Share News

గవర్నర్‌ కార్యక్రమంలోవిద్యార్థుల అవస్థలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:36 AM

పట్టణంలో తిరంగా పార్క్‌ ప్రారంభించడానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేసిన సందర్భంగా కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి విద్యార్థులను భారీగా తరలించారు.

గవర్నర్‌ కార్యక్రమంలోవిద్యార్థుల అవస్థలు
నేలపైనే కూర్చున్న విద్యార్థులు

ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఎండకు తాళలేక, మంచినీళ్లు లేక, కింద కూర్చోలేక ఇబ్బందులు

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 16: పట్టణంలో తిరంగా పార్క్‌ ప్రారంభించడానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేసిన సందర్భంగా కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి విద్యార్థులను భారీగా తరలించారు. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులను వారి స్కూల్‌ బస్సుల్లో, ప్రభుత్వ బడుల విద్యార్థులను ఉపాధ్యాయులే ఆటోల్లో తీసుకునివచ్చారు. పలు స్కూళ్ల విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాల కోసం పిలిచారు. కానీ సరైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో వారు కిందే కూర్చొన్నారు. ఎండ మండిపోవటంతో వాటర్‌ బాటిళ్లు అరకొరగా ఇవ్వ డం, స్నాక్స్‌ ఇవ్వకపోవడంతో అల్లాడిపోయారు. గవర్నర్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడినా స్పందించలేదు. పురపాలక సంఘం సిబ్బంది గవర్నర్‌ వచ్చే దాకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. గవర్నర్‌ అధికారిక కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభానులు పరస్పరం ప్రశంసించుకోవటం, అభివృద్ధి కార్యక్రమాలను ఏకరవు పెట్టటం కార్యక్రమస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పలువురు ఆక్షేపించారు.

వీఐపీ గ్యాలరీల్లో వైసీపీ కార్యకర్తలు

పురపాలక సంఘం వీఐపీ పాస్‌లు పాస్‌లు ఇచ్చినా వీఐపీ గ్యాలరీల్లో అధికార పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు. దీంతో ప్రెస్‌ గ్యాలరీల్లోకి వీఐపీలు వచ్చారు. కుర్చీల్లో కూర్చొన్న విలేకరులను లేపి వీఐపీలను అధికార పార్టీ నేతలు కూర్చోబెట్టారు.

Updated Date - Feb 17 , 2024 | 01:36 AM