గంజాయి గొలుసు
ABN , Publish Date - Jul 31 , 2024 | 01:14 AM
ఇద్దరూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. గ్రామంలో కూలి పనులకు వెళ్తుండేవారు. ఇద్దరిలో ఒకడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడు.
ఒక్కొక్కరికి నలుగురు ఖాతాదారులు
వెలుగులోకి వస్తున్న ‘వాసన’
యాంటీ నార్కోటిక్ సెల్ అదుపులో 17 మంది
విశాఖకు చెందిన ఇద్దరు కీలక సరఫరాదారుల అరెస్టు
46 కిలోల గంజాయి స్వాధీనం 8 నిందితుల్లో ఇద్దరు మైనర్లు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఇద్దరూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. గ్రామంలో కూలి పనులకు వెళ్తుండేవారు. ఇద్దరిలో ఒకడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడు. ఇంట్లో వారికి ఎంతోకొంత డబ్బులు ఇచ్చి వెళ్తుండేవాడు. మరొకడు గ్రామంలోనే కూలి పని చేస్తుండేవాడు. అతడి ఖర్చులు మాత్రం సంపాదించిన దానికి సంబంధం లేకుండా ఉండేవి. ఈ ఇద్దరూ సంపాదిస్తున్న డబ్బులన్నీ కాయకష్టం మీద అనుకుంటే పొరపాటే. ఉపాధి ముసుగులో గంజాయిని సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇద్దరూ చెరొక ప్రాంతంలో పనిచేస్తున్నా వారు సరఫరా చేస్తున్న గంజాయి మొత్తం విజయవాడ కేంద్రంగానే ఉంటోంది. ఇలా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులతోపాటు కొనుగోలు చేసిన 17 మందిని విజయవాడ యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, తూర్పు డీసీపీ గౌతమి శాలీ, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ ఆర్.శ్రీహరిబాబు, ఇన్‌స్పెక్టర్లు ఐవీ నాగేంద్ర, ఎస్.రమేష్, శ్రీధరకుమార్, నాగశ్రీనివాస్‌తో కలిసి మంగళవారం వెల్లడించారు.
ఆదాయాన్ని బట్టి టీం
విశాఖపట్నం జిల్లా కొయ్యూరుకు చెందిన పోలేజి సాయి, కాకాని దేవరాజు అలియాస్ పండు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తర్వాత విద్యాభ్యాసం మానేశారు. గ్రామంలో కూలి పనులు చేసుకుంటుండేవారు. ఈ క్రమంలోనే గంజాయి రుచి మరిగారు. దీనిపై ఆదాయాన్ని రుచి చూసిన ఇద్దరూ సరఫరాదారులుగా ఎదిగారు. కొన్ని సంవత్సరాలు కొయ్యూరు కేంద్రంగా గంజాయిని సరఫరా చేస్తున్నా సాయి ఏనాడూ పోలీసులకు చిక్కలేదు. జిల్లా సరిహద్దులు దాటి గంజాయిని సరఫరా చేయడం మొదలుపెట్టిన వారు విజయవాడలో శాశ్వత ఖాతాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు నలుగురు నుంచి ఆరుగురి వరకు ఖాతాదారులుగా మార్చుకున్నారు. సాయి కొద్దిరోజుల క్రితమే ఉపాధి పేరుతో హైదరాబాద్‌కు మారాడు. అక్కడ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. దేవ రాజు మాత్రం కొయ్యూరులోనే వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి విజయవాడలో వివిధ పోలీ స్‌స్టేషన్ల పరిధిలో ఖాతాదారులను ఏర్పాటు చేసుకున్నారు.
మరికొంత మంది ఖాతాదారులు
ఈ గంజాయిని అందరూ బస్సులు, రైళ్లు, మోటారు సైకిళ్లపై ఇక్కడికి తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. సాయి, దేవరాజు నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నవారిలో మైనర్లు, రౌడీషీటర్లు ఉన్నారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన మల్లపోగు శివనాగ మహేష్‌పై సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అతనితోపాటు సత్యనారాయణపురానికి చెందిన ధూళి వెంకటేష్, అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన జజ్జనం నరేష్ అలియాస్ మెకానిక్ నరేష్, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన డి.వెంకంరాజా అలియాస్ నాని, విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన శీలం చరణ్.... సాయి నుంచి దఫదఫాలుగా గంజాయిని కొనుగోలు చేశారు. ఈ ఐదుగురిపై గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
విచారణలో అసలు నిజాలు వెలుగులోకి..
ఐదుగురిని విచారిస్తున్న సమయంలో సరఫరాదారుడు సాయి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతడి పేరును కేసులో చేర్చారు. కాకాని దేవవరాజు అలియాస్ పండు మాత్రం కొయ్యూరులో వ్యవసాయ కూలీ. కొన్నాళ్ల క్రితం 300 కిలోల గంజాయిని విక్రయిస్తూ కొయ్యూరు పోలీసులకు చిక్కాడు. గంజాయిపై ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండడంతో ఆ పని మాత్రం మానలేదు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన కొమ్మూరు సాయికిరణ్‌పై పటమట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అతడితోపాటు వానం అరవింద్ అలియాస్ ఆర్వీ, సయ్యద్ అలీం అలియాస్ అలీ, కోట నాగదుర్గాప్రసాద్, మండవల్లికి చెందిన కమ్మగంటి నిఖిల్, ఓ మైనర్ కలిసి పండు నుంచి కొన్నాళ్లుగా గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. వారిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు కాకుండా కొత్తపేటకు చెందిన పిల్లా సాయికుమార్ అలియాస్ కలుపుకొట్టు నానిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి కాలనీకి చెందిన కుంటముల్ పవన్ కల్యాణ్, చిట్టినగర్‌కు చెందిన ఒక మైనర్‌పై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు సాయి, పండు నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్టు తేలింది. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు కిలోల గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చేవారు. ఈ గంజాయిని వ్యసనపరులకు విక్రయించేవారు. మొత్తం ఈ 17 మందిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.