Share News

భారీగా బాణసంచా

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:52 AM

జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. రెండు నెలల కిందటే శివకాశి నుంచి భారీగా సరుకు దిగుమతి కాగా, గోడౌన్లలో ఉన్న బాణసంచాను వ్యాపారులు బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం భారీ ట్రేడర్ల నుంచి హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో స్టాళ్ల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

భారీగా బాణసంచా

శివకాశి నుంచి జిల్లాకు దిగుమతైన సరుకు

నగర శివారుల్లోని గోడౌన్లలో నిల్వ

ట్రేడర్ల నుంచి హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారుల కొనుగోళ్లు

16 మండల కేంద్రాల్లో ప్రైవేట్‌ స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి

నగరంలోని నాలుగు అర్బన్‌ మండలాల పరిధిలోనూ..

జిల్లావ్యాప్తంగా మొదలైన దీపావళి హంగామా

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దీపావళి సమీపిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా బాణసంచా పెద్ద ఎత్తున దిగుమతైంది. హోల్‌సేల్‌, రిటైల్‌గా అమ్మకాలు సాగించటానికి వీలుగా వ్యాపారులు సరుకును సిద్ధం చేసుకుంటున్నారు.

మొదలైన కోలాహలం

జిల్లావ్యాప్తంగా 235కు పైగా లైసెన్స్‌డ్‌ బాణసంచా వ్యాపారులున్నారు. వీరంతా రెండు నెలల కిందటే శివకాశి నుంచి పెద్ద ఎత్తున సరుకు దిగుమతి చేసుకున్నారు. లైసెన్స్‌డ్‌ వ్యాపారుల్లో కూడా బడా ట్రేడర్లు, మధ్య, చిన్న వ్యాపారులున్నారు. వీరంతా కూడా ఈ దీపావళి వ్యాపారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెల రోజులుగా వాతావరణం బాగోకపోవటం, పండుగ ముందు తుఫాను హెచ్చరికలు రావటంతో నిన్న మొన్నటి వరకు వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. దానా తుఫాను పక్కకు తప్పుకోవడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని బడా ట్రేడర్లు ఇప్పటికే సరుకును గోడౌన్లలో సిద్ధం చేసుకున్నారు. ఒక్కొక్కరూ పదికి తగ్గకుండా గోడౌన్లలో నిల్వ చేశారు.వీటిలో 80 శాతం పైగా సరుకును ఇతర బాణసంచా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మిగిలిన 20 శాతం విక్రయించటానికి సిద్ధమవుతున్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే స్టాళ్ల నిర్వాహకులు బాణసంచాను పెద్ద ఎత్తున ట్రేడర్ల నుంచి కొన్నారు. గొల్లపూడి, మైలవరం, తిరువూరు, గన్నవరం మండలాల పరిధిలో ఈ సరుకు సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచి హోల్‌సేల్‌గా ఇతర వ్యాపారులు కొంటున్నారు. రెవెన్యూ, పోలీసుల అనుమతితో శివారు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే స్టాళ్లను పాడుకునే వారు కూడా పెద్ద ఎత్తున ట్రేడర్స్‌ నుంచి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు.

బాణసంచా స్టాళ్లు ప్రారంభం

జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో బాణసంచా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అనుమతులతో కొంతమంది రిటైల్‌ వ్యాపారులు దుకాణాలకు అనుమతులు తీసుకుని, వాటి కి వేలం నిర్వహించి వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఒక్కో స్టాల్‌ ఖరీదు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. నలుగురైదుగురు వ్యాపారులు కలిసి ఓ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాపారం పూర్తయ్యాక వీరంతా లాభాలను పంచుకుంటారు. జిల్లావ్యాప్తంగా 16 మండల కేంద్రాల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మకాలకు తేదీని ప్రకటించగానే, ఒకరోజు ముందే సరుకును సిద్ధం చేసుకుంటారు. నగరంలోని నాలుగు అర్బన్‌ మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున స్టాళ్ల నిర్వహణకు అనుమతులు లభించాయి.

గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో విక్రయాలు ప్రారంభం

గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో బాణసంచా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి హోల్‌సేల్‌ లైసెన్స్‌డ్‌ వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకు దిగుమతి చేసుకున్నారు. వీరి నుంచి ప్రైవేట్‌ లైసెన్స్‌డ్‌ వ్యాపారులు కూడా కొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:52 AM