వారమంతా కూల్..!
ABN , Publish Date - May 17 , 2024 | 12:16 AM
ఎండలు మండిపోవాల్సిన సమయంలో వాతావరణంలో మార్పులొచ్చాయి. ఇన్నాళ్లూ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడిన ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. మరో వారం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు.
ఆ తర్వాత మళ్లీ ఎండలు పెరిగే అవకాశం : వాతావరణ శాఖ
వాతావరణంలో మార్పులే కారణమంటున్న నిపుణులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఎండలు మండిపోవాల్సిన సమయంలో వాతావరణంలో మార్పులొచ్చాయి. ఇన్నాళ్లూ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడిన ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. మరో వారం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు.
రెండు కారణాలు..
కొద్దిరోజుల క్రితం వరకు జిల్లాలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు భయపడ్డారు. కానీ, కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మేఘాల్లో వచ్చిన వ్యత్యాసమే ఈ మార్పునకు కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ట్రఫ్ (మేఘాలు కిందకు వచ్చి విస్తరించడం) ఏర్పడినట్టు వారు స్పష్టం చేస్తున్నారు. ఆకాశం మొత్తం మేఘావృతం కావడంతో ఆ మేఘాలు కొంతమేరకు కిందకు దిగి ఉంటాయని వివరిస్తున్నారు. ఒడిసా నుంచి కేరళ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాన్ని ఒక కారణంగా చెబుతున్నారు. ఈ రెండింటి కారణంగానే వాతావరణంలో మార్పులు వచ్చాయంటున్నారు. ఈ వాతావరణం ఒక వారమే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈనెల 23 నుంచి రోహిణీ కార్తె మొదలుకానుందని, 25వ తేదీ వరకు ఎండలు ఉంటాయంటున్నారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఎల్‌నినో కొనసాగింది. ప్రస్తుతం ల్యానినో ప్రారంభమైనట్టు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది సాధారణం కంటే మించి వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.