Share News

పరిహారం ప్రహసనమే!

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:18 AM

మిచౌంగ్‌ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పట్లో పరిహారం అందేలా లేదు. ఈనెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై కోడ్‌ అమల్లోకి వస్తే పంట నష్టపరిహారం అందదు. సంక్రాంతి నాటికి పరిహారం రైతుల ఖాతాల్లో జమచేస్తామని పాలకులు చెప్పినా ఇంతవరకు జమ కాలేదు. నేతలంతా సీట్ల కొట్లాటలో ఉండటంతో రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేస్తారా? లేక మిన్నకుండి పోతారా? అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం ప్రహసనమే!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే పంట నష్టపరిహారం విడుదల ఇప్పట్లో లేనట్టే

సంక్రాంతి నాటికి పరిహారం ఇస్తామని గతంలో పాలకుల హామీ

ఇప్పటికీ అతీగతీ లేని దుస్థితి

జిల్లాలో 58,835 హెక్టార్లకు రూ.99 కోట్లకు పరిహారంగా చెల్లించాలని తుది నివేదిక

మిచౌంగ్‌ తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పట్లో పరిహారం అందేలా లేదు. ఈనెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై కోడ్‌ అమల్లోకి వస్తే పంట నష్టపరిహారం అందదు. సంక్రాంతి నాటికి పరిహారం రైతుల ఖాతాల్లో జమచేస్తామని పాలకులు చెప్పినా ఇంతవరకు జమ కాలేదు. నేతలంతా సీట్ల కొట్లాటలో ఉండటంతో రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేస్తారా? లేక మిన్నకుండి పోతారా? అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మిచౌంగ్‌ తుఫాను కారణంగా గతేడాది డిసెంబరు 4, 5 తేదీల్లో కురిసిన భారీవర్షాలకు వరి, ఇతర పంటలకు జరిగిన నష్టం వివరాలను వ్యవసాయ, రెవెన్యూ శాఖ సిబ్బందితో కూడిన బృందాలు తయారుచేశాయి. ఈ జాబితాలను ఆధారంగా చేసుకుని రైతుల పేరుతో గ్రామ, మండల, ఇతర మండలాల్లో, ఇతర జిల్లాల్లో ఉన్న భూమి వివరాలను ఈ-క్రాప్‌, ఆధార్‌కార్డు నెంబర్ల ఆధారంగా సేకరించారు. ఒక రైతు ఎంత భూమి సాగుచేసినా ఐదు ఎకరాలకు మాత్రమే పంట నష్టపరిహారం పరిమితం చేస్తూ జాబితాలను సరిదిద్దారు. జిల్లాలో తొలి విడతగా తయారు చేసిన పంట నష్టపరిహారం జాబితాల్లో 83,462 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్టుగా చూపారు. రూ.141.56 కోట్లను పంట నష్టపరిహారంగా అందించాల్సి ఉంటుందని నివేదికను తయారుచేశారు. ఒక రైతుకు ఐదు ఎకరాలకు మించి పంటనష్టపరిహారం మాత్రమే ఇచ్చే నిబంధన ప్రకారం జిల్లాలో 58,835 హెక్టార్లకు రూ.99 కోట్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలని తుది జాబితాలను తయారు చే శారు. పంట నష్టపరిహారాన్ని రూ.99 కోట్లకు కుదించారు. అన్ని పంటలకు కలిపి గతంలో రూపొందించిన జాబితాలకన్నా 26,224 హెక్టార్లకు పంట నష్టపరిహారం రాదని లెక్కలు తేల్చారు. వరి, వేరుశెనగ, పత్తి పంటలకుహెక్టారుకు పంట నష్టపరిహారంగా రూ.17వేలు, మొక్కజొన్నకు రూ.12వేలు, మినుముకు రూ.10వేలు చొప్పున పంట నష్టపరిహారంగా ఇవ్వాల్సి ఉంది.

పంట న ష్టపరిహారం విడుదల అవుతుందా?

రైతులు ఈ ఏడాది సాగుచేసిన అన్ని పంటలు తుఫాను కారణంగా అధిక శాతం దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో రైతులు పంటలు కోల్పోయిన తీరును కేంద్ర బృందం సభ్యులు, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్‌, జేసీ స్వయంగా పరిశీలించారు. మోపిదేవి, పామర్రు తదితర మండలాల్లో నీటిలో మునిగి కంకులు మొలకెత్తడంతో రైతులు పంటను కోయకుండానే దమ్ము చేయించారు. రైతులు రెండో పంటను సాగు చేసుకునేందుకు వీలుగా పంట నష్టపరిహారాన్ని సంక్రాంతి పండుగ నాటికి విడుదల చేస్తామని ప్రకటించారు. అయినా పంట నష్టపరిహారం విడుదలపై ఎవరూ పెదవి విప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారుల జాబితాలను ప్రభుత్వానికి పంపామని, నగదు ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదని చెప్పడం గమనించదగ్గ అంశం.

Updated Date - Feb 06 , 2024 | 01:18 AM