మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు
ABN , Publish Date - Oct 07 , 2024 | 01:23 AM
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వస్తున్నాయని, నాణ్యత గల మద్యం అందించే లక్ష్యంతోనే నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తన కార్యాలయం వద్ద 50 మంది బోటు యజమానులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించే రూ. 19 లక్షల విలువ గల ట్రాన్స్‌పాండర్‌లు రవీంద్ర అందజేశారు.
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 6 : మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వస్తున్నాయని, నాణ్యత గల మద్యం అందించే లక్ష్యంతోనే నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తన కార్యాలయం వద్ద 50 మంది బోటు యజమానులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించే రూ. 19 లక్షల విలువ గల ట్రాన్స్‌పాండర్‌లు రవీంద్ర అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మద్యం దుకాణదారులు సిండికేట్ అయితే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయన్నారు. పారదర్శకంగా మద్యం దుకాణాలను అందజేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖకు దీనిపై మార్గదర్శక సూత్రాలు అందచేశామన్నారు. సముద్రంలో తప్పిపోయిన బోట్లను వెంటనే కనిపెట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ట్రాన్స్‌పాండర్‌లను బోటు యజమానులకు అందిస్తున్నామన్నారు. గతంలో బోటు యజమానుల వద్ద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగితే బోటు ఎక్కడ ఉండేదో తెలిసేది కాదని, ఇప్పుడు జీపీఎస్ విధానంలో కాకుండా శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ అందే విధంగా బోటు యజమానులకు ట్రాన్స్‌పాండర్ పరికరాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. రూ.37,700 విలువ గల ఈ పరికరాన్ని కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం భరిస్తుందన్నారు. మచిలీపట్నంలో 69 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయని, వాటిల్లో 50 బోట్లకు ఈ పరికరాలు అందిస్తున్నామన్నారు. ఈ ట్రాన్స్‌పాండర్‌లు బోటులకు అమర్చడం వ్లల బోటు ఎక్కడుందో మత్స్యశాఖ అధికారులకు వెంటనే తెలిసిపోతుందన్నారు. మిగిలిన 19బోట్లకు త్వరలో అందిస్తామన్నారు. చిన్నబోటు దారులకు కూడా పరికరాలు అందించేందుకు యోచిస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక విదేశీ ఆదాయం గల మత్స్యపరిశ్రమకు చేయూతనిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఎంపెడా సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి మత్స్యకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోర్టు వచ్చినప్పటికీ మత్స్యకారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆలోచన చేస్తున్నామన్నారు. మత్స్యకారులు చేపలు నిల్వచేసి విక్రయించేందుకు తగిన సౌకర్యం కల్పిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని, విదేశాలకు సైతం ఇక్కడి నుంచి చేపలు ఎగుమతి చేసేందుకు వీలు కల్పిస్తామన్నారు. బందరుకోటలో మత్స్యశిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యకార సంఘం నూతన అధ్యక్షుడు నాగరమేష్, టీడీపీ నాయకులు ఎండీ ఇలియాస్ పాషా, రామధాని వేణు, లంకే శేషగిరి, పాలపర్తి పద్మజ, లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.