Share News

ఆదాయానికి టెండర్‌ పెట్టాడు..!

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:47 AM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిర్వహించే టెండర్లలో ఒక ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడు. కాంట్రాక్టర్లు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో కోట్‌ చేసిన ధరల వివరాలను ముందే తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లీక్‌ చేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నాడు. ఫలితంగా దుర్గగుడికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.

ఆదాయానికి టెండర్‌ పెట్టాడు..!

అనుకూల కాంట్రాక్టర్లకు ముందే ధరలు లీక్‌

తక్కువకు కోట్‌ చేస్తున్న కాంట్రాక్టర్లు

సదరు ఆపరేటర్‌కు భారీగా లబ్ధి

దుర్గగుడి ఆదాయానికి మాత్రం గండి

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : దుర్గగుడిలో వివిధ విభాగాలకు అవసరమైన సరుకులకు, అభివృద్ధి పనులకు అధికారులు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌, ఓపెన్‌ టెండర్లు, సీల్‌ టెండర్లు నిర్వహిస్తుంటారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విభాగమంతా ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పర్యవేక్షణలో ఉంటుంది. దీనిద్వారా పిలిచే టెండర్లలో గోల్‌మాల్‌ జరుగుతోందని ఇటీవల దుర్గగుడి అధికారులు గుర్తించారు. దీనిపై అంతర్గతంగా జరిగిన విచారణలో సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ వివిధ టెండర్లకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా వేర్వేరు కాంట్రాక్టర్లు కోట్‌ చేసే ధరలను ముందే తెలుసుకుని తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లీక్‌ చేస్తున్నారని తేలినట్లు సమాచారం. ఇలా ఆ కంప్యూటర్‌ ఆపరేటర్‌ లీక్‌ చేసిన ధరలను బట్టి కాంట్రాక్టర్లు ధరలు కోట్‌ చేసి టెండర్లు దక్కించుకుంటున్నారు. ఈ వ్యత్యాసం రూ.100 నుంచి రూ.1,000 లోపే ఉంటుండటంతో ఇతర కాంట్రాక్టర్లకు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు బండారం బయటపడింది.

గతంలో సస్పెండైనా మళ్లీ కీలక పదవి

ఏళ్ల తరబడి కంప్యూటర్‌ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి అన్నీతానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సదరు ఉద్యోగి గతంలో దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పట్లో ఆలయ అధికారులు కూడా అతన్ని సస్పెండ్‌ చేశారు. గతంలో రూ.25 టికెట్ల గోల్‌మాల్‌లో కూడా ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కంప్యూటర్‌ బిల్లు పేపర్‌ రోల్‌ కొనుగోలు చేయకపోయినా చేసినట్లు దొంగ బిల్లు పెట్టి దేవస్థానం నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా టెండర్ల వ్యవహారంలో ఇతను కీలకపాత్ర పోషించి తనకు అనుకూల కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటున్నాడని సమాచారం.

Updated Date - Mar 12 , 2024 | 12:47 AM