దీక్షతో..
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:56 AM
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే దీక్షల విరమణకు శనివారం ఉదయం 6.30 గంటలకు అంకురార్పణ జరిగింది.

భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ప్రారంభం
స్థానికంగా ఉన్న భవానీల రాక.. ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
హోమగుండం వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఈవో
విజయవాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే దీక్షల విరమణకు శనివారం ఉదయం 6.30 గంటలకు అంకురార్పణ జరిగింది. తొలుత వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, ఈవో రామారావు ప్రధానాలయంలో అమ్మవారికి హారతులిచ్చారు. అక్కడి నుంచి కాగడాతో వేద మంత్రోచ్ఛారణ నడుమ మహామండపం వద్ద ఉన్న హోమగుండాల వద్దకు చేరుకున్నారు. అగ్నిహోత్రంలో ఉన్న కట్టెలను వెలిగించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలిరోజు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన భవానీలు వచ్చారు. ఇరుముడులతో ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ చేసిన భవానీలు అనంతరం క్యూలైన్లలోకి చేరుకున్నారు. దర్శనం అయ్యాక మహామండపం కింద గురుభవానీలతో ఇరుముడులను ఇప్పించుకున్నారు. ఆ తర్వాత దీక్షా విరమణ చేశారు. హోమగుండం వద్ద ప్రదక్షిణలు పూర్తయ్యాక తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్లారు.
మొదటిరోజు నామమాత్రంగా..
మొదటిరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లోని భవానీలు రావడంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. క్యూలన్నీ ఖాళీగానే ఉన్నాయి. భవానీల కంటే మామూలు భక్తుల సందడి ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 28 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నదానంలో 18 వేల మంది భోజనాలు చేశారు. 4,183 మంది భవానీలు, భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. 1.20 లక్షల లడ్డూలను విక్రయించారు. సాయంత్రం నుంచి ఇతర ప్రాంతాల భవానీల రాక మొదలైంది. మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులు, రెవెన్యూ, దేవస్థాన అధికారులు రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పీఎన్‌బీఎస్, రైల్వేస్టేషన్, రామవరప్పాడు, ఇబ్రహీపట్నం, వారధి ప్రాంతాల్లో పోలీసులు క్లౌడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏ మార్గంలో భవానీలు ఎక్కువగా వస్తున్నారో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షిస్తున్నారు. కాగా, ఆదివారం భవానీల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.