కూటమి విజయంతో కార్పొరేటర్ల సంబరాలు
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:10 AM
రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రజలు నమ్మి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎన్.బాలస్వామి అన్నారు.
కూటమి విజయంతో కార్పొరేటర్ల సంబరాలు
చిట్టినగర్, జూన్ 17: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రజలు నమ్మి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎన్.బాలస్వామి అన్నారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం టీడీపీ ఫ్లోర్‌లీడర్ చాంబర్‌లో టీడీపీ కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు 164 మంది కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు నానా కష్టాలు అనుభవించారని, ఆ కష్టాలు తొలగిపోవాలంటే చంద్రబాబు నాయుడు వంటి నాయకుడి అవసరం ఎంతో ఉందని, ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. ప్రజల నమ్మకం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా కూటమిని భారీ మెజరిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ కార్పొరేటర్ ముమ్మనేని వెంకట ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని, నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారన్నారు. అనంతరం కార్పొరేటర్లు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, చెన్నుపాటి, ఉషారాణి, పొట్లూరి శివపాయి ప్రసాద్, దేవినేని అపర్ణ, వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు.