మార్కెట్ యార్డు చైర్మన్ల ఎన్నిక.. పోటాపోటీ
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:59 AM
ప్రతిష్టాత్మక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆశావహులు కోటి ఆశల్లో ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తరువాత చెప్పుకోదగిన పదవి ఇది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు ఈ పదవిపై కన్నేశారు.

నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్‌పైనే అందరి దృష్టి
పోటీ పడుతున్న నందిగామ, చందర్లపాడు నేతలు
రిజర్వేషన్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై చర్చ
కంచికచర్ల యార్డుకు ఓ నేత పేరు దాదాపు ఖరారు
ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ నేతలు
నందిగామ, డిసెంబరు 28 : ప్రతిష్టాత్మక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆశావహులు కోటి ఆశల్లో ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తరువాత చెప్పుకోదగిన పదవి ఇది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు ఈ పదవిపై కన్నేశారు. ఈ క్రమంలో ఈ పదవి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఎవరికి వారు ఈ పీఠం దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల ట్విస్టు ఇవ్వడంతో అయోమయంలో పడ్డారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠలో ఓసీ సామాజికవర్గాలకు చెందిన ఆశావహులు ఉండగా, బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందినవారిలో మాత్రం రిజర్వేషన్ల ఆశలు చిగురించాయు.
రిజర్వేషన్లపైనే ఆశలు
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఆరు మార్కెట్ కమిటీలు ఉండగా, అందులో ఓసీలకు మూడు, బీసీలకు రెండు, ఎస్సీలకు ఒక కమిటీని కేటాయించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో సగభాగం మూడు యార్డులు ఆయా కేటగిరీల్లో మహిళలకు కేటాయించారు. ఆ ప్రక్రియ దాదాపు పూర్తయింది. అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు నియోజకవర్గంలోని కంచికచర్ల యార్డును ఓసీ జనరల్‌కు, నందిగామ యార్డును బీసీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కంచికచర్ల యార్డుకు ఓ కీలక నేత పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలియవచ్చింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆ నేత పేరు ప్రచారం సాగడంతో ఇతరులెవరూ ఆ పదవిపై దృష్టి పెట్టలేదు. నందిగామ యార్డుకు మాత్రం ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. ఈ యార్డును బీసీలకు కేటాయించినట్లు రెండు రోజులుగా వార్తల వస్తున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ నాయకులు అప్రమత్తమయ్యారు.
నందిగామ యార్డుకు పోటీ
నందిగామ యార్డు పరిధిలో నందిగామ, చందర్లపాడు మండలాలు ఉన్నాయి. ఇటీవల నందిగామ మండలంలోని జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన ఏటిపట్టు గ్రామాలను జగ్గయ్యపేట యార్డు పరిధిలో చేర్చారు. దీంతో నందిగామ మండలంలోని 12 గ్రామాలతో పాటు చందర్లపాడు మండలాలు ఆ యార్డు పరిధిలో మిగిలాయి. నందిగామ మండలం నుంచి ఒకరిద్దరు బీసీ నాయకులు ఈ పదవికి పోటీలో ఉండగా, చందర్లపాడు మండలం నుంచి చాలామందే ఉన్నారు. నందిగామ నుంచి పోటీ పడుతున్న ఒకరిద్దరు నేతలు బీసీ కేటగిరీలో అల్పసంఖ్యాక కులాలకు చెందినవారు కావడంతో పాటు సగం మండలం మాత్రమే యార్డు పరిధిలో ఉంది. దీంతో ఈ పదవి చందర్లపాడు మండలానికే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చందర్లపాడు మండలం నుంచి బీసీ సామాజికవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా యాదవ, రజక సామాజికవర్గాలకు చెందిన నాయకులు పోటీలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా, సీనియారిటీ, విధేయత తదితర అంశాల ఆధారంగా చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.