Share News

వైసీపీలో ఉండలేను!

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:11 AM

‘నాపై కొందరు కుట్రపూరితంగా చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి జగన్‌ నమ్మారు. నన్ను అవమానకరంగా మాట్లాడారు. ఇద్దరు కమ్మ వ్యక్తులను పక్కన పెట్టుకుని మట్టి, బూడిదను దోచుకుంటున్నావా.. అని సీఎం నిలదీశారు. నేను చెప్పే సమాధానం కూడా వినిపించుకోలేదు. నా ప్రమేయం లేకుండానే ఆ వ్యక్తులు కొత్తూరు తాడేపల్లి నుంచి లక్షలాది లారీల మట్టిని రవాణా చేశారు. ఇవేమీ వినకుండా నన్ను అవమానించిన పార్టీలో నేను ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తా.’ - వసంత కృష్ణప్రసాద్‌, మైలవరం ఎమ్మెల్యే

వైసీపీలో ఉండలేను!

దోచుకుంది పెడన నాయకుడు.. పేరేమో నాకు

బూడిద, మట్టి మొత్తం దోచేసింది ఆయనే..

జోగి రమేశ్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగిన వసంత

‘నాపై కొందరు కుట్రపూరితంగా చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి జగన్‌ నమ్మారు. నన్ను అవమానకరంగా మాట్లాడారు. ఇద్దరు కమ్మ వ్యక్తులను పక్కన పెట్టుకుని మట్టి, బూడిదను దోచుకుంటున్నావా.. అని సీఎం నిలదీశారు. నేను చెప్పే సమాధానం కూడా వినిపించుకోలేదు. నా ప్రమేయం లేకుండానే ఆ వ్యక్తులు కొత్తూరు తాడేపల్లి నుంచి లక్షలాది లారీల మట్టిని రవాణా చేశారు. ఇవేమీ వినకుండా నన్ను అవమానించిన పార్టీలో నేను ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తా.’
- వసంత కృష్ణప్రసాద్‌, మైలవరం ఎమ్మెల్యే

(విజయవాడ - ఆంధ్రజ్యోతి/నందిగామ) : మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. నందిగామ మండలం ఐతవరంలో మైలవరం నియోజకవర్గ పార్టీ నేతలతో సోమవారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ పాలనపైనా, పార్టీలో తనకు జరిగిన అవమానాలపైనా ఆయన తన అనుచరులతో సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రి జోగి రమేశ్‌ పేరు ప్రస్తావించకుండా ఆయనపై నిప్పులు చెరిగారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... మైలవరం ఎమ్మెల్యేగా నన్ను పని చేయనీయకుండా పెడన నాయకుడు, ఆయన మనుషులు పెత్తనం చేశారు. ఆ వ్యక్తులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారితో చేతులు కలిపి నాపై కుట్రలు చేశారు. వీటీపీఎస్‌ బూడిద, కొత్తూరు తాడేపల్లి మట్టిని పెడన నుంచి గెలిచిన నాయకుడు, ఆయన మనుషులు దోచుకున్నారు. ఆ నేరాన్ని నాపై మోపే ప్రయత్నం చేశారు.

బూడిదను డబ్బుకు అమ్ముకున్నారు..

యాష్‌ పాండ్‌ నుంచి బూడిదను డబ్బుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంది కూడా వాళ్లే. అటువంటి వ్యక్తులను అధిష్టానం ప్రోత్సహిస్తూ నన్ను ఇబ్బంది పెట్టడాన్ని సహించలేక వైసీపీలో ఇమడలేనని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యేగా నాకు ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధి చేశా. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వని సమయంలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మైలవరానికి నిధులు ఇచ్చారు. నేను వైసీపీని వీడుతున్నాను. త్వరలో రాజీనామా ఇస్తా. ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా.. అన్నారు.

టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం

నన్ను నమ్ముకుని ఉన్నవారు ఇష్టం ఉంటే నా వెంట నడవాలి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నుంచి నాకు ఆహ్వానం ఉంది. మంచి పాలన కోసం త్వరలో నా నిర్ణయాన్ని వెల్లడిస్తా. నాపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు వైసీపీ సోషల్‌ మీడియా సిద్ధంగా ఉంది. సొంత తల్లిని, చెల్లిని వదలని వారు నన్ను వదులుతారని అనుకోవడం లేదు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నా అని మైలవరం ఎమ్మెల్యే వసంత తెలిపారు. ఈ సమావేశానికి మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్దఎత్తున నేతలు తరలివచ్చారు. పలు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల వైసీపీ అధ్యక్షులు హాజరయ్యారు.

8 తర్వాత టీడీపీలోకి..

వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 8వ తేదీ తర్వాత ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. మైలవరం లేదా పెనమలూరు స్థానాల్లో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 01:11 AM