Share News

కుట్రలు.. కుయుక్తులు..

ABN , Publish Date - May 08 , 2024 | 12:57 AM

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వైసీపీ నాయకులు అన్ని రకాల అడ్డుదారుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఓటర్లను ఎలాగైనా ప్రలోభ పెట్టేందుకు కుక్కర్లు, హాట్‌బాక్సుల కూపన్లతో పాటు బహిరంగంగానే డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు రాజీనామా చేసిన వలంటీర్లను పావులుగా ఉపయోగిస్తున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో మంగళవారం డబ్బు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు చెందిన మాజీ వలంటీరును టీడీపీ నేతలు అడ్డుకోవడం, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, తప్పును కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు రివర్స్‌ కేసులు పెట్టించడం, ఎక్కడికక్కడ దాడులు.. దౌర్జన్యాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కుట్రలు.. కుయుక్తులు..

ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు.. దౌర్జన్యాలు

సెంట్రల్‌లో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి అనుచరుల అరాచకాలు

మాజీ వలంటీర్లతో ఇంటింటికీ డబ్బు పంపిణీ

కుక్కర్లు, హాట్‌బాక్సుల కూపన్లు కూడా..

టీడీపీలో చేరాడని ఓ కార్యకర్త, అతని భార్యపై దాడి

బొండా ఉమా ఓ గూండా.. అంటూ మైకుల్లో ప్రచారం

దళిత కులానికి చెందిన మహిళపై అసభ్య ప్రవర్తన

పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు

వెంటనే రంగంలోకి దిగిన వెలంపల్లి, ఎమ్మెల్సీ రుహుల్లా

పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై ఎదురు కేసులు

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వైసీపీ నాయకులు అన్ని రకాల అడ్డుదారుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఓటర్లను ఎలాగైనా ప్రలోభ పెట్టేందుకు కుక్కర్లు, హాట్‌బాక్సుల కూపన్లతో పాటు బహిరంగంగానే డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు రాజీనామా చేసిన వలంటీర్లను పావులుగా ఉపయోగిస్తున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో మంగళవారం డబ్బు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు చెందిన మాజీ వలంటీరును టీడీపీ నేతలు అడ్డుకోవడం, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, తప్పును కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు రివర్స్‌ కేసులు పెట్టించడం, ఎక్కడికక్కడ దాడులు.. దౌర్జన్యాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

(విజయవాడ- ఆంధ్రజ్యోతి/ పాయకాపురం) : మొదటి నుంచి వలంటీర్లతో రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకులు తాజాగా ఆ ముసుగు తీసేశారు. ఎన్నికల కోడ్‌ రాకముందే విజయవాడ సెంట్రల్‌లో వలంటీర్లకు తాయిలాలు పంచి మచ్చిక చేసుకున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తాజాగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నారు. కొంతమంది వలంటీర్లతో రాజీనామా చేయించిన వైసీపీ నేతలు ఇప్పుడు వారిని డబ్బు పంపిణీకి వినియోగిస్తున్నారు. మంగళవారం స్థానిక ఎల్‌బీఎస్‌ నగర్‌లో మాజీ వలంటీర్‌ గురుస్వామి వెలంపల్లి తరఫున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడమే కాకుండా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. దీన్ని గమనించిన టీడీపీ నేత బొల్లెద్దుల రవిచంద్ర, మరికొందరు ఆ ప్రాంతానికి చేరుకుని అడ్డుకున్నారు. మాజీ వలంటీరుకు మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలు.. టీడీపీ వారితో వాగ్వివాదానికి దిగారు. చేసేదేమీ లేక టీడీపీ నేతలు నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

దాడులు.. దౌర్జన్యాలు

టీడీపీ అభ్యర్థి బొండా ఉమా తనయుడు రవితేజ స్థానిక బర్మాకాలనీలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైసీపీ మహిళా కార్యకర్తలు ప్రతి ఇంటికీ స్టిక్కర్లు అంటిస్తూ వెళ్తున్నారు. రవితేజ వారిని అడ్డుకుని ప్రశ్నించారు. దీంతో వైసీపీ మహిళా కార్యకర్తలు టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. చేతిలో డబ్బు, స్టిక్కర్ల సంచులతో ఉన్న వైసీపీ మహిళా కార్యకర్తలు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయమై టీడీపీ నేత ఎస్‌కే మస్తాన్‌ నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశ్‌నగర్‌కు చెందిన కాయల వసంత్‌ గత కొంతకాలంగా వైసీపీలో ఉన్నారు. ఇటీవల టీడీపీలో చేరాడు. ఆయన మంగళవారం ఎల్‌బీఎస్‌ నగర్‌ చర్చి ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా, అటుగా వచ్చిన వైసీపీ నేతలు వీరబాబు, బోరా బుజ్జి, రామిరెడ్డి అడ్డుకుని వసంత్‌పై దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న వసంత్‌ భార్య లక్ష్మి అక్కడకు చేరుకుంది. దీంతో భార్యాభర్తలిద్దరిపై వైసీపీ నేతలు దాడికి దిగారు. టీడీపీ నేతలు పైడి శ్రీను తదితరులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై లక్ష్మి నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బొండా రవితేజతో కలిసి మంగళవారం ప్రచారంలో పాల్గొన్న టీడీపీ మహిళా కార్యకర్త చొప్పర వరలక్ష్మీని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. జ్యోతి, కరుణశ్రీ, చిన్నారి, మాతా మహేశ్‌, ఎస్‌కే మస్తాన్‌ ఆమెపై బెదిరింపులకు దిగారు. తమ ప్రాంతంలో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వీల్లేదని భయపెట్టడమే కాకుండా, దళిత కులానికి చెందిన ఆమెను కులం పేరుతో అసభ్యంగా దూషించారు. ఈ వివాదంపై వరలక్ష్మి.. నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

కౌంటర్‌ కేసులతో వెలంపల్లి స్కెచ్‌

డబ్బు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు కౌంటర్‌ కేసులతో టీడీపీ శ్రేణులను రివర్స్‌లో ఇరికించే ప్రయత్నం చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేయించారు. టీడీపీ నాయకులు కేసులు పెట్టారన్న అక్కసుతో మంగళవారం వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా రంగంలోకి దిగారు. నేరుగా నున్న రూరల్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. సుమారు గంటపాటు అక్కడే తిష్ట వేశారు. వైసీపీ కార్యకర్తలతో కౌంటర్‌ ఫిర్యాదులు చేయించారు.

బొండా రవితేజపై ఎస్సీ కులానికి చెందిన యువతితో ఫిర్యాదు చేయించారు. తాను ప్రచారానికి వెళ్తే రవితేజ తనను అడ్డుకుని కులం పేరుతో దూషించారని చెప్పి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు.

టీడీపీ నేత బొల్లెద్దుల రవిచంద్ర తనపై దాడిచేసి కొట్టారంటూ వైసీపీ తరఫున డబ్బు పంపిణీ చేస్తున్న మాజీ వలంటీర్‌ గురుస్వామితో నున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

Updated Date - May 08 , 2024 | 12:57 AM