భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో కోత
ABN , Publish Date - Feb 29 , 2024 | 01:04 AM
కార్మికుల్లో సింహభాగంగా ఉన్న భవన నిర్మాణ రంగ వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలి కొదిలేసింది. మెమో నెంబర్ 1214 ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అమలౌతున్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేయటం పట్ల కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
1214 మెమోతో బిల్డిండ్ వర్కర్స్ సంక్షేమ పథకాల నిలిపివేత
వెల్ఫేర్ బోర్డు ద్వారా పాత విధానం అమలు చేయాలని వేడుకోలు
రెండు రోజుల నిరాహార దీక్షల్లో భవన నిర్మాణ కార్మికులు
కార్మికుల్లో సింహభాగంగా ఉన్న భవన నిర్మాణ రంగ వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలి కొదిలేసింది. మెమో నెంబర్ 1214 ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అమలౌతున్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేయటం పట్ల కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్ ఫండ్ ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా వాటిని కుదించేసింది. ఫలితంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుడు మర ణిస్తే రూ.6 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. సహజ మరణానికి రూ.2 లక్షలు ఇస్తున్నారు. ఇవి కాకుండా వివాహ కానుక, ప్రసవ కానుక, వృత్తిపరమైన పనిముట్లు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇలాంటి పథకాలనే పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటకలలో కూడా అమలు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
1214 మెమో రద్దు కోరుతూ వినతులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్ష మంది వరకు భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. నవరత్నాల పేరుతో గతంలో ఉన్న పథకాలను కూడా నిలుపుదల చేశారు. నవరత్న పథకాల్లో భాగంగా వైఎస్‌ఆర్ బీమా పరిహారం రావాలంటే కుటుంబ పెద్ద చనిపోవాలి. కానీ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పరిహారం రావాలంటే.. కుటుంబ పెద్ద కాకపోయినా ప్రమాదంలో ఎవరు చనిపోతే పరిహారం వచ్చేది. నవరత్న పథకంలో భాగంగా వైఎస్‌ఆర్ బీమా పేరుతో ఉన్న పథకాన్ని తీసేయటం వల్ల ఎంతో మంది మరణించిన భవన నిర్మాణరంగ కార్మికులకు అన్యాయం జరిగింది. నవరత్నాల్లో మరో పథకమైన వైఎస్‌ఆర్ వివాహ కానుక కారణంగా.. భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్న వివాహ కానుకను రద్దు చేశారు. వైఎస్‌ఆర్ వివాహ కానుక కింద కచ్చితంగా అమ్మాయి పదో తరగతి చదివి ఉండాలి. అదే భవన నిర్మాణ బోర్డులో అయితే అలాంటి నిబంధన ఏమీ లేదు. పదో తరగతి వరకు చదివించగలిగే స్తోమత లేని వారి పరిస్థితి ఏమిటని కార్మికులు వాపోతున్నారు. నవరత్నాల్లో సహజ మరణానికి ఎలాంటి నష్టపరిహారం లేదు. ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ పాలైనా కూడా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఎలాంటి జీవన భృతి రావటం లేదు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలైన సంక్షేమ పథకాలు.. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వాటిలో లేవు. దీంతో పాత విధానాన్నే భవన నిర్మాణ రంగ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన 1214 మెమోను రద్దు చేయాల్సిందిగా ఎన్నాళ్ల నుంచో వినతిపత్రాలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.