Share News

అడహాక్‌ షాక్‌..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:44 AM

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే దేవదాయ శాఖలో అడ్డగోలుగా జరిపిన అడహాక్‌ పదోన్నతులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా ఖరారు చేసి పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు స్పష్టంగా చెప్పినా, ఖాతరు చేయకుండా అడహాక్‌ పేరిట తాత్కాలిక పదోన్నతులు ఇచ్చేయడంపై పలువురు న్యాయపోరాటాలకు సిద్ధమవుతున్నారు.

అడహాక్‌ షాక్‌..!

ఈవో పదోన్నతులపై డైరెక్ట్‌ రిక్రూటీల న్యాయపోరాటం

నిబంధనలు పాటించలేదంటూ కమిషనర్‌కు లేఖ

స్పందన లేకపోవడంతో న్యాయ పోరాటానికి సన్నాహాలు

ఏసీబీ కేసులున్న వారికీ పదోన్నతులపై ఆగ్రహం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గతనెలలో దేవదాయ శాఖలో గ్రేడ్‌-1 ఈవోలకు ఏసీలుగా, ఏసీలకు డీసీలుగా పదోన్నతులిచ్చారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్టీ జోన్లపరంగా చూస్తే మల్టీజోన్‌-1, జోన్లవారీగా చూస్తే జోన్‌-2 పరిధిలో ఉంటుంది. ఇటీవల జోన్‌-2లో సుమారు 10 మంది గ్రేడ్‌-1 ఈవోలకు అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ)లుగా పదోన్నతులు కల్పించారు. వీరిలో నలుగురు ఈవోలపై దేవదాయ శాఖలోనే డైరెక్ట్‌ రిక్రూటీలుగా పనిచేస్తున్నవారు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆ నలుగురి పదోన్నతి అక్రమం

గ్రేడ్‌-1 ఈవోలైన బీఎల్‌ నగేశ్‌, పి.నారాయణమూర్తి, డి.నాగమల్లేశ్వరరావు, ఎన్వీ సాంబశివరావుకు ఏసీలుగా పదోన్నతులు కల్పించడం అక్రమమని గ్రేడ్‌-1 డైరెక్ట్‌ రిక్రూటీలైన ఎస్‌.హేమలత, కె.సుపద్నదేవి తదితరులు కమిషనర్‌కు ఫిబ్రవరి 4న లేఖ రాశారు. సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా వీరికి పదోన్నతులు ఇచ్చారని ఆరోపించారు. ఆలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను తెలిపే జీవో నెంబరు 1478తో పాటు 888 ప్రకారం ఉద్యోగం వచ్చిన ఆలయంలోనే వారు పదోన్నతులు పొందాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఒక ఆలయంలో నియామకమై, మరో ఆలయంలో పదోన్నతి పొందడం సర్వీసు రూల్స్‌కు విరుద్ధమని, పైన పదోన్నతులు పొందినవారిలో అలాంటి వారు ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. దేవదాయ శాఖలో క్లర్కుగా నియామకం కావాలంటే కనీస విద్యార్హత పదో తరగతి. హయ్యర్‌ కేడర్‌కు పదోన్నతి పొందాలంటే దాని దిగువ కేడర్‌లో కనీసం ఐదేళ్లు పనిచేసి ఉండాలి. కానీ, పైన పదోన్నతి పొందిన వారిలో చాలామంది పదో తరగతి విద్యార్హత కూడా లేకుండా విధుల్లో చేరి ఆ తర్వాత డిగ్రీలు పొందారని, కొందరు దిగువ కేడర్‌లో కనీసం ఐదేళ్లు పనిచేయకపోయినా పదోన్నతి కల్పించారని లేఖలో వివరించారు. కేడర్‌ స్ట్రెంత్‌లో క్లియర్‌ వేకెన్సీ ఉంటేనే అందులో పదోన్నతి ద్వారా నియామకాలు జరపాల్సి ఉంది. కానీ, క్లియర్‌ వేకెన్సీ లేకుండానేపైవారి నియామకాలు జరిగిపోయాయని లేఖలో తెలిపారు. అలాగే దేవదాయ శాఖలో చేరే సమయంలో కనీసం 18 ఏళ్లు నిండి 30 ఏళ్లకు మించకుండా వయసు ఉండాలి. అలాంటి వారికే పదోన్నతుల్లో అవకాశం కల్పించాలి. కానీ, పైవారిలో చాలామంది 30 ఏళ్ల తర్వాత విధుల్లో చేరారని, అలాంటి వారికి పదోన్నతులు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. డైరెక్ట్‌ రిక్రూటీల లేఖపై ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు న్యాయపోరాటాలకు సిద్ధమవుతున్నారు. తమకు రావాల్సిన పదోన్నతులను కాసులకు కక్కుర్తిపడి ఉన్నతాధికారులు వేరే వారికి ఎలా కట్టబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏసీ పద్నోతుల్లోనూ అదే దారి

అసిస్టెంట్‌ కమిషనర్లకు పదోన్నతులు కల్పించడంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 20 మంది ఏసీలకు డీసీలుగా పదోన్నతి కల్పించారు. వీరిలో ఎం.విజయరాజు, పి.శ్రీనివాసరెడ్డి వంటి వారిపై ఏసీబీ కేసులున్నా డీసీలుగా పదోన్నతి కల్పించడం వెనుక పెద్ద ఎత్తున కాసులు చేతులు మారాయంటున్నారు. డీసీలుగా పదోన్నతి పొందిన వారిలో సగం మందిపై ఆర్థికపరమైన ఆరోపణలు, శాఖాపరమైన శిక్షలు ఉన్నా అడ్డగోలుగా పదోన్నతులు కల్పించారు. 2019లో ఏసీలుగా పదోన్నతులు పొందిన కేఎన్‌బీ ప్రసాద్‌, రాధ, రామాంజనేయులు, లీలా కుమార్‌, శ్రీరామవరప్రసాద్‌, కిషోర్‌ తదితరులకు కనీసం ఐదేళ్లపాటు ఆ కేడర్‌లో పనిచేయకున్నా డీసీలుగా పదోన్నతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

బడ్జెట్‌ అధికారాలు కట్‌.. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాలు బడ్జెట్‌ కేటాయింపులు చేయించుకోవడం ఆనవాయితీ. ఈ బడ్జెట్‌ కేటాయింపుల తంతును కొందరు ఉన్నతాధి కారులు కాసుల పంటగా మార్చుకున్నారు. ఈ అంశంపై ఆంధ్రజ్యోతి మార్చి 9న ‘బడ్జెట్‌ దందా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ.. రీజనల్‌ జాయుంట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ)కు ఉన్న బడ్జెట్‌ అధికారాలపై కోత పెట్టారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు రూ.కోటిపైన ఆదాయం ఉన్న ఆలయాలు, సత్రాల బడ్జెట్‌లను ఆర్‌జేసీ చూసేవారు. దానికి చెక్‌ పెడుతూ అడిషనల్‌ కమిషనర్‌-2కు బడ్జెట్‌ కేటాయింపు అధికారాలను ఇస్తూ ఆదేశాలిచ్చారు.

Updated Date - Mar 22 , 2024 | 12:44 AM