అవినీతిమయంగా మెప్మా రాష్ట్ర కార్యాలయం
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:26 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రాష్ట్ర కార్యాలయంలో భారీ అవినీతి జరుగుతోందని, కిందిస్థాయి నుంచి మామూళ్లు వసూలు చేసే సంస్థగా మారిందని నియంతృత్వానికి అడ్డాగా మారిందని ఆర్పీలపై అనేక ఆంక్షలు పెడుతూ అధికారులు వేధింపులు, హింసలకు పాల్పడుతున్నారని ఏపీ మెప్మా ఆర్పీ(రిసోర్స్ పర్సన్స్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఆరోపించారు.
ఏపీ మెప్మా ఆర్పీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి
ధర్నాచౌక్, ఫిబ్రవరి 5: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రాష్ట్ర కార్యాలయంలో భారీ అవినీతి జరుగుతోందని, కిందిస్థాయి నుంచి మామూళ్లు వసూలు చేసే సంస్థగా మారిందని నియంతృత్వానికి అడ్డాగా మారిందని ఆర్పీలపై అనేక ఆంక్షలు పెడుతూ అధికారులు వేధింపులు, హింసలకు పాల్పడుతున్నారని ఏపీ మెప్మా ఆర్పీ(రిసోర్స్ పర్సన్స్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఆరోపించారు. ఈ విధానాలను విడనాడాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేస్తామని ఆమె హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని సంఘం ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఆర్పీలు సోమవారం ధర్నా చేశారు. ఆర్పీలకు 2019లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ఏ కారణంతోనైనా మృతి చెందిన ఆర్పీలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌చేశారు. మహిళా మార్టుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో వస్తువులు కొనుగోలు చేయించేలా టార్గెట్లు పెట్టడం మానుకోవాలన్నారు. పొదుపు సంఘాలకు రూ.20లక్షల వరకు జీరో వడ్డీ వర్తింపజేయాలన్నారు. ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్పీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఆధారంగా జీతాలు తగ్గిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.26 వేలు కనీన వేతనం నేరుగా బ్యాంకు అకౌంట్‌ల్లో జమ చేయాలన్నారు. రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. వివిధ జిల్లాల నుంచి సంఘం ప్రతినిధులు, అధిక సంఖ్యలో ఆర్‌పీలు పాల్గొన్నారు.