ఓటేసేందుకు తరలివస్తున్నారు!
ABN , Publish Date - May 12 , 2024 | 01:19 AM
ఓట్ల యుద్ధానికి సంసిద్ధం అన్నట్టుగా హైదరా బాద్ నుంచి భారీ సంఖ్యలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓటర్లు తరలివస్తున్నారు.
శనివారం రాత్రికి విజయవాడకు వచ్చిన 30 వేల కార్లు
హైదరాబాద్ నుంచి లక్షన్నర మంది రాక
బస్సులు కిటకిట.. హైవేలపై కార్లు బారులు
రైళ్లు కిటకిట.. ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు వేసిన రైల్వే
విమానాలు కిటకిట.. భారీగా తరలివచ్చిన ప్రవాసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఓట్ల యుద్ధానికి సంసిద్ధం అన్నట్టుగా హైదరా బాద్ నుంచి భారీ సంఖ్యలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓటర్లు తరలివస్తున్నారు. శనివారం రాత్రికి 8గంటలకు హైదరాబాద్ నుంచి 30 వేల కార్లు వచ్చినట్టుగా టోల్ వర్గాలు గణాంకాలను వెలువరించాయి. హైదరాబాద్ నుంచి లక్షన్నర మంది వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కార్లతో అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65) కిటకిటలాడిపోయింది. కిలో మీటర్ల కొద్దీ కార్లు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోయాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణా ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆర్టీసీ బస్సులు, కార్లతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలి వస్తున్న ప్రయాణికులు అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు వెళ్లటానికి వీలుగా ఆర్టీసీ అధికారులు 50 బస్సులను నడిపారు. హైద రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విజయవాడ, బెంగళూరు- విజయవాడ, చెన్నై- విజయవాడల మధ్య రైళ్లు కిక్కిరిసి ప్రయాణించాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విజయవాడ మధ్య రైల్వే అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను ఆది వారం నడపనున్నట్టు ప్రకటించారు. మచిలీపట్నం - బీదర్, విశాఖపట్నం- సికింద్రాబాద్‌ల మధ్య నడిచే రైళ్లలో అదనపు బోగీలను వేయనున్నట్టు రైల్వే అధి కారులు ప్రకటించారు. షార్జా నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు 100 మంది ప్రవాసీయులు విమా నంలో తరలివచ్చారు. అమెరికా, కెనడా, యూరప్, ఆస్ర్టేలియా నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు వచ్చారు. వీరంతా విజయవాడకు దేశీయ విమానాల ద్వారా చేరుకున్నారు. శనివారం ఎయిర్ పోర్టులో విపరీతమైన రద్దీ నెలకొంది.