వాటికన్‌ రాయబారి, గురువులు కతోలిక భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. గుణదల మాత పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గుణదలకొండ మార్గాలన్నీ కిటకిటలాడాయి.

Updated Date - Feb 12 , 2024 | 01:13 AM