Share News

దళిత ద్రోహి జగన్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:56 AM

ఎందరో దళితుల ఉసురుపోసుకుని, మాస్కులు ఇవ్వమని అడిగినందుకు దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ను అతికిరాతకంగా పొట్టన పెట్టుకున్న దళిత ద్రోహి సీఎం జగన్‌ అని, దళితులంతా ఐక్యమై జగన్‌ను గద్దె దించాలని, దళితులకు మేలు కలగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. మైలవరంలో మంగళవారం రాత్రి జరిగిన దళిత శంఖారావ సభలో వారు మాట్లాడారు.

దళిత ద్రోహి జగన్‌
వసంత, కేశినేని చిన్నిని గెలిపించాలని దళితులకు పిలుపునిస్తున్న వర్ల రామయ్య

మైలవరం, ఏప్రిల్‌ 16 : ఎందరో దళితుల ఉసురుపోసుకుని, మాస్కులు ఇవ్వమని అడిగినందుకు దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ను అతికిరాతకంగా పొట్టన పెట్టుకున్న దళిత ద్రోహి సీఎం జగన్‌ అని, దళితులంతా ఐక్యమై జగన్‌ను గద్దె దించాలని, దళితులకు మేలు కలగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. మైలవరంలో మంగళవారం రాత్రి జరిగిన దళిత శంఖారావ సభలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు దళితులకు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఆ తర్వాత అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఆయనకు దళితులంటే గిట్టదని, ఏనాడైనా పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. జగన్‌ మాయమాటలు నమ్మొద్దన్నారు. యువత, మగవారిని గంజాయికి, మద్యానికి బానిసలుగా చేసిన జగన్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌, విజయవాడ పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిని దళితులంతా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. దళితులను గౌరవించేది చంద్రబాబు మాత్రమేనని, ఆయన్ను సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వసంత వెంకట కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలోని దళితులను ఐదేళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానని, ఇకపై కూడా అలాగే చూసుకుంటామన్నారు. ఎస్సీ సామాజిక భవనాల నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే దళితుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేశినేని చిన్ని మాట్లాడుతూ చంద్రబాబు దళితుల అభ్యున్నతికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది దళితులు హత్యలకు, దాడులకు గురయ్యారన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని, సంక్షేమం లేదని, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు సైతం పక్కదారి పట్టాయన్నారు. దళితులకు రక్షణ, సంక్షేమ ఫలాలు అందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల బాలకోటయ్య, శావల దేవదత్‌, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), బీజేపీ నాయకులు నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:56 AM