Share News

దేవాదాయం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:55 AM

దేవదాయ శాఖకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అధికార పార్టీ నేతల కబ్జాలో ఉన్నా అధికారుల్లో చలనం లేదు. వైసీపీ నాయకులతో కుమ్మక్కైన దేవదాయ శాఖ అధికారులు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారుల తీరుకు సత్యనారాయణపురం శివాలయమే నిదర్శనం.

దేవాదాయం
సీతారామ కల్యాణమండపం

సహకరిస్తున్న దేవదాయ అధికారులు

ఎమ్మెల్యే అనుచరుల చేతిలో సీతారామ కల్యాణమండపం

స్వాధీనానికి 2021లోనే హైకోర్టు ఉత్తర్వులు

విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌ : సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్‌ సెంటర్‌లో శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయానికి 60 ఏళ్ల క్రితం తాడేపల్లి సీతమ్మ 600 గజాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1957లో దేవస్థానం పేరిట రిజిస్టర్‌ చేయించారు. ఈ స్థలానికి వెనుక మరికొందరు దాతలు 300 గజాలు దేవస్థానానికి ఇచ్చారు. ఈ మొత్తం 900 చదరపు గజాలు. దీని విలువ సుమారు రూ.12 కోట్ల పైమాటే. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి అధికార పార్టీకి చెందిన కొందరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 2008లో దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా పనిచేసినవారు ఈ ఆస్తిపై పెత్తనం సాధించడం మొదలు పెట్టారు. 2010లో నాటి ఈవోను సంప్రదించకుండానే 900 గజాల స్థలాన్ని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌, శాశ్వత ధర్మకర్తలు సంతకాలు చేయలేదు. దీంతో ఈ తీర్మానానికి విలువ లేకపోవడంతో దేవదాయ శాఖ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. 2015లో మరోసారి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేయగా, ఈ స్థలం ఆలయానికి చెందినదని, దానిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం కుదరదని స్పష్టం చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవదాయ శాఖ మాజీ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి కన్ను దీనిపై పడింది. అప్పటికే ఆ స్థలంలో దాతలు సీతారాముల కల్యాణమండపాన్ని కూడా నిర్మించారు. వైసీపీ నాయకులు రికార్డులు తారుమారు చేసి అసలు ఆ స్థలం దేవదాయ శాఖకు చెందినదే కాదంటూ వాదనలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ స్థలాన్ని, కల్యాణమండపాన్ని స్థానిక ఎమ్మెల్యే బంధుగణానికి అప్పగించారు. దీంతో వారు ఈ కల్యాణమండపం ద్వారా నెలకు రూ.20 లక్షల పైచిలుకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ మండపం దేవదాయ శాఖదేనంటూ అధికారులు 2020లో కోర్టుకు వెళ్లారు. 2021లో హైకోర్టు సానుకూలంగా ఉత్తర్వులిచ్చింది. కల్యాణమండపాన్ని స్వాధీనం చేసుకోవచ్చంటూ తీర్పు చెప్పింది. కానీ, రాజకీయ ఒత్తిళ్లతో దేవదాయ శాఖ అధికారులు రెండేళ్లు గడిచిపోతున్నా దాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు.

న్యాయసలహా కోసం పంపాం: ఈవో

హైకోర్టు ఉత్తర్వులననుసరించి సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి న్యాయసలహా కోసం రాశామని దేవస్థాన ఈవో డాక్టర్‌ కె.సుపద్నదేవి తెలిపారు. తాను 2023, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించానని, ఆ తర్వాత రికార్డులు పరిశీలించి కల్యాణమండపం ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చామన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:55 AM