Share News

ఇక కార్‌..గో

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:01 AM

కొద్దిరోజుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభంకానున్నాయి. కార్గో సేవలందించే టెండర్లు ఖరారయ్యాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.

ఇక కార్‌..గో

  • కాంట్రాక్టు దక్కించుకున్న ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌

  • రైతులు, వర్తక, వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు వరం

  • విమానయాన సంస్థలు, విమానాశ్రయానికి ఆదాయం

  • పాత టెర్మినల్‌ భవనాన్ని విస్తరించాల్సిన అవసరం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొద్దిరోజుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభంకానున్నాయి. కార్గో సేవలందించే టెండర్లు ఖరారయ్యాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అనుమతులు కూడా పొందింది. దీంతో జూలై 1 నుంచి కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి.

కరోనా తర్వాత ఇన్నాళ్లకు..

2017 మధ్య కాలంలో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో శ్రీప లాజిస్టిక్స్‌ అనే సంస్థ టెండర్లను దక్కించుకుంది. 2020-కరోనా సమయంలో ఈ సేవలు నిలిచిపోయాయి. కేవలం ఇన్‌కమింగ్‌ తప్ప, అవుట్‌గోయింగ్‌కు అవకాశం లేకుండాపోయింది. కరోనా పరిస్థితులు చక్కబడినా అవసరమైన అనుమతులను శ్రీప లాజిస్టిక్స్‌ సాధించలేదు. దీంతో కార్గో సేవలు ఆగిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ కార్గో సేవలు మొదలవుతున్నాయి. రైతులు, వర్తకులు, వ్యాపార వర్గాల నుంచి పదేపదే ప్రతిపాదనలు వస్తుండటంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఏఏఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 24 విమానాలు నడుస్తున్నాయి. వీటిలో దాదాపు 50 టన్నుల వరకు సరుకు రవాణా చేసే వీలుంటుంది. స్థానికంగా ఉన్న రైతులు, వ్యాపారులు, వర్తకులకు ఇది ఎంతో ప్రయోజనం. తక్కువ ఖర్చుతో దేశీయంగా సరుకు రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకు రోడ్డు, రైలు మార్గాలపై ఆధారపడిన వారికి ఇది శుభపరిణామమే. మన ప్రాంతంలో ఎక్కువగా కూరగాయలు, ఆహారశుద్ధి ఉత్పత్తులు, చేపలు, రొయ్యల ఎగుమతులు, దిగుమతులు ఎక్కువ. ఈ కార్గో సేవల ద్వారా విమానయాన సంస్థలకు, విమానాశ్రయానికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.

కార్గో టెర్మినల్‌ను విస్తరించాలి

ప్రస్తుతం ఉన్న కార్గో టెర్మినల్‌ ఎప్పుడో పాత అవసరాల కోసం నిర్మించింది. ఈ టెర్మినల్‌ ప్రస్తుత అవసరాలకు సరిపోదు. విస్తరించాల్సిన అవసరం ఉంది. లేదంటే శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టాలి. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు ఇక్కడకు వచ్చిన సందర్భంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భరోసానిచ్చారు. కార్గో టెర్మినల్‌ విస్తరణ అవసరాన్ని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో టెర్మినల్‌ భవన విస్తరణకు మార్గం ఏర్పడింది.

Updated Date - Jun 29 , 2024 | 01:01 AM