చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం కేసు రీ ఓపెన్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:36 AM
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసును పోలీసులు బయటకు తీశారు. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు నుంచి తప్పించుకున్న వైసీపీ నేత వల్లూరు ఈశ్వరప్రసాద్‌ను పటమట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా ఐపీసీ 307 సెక్షన్‌ను చేర్చారు.

2022లో ఘటన.. కన్ను కోల్పోయిన గాంధీ
కేసులో ఏ5గా ఈశ్వరప్రసాద్
తాజాగా ఐపీసీ 307 చేర్చి అరెస్టు చేసిన పోలీసులు
దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడు
విజయవాడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసును పోలీసులు బయటకు తీశారు. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు నుంచి తప్పించుకున్న వైసీపీ నేత వల్లూరు ఈశ్వరప్రసాద్‌ను పటమట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా ఐపీసీ 307 సెక్షన్‌ను చేర్చారు.
ముందస్తు ప్రణాళికతోనే దాడి
2022, సెప్టెంబరు 4న పటమటలంకలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద జరుగుతున్న డ్రెయినేజీ నిర్మాణ పనులను చెన్నుపాటి గాంధీ పరిశీలించడానికి వెళ్లారు. ఈ డివిజన్‌కు గాంధీ కార్పొరేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య క్రాంతిశ్రీ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇదే డివిజన్‌కు వల్లూరు ఈశ్వరప్రసాద్, గద్దె కల్యాణ్ వైసీపీ నాయకులుగా ఉన్నారు. వారిలో కల్యాణ్ వైసీపీ 9వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరులు. గాంధీ డ్రెయినేజీ పనులను పరిశీలిస్తున్న సమయంలో గద్దె కల్యాణ్, మరో ముగ్గురు యువకులతో అక్కడికి చేరుకున్నాడు. ఆయనతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగాడు. మాటమాటా పెరగడంతో కల్యాణ్‌తో పాటు మిగిలిన ముగ్గురు యువకులు గాంధీపై దాడి చేశారు. బలంగా కొట్టడంతో గాంధీ కుడికన్ను గుడ్డు పగిలి బయటకు వచ్చింది. ఆయన కన్ను కోల్పోయారు. ఇనుప చువ్వ వంటి ఆయుధంతో కంట్లో పొడిచారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన సరిగ్గా వల్లూరు ఈశ్వరప్రసాద్ ఇంటికి కూతవేటు దూరంలో జరిగింది. దీనిపై పటమట పోలీసులు ఐపీసీ 326, 506, రెడ్‌విత్ 34 సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా గద్దె కల్యాణ్, ఏ2గా లీలాకృష్ణ ప్రసాద్, ఏ3గా సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు, ఏ4గా శ్రీనివాస్‌ను చేర్చారు. ఈ ఘటనకు ఈశ్వరప్రసాద్ కారణమని, అతడు వెనుక ఉండి కథను నడిపించాడని, దాడి జరిగే సమయంలో అక్కడే ఉన్నాడని టీడీపీ నేతలు ఆరోపించారు. నాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈశ్వరప్రసాద్ పేరు చేర్చలేదు. కేసులో హత్యాయత్నం సెక్షన్ చేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం మూడు సెక్షన్ల కిందే కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. గాంధీ గాయాలకు సంబంధించి వైద్యులు ఇచ్చే ఊండ్ సర్టిఫికెట్‌ను రిమాండ్ రిపోర్టుకు జత చేయకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ నలుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలు పోలీసు కమిషనర్‌ను కలిశారు. ఈ కేసును పునఃవిచారణ చేయించాలని కోరారు. విచారణను తిరిగి ప్రారంభించిన పోలీసులు తాజాగా ఈశ్వరప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసులో ప్రస్తుతం ఉన్న సెక్షన్లతో పాటు 307 సెక్షన్‌ను అదనంగా చేర్చారు. వల్లూరు ఈశ్వరప్రసాద్‌ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి అతడి రిమాండ్‌ను తిరస్కరించారు. ఐపీసీ 307 సెక్షన్ చేర్చడాన్ని అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇతర నిందితులకు ఇచ్చినట్టుగా స్టేషన్ బెయిల్ ఇచ్చారు.