Share News

రూ.కోట్ల కోసం కాయిన్‌ తయారీ

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:05 AM

అతనొక ఎలక్ట్రీషియన్‌. చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు. ఆ సంపాదన సంతృప్తినివ్వలేదు. జీవితంలో రూ.కోట్లు కళ్లారా చూడాలనుకున్నాడు. అలా రూ.కోట్లు కురిపించే కాయిన్‌ తయారు చేయడం కోసం పగలు రాత్రి కష్టపడ్డాడు. సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నాడు.

రూ.కోట్ల కోసం కాయిన్‌ తయారీ

కటకటాలపాలైన ఎలక్ట్రీషియన్‌

పోలీసుల అదుపులో మరో ఐదుగురు

చిట్టినగర్‌, ఆగస్టు 20 : అతనొక ఎలక్ట్రీషియన్‌. చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు. ఆ సంపాదన సంతృప్తినివ్వలేదు. జీవితంలో రూ.కోట్లు కళ్లారా చూడాలనుకున్నాడు. అలా రూ.కోట్లు కురిపించే కాయిన్‌ తయారు చేయడం కోసం పగలు రాత్రి కష్టపడ్డాడు. సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జక్కంపూడి హౌసింగ్‌ కాలనీ 222లో ఏ.రాజా తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌ అయిన రాజా కొన్నాళ్ల కిందట స్థానిక బస్‌షెల్టర్‌ ఎదురుగా షాపు అద్దెకు తీసుకుని ఎలక్ట్రికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో అధిక ఆదాయం సంపాదించేందుకు అన్వేషణ మొదలుపెట్టాడు. రూ.కోట్లు సంపాదించే రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ గురించి తెలుసుకున్నాడు. తెలంగాణాలోని భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో ఓ గురువు వద్ద చేరి రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ ఎలా తయారు చేయాలో శిక్షణ పొందాడు. శిక్షణానంతరం రెండు నెలల క్రితం జక్కంపూడి కాలనీ చేరుకున్నాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ తయారు చేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని పథకం వేసుకున్నాడు. కాయిన్‌ తయారీకి కావాల్సిన పురాతన ఆలయాల్లో ఉండే రాగి చెంబులను ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి కొన్నాడు. ఆ తర్వాత కెమికల్స్‌ను సిద్ధం చేసుకుని పని మొదలుపెట్టాడు. తన షాపులో కాయిన్‌ తయారు చేయడం మొదలుపెట్టాడు. చివరికి విజయవంతంగా కాయిన్‌ తయారుచేసి రెండు మూడు రోజుల్లో విక్రయించాలని పథకం రచించాడు. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో కథ బెడిసికొట్టింది. కాయిన్‌ తయారు చేసిన రాజాతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. షాపులో పెద్ద గొయ్యి తీసి కాయిన్‌ ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాయిన్‌ తయారీకి వినియోగించిన సామగ్రితో పాటు కాయిన్‌ ఉంచిన పెద్ద బాక్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేను సైంటిస్టును..

రాజా చెప్పిన సమాధానాలకు పోలీసులు అవాక్కయ్యారు. తాను సైంటిస్టునని, తాను తయారు చేసిన కాయిన్‌ పవర్‌.. సెల్‌ఫోన్లలోని బ్యాటరీలను లాగేసుకుంటుందని ఏవేవో పొంతనలేని సమాధా నాలు చెప్పాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఇతర దేశాల్లో రైస్‌ పుల్లింగ్‌ తయారీకి అనుమతులు ఉన్నాయని, తాను కాయిన్‌ మాత్రమే తయారు చేశానని, ఎవరినీ మోసం చేయలేదని సమర్థించుకున్నాడు.

Updated Date - Aug 21 , 2024 | 01:05 AM