Share News

కౌంటింగ్‌ కేంద్రాలు 31 నాటికి సర్వం సిద్ధం

ABN , Publish Date - May 25 , 2024 | 12:35 AM

జిల్లాలో ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి వున్నందున ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను ఈనెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు, పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాలు 31 నాటికి సర్వం సిద్ధం

విజయవాడ లీగల్‌, మే 24 : జిల్లాలో ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి వున్నందున ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను ఈనెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు, పోలీస్‌ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. కలెక్టర్‌, సీపీ, జేసీ, మైలవరం ఆర్వో పి.సంపత్‌కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈనెల 31 నాటికి కౌంటింగ్‌ కేంద్రాల్లో 100 శాతం పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమేరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్‌ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత : సీపీ రామకృష్ణ

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామని, పాస్‌లు, గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల ఆవరణలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు టి.హరికృష్ణ, కె.చక్రవర్తి, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు ఆర్వో బీహచ్‌.భవానీశంకర్‌, తిరువూరు ఆర్వో కె.మాధవి, నందిగామ ఆర్వో ఎ.రవీంద్రరావు, విజయవాడ పశ్చిమ ఆర్వో ఇ.కిరణ్మయి, జగ్గయ్యపేట ఆర్వో జి.వెంకటేశ్వర్లు, డీఐపీఆర్వో యు.సురేంద్రనాథ్‌, డీపీఆర్వో ఎస్‌వీ మోహన్‌రావు, పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు సహకరించండి..

అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష

కృష్ణలంక : రాజకీయ పార్టీల అఽభ్యర్థులు, ప్రతినిధుల సహకారంతో జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి కౌంటింగ్‌ ప్రక్రియను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు కోరారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కలెక్టర్‌ దిల్లీరావు శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జూన్‌ 4న ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో నిర్వహించనున్న కౌంటింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు 18 ఏళ్లు, ఆపై వున్నవారిని కౌంటింగ్‌ ఏజెంట్‌గా నియమించుకోవాలన్నారు. అభ్యర్థి కౌంటింగ్‌ టేబుళ్ల సంఖ్య ఆధారంగా ఏజెంట్లను నియమించుకోవచ్చన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందువల్ల 7 గంటలకల్లా కౌంటింగ్‌ ఏజెంట్లు వుండాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్‌ నియామకపత్రాన్ని, గుర్తింపు కార్డును రిటర్నింగ్‌ అధికారికి చూపిన తర్వాత కౌంటింగ్‌ హాలులోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలక ఘట్టమని, ఈ దశను విజయవంతంగా నిర్వహించడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, డీఆర్వో వి.శ్రీనివాసరావు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ

మచిలీపట్నం టౌన్‌ : కృష్ణా యూనివర్శిటీలో జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న దృష్ట్యా ఏ విధమైన గొడవలు, అల్లర్లు సృష్టించినా, ర్యాలీలు జరిపినా కఠిన చర్యలు తప్పవని బందరు డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌ హెచ్చరించారు. మచిలీపట్నం గొడుగుపేట ఆర్యవైశ్య సత్రంలో శుక్రవారం సాయంత్రం 39వ డివిజన్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, కౌంటింగ్‌ సమయంలో నగరంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలు, డిజేలు ఏర్పాటు చేయకూడదన్నారు. బాణసంచాలు కాల్చకూడదన్నారు. చిలకలపూడి స్టేషన్‌లో సీఐ సతీ్‌షకుమార్‌ ఆధ్వర్యంలో ఇంగ్లీషుపాలెంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది.

Updated Date - May 25 , 2024 | 12:35 AM