Share News

చంద్రబాబు స్వాప్నికుడే కాదు.. శ్రమజీవి

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:07 AM

చంద్రబాబు మహాస్వాప్నికుడే కాకుండా ఒక శ్రమజీవి అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. విక్రమ్‌ పూల రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ సభ విజయవాడలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఆదివారం సాయంత్రం జరిగింది.

చంద్రబాబు స్వాప్నికుడే కాదు.. శ్రమజీవి
‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

విజయవాడ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : చంద్రబాబు మహాస్వాప్నికుడే కాకుండా ఒక శ్రమజీవి అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. విక్రమ్‌ పూల రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ సభ విజయవాడలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఆదివారం సాయంత్రం జరిగింది. వక్తలు చంద్రబాబు, టీడీపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిథి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, న్యాయవాది శ్రీపతిరావు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్‌ షుబ్లీ, టీడీపీ రైతు విభాగ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

ఇదొక ఉద్వేగ క్షణం : నెట్టెం రఘురాం

‘మహాస్వాప్నికుడు’ పుస్తక విడుదల ఒక ఉద్వేగకరమైన క్షణం. చంద్రబాబు మహాస్వాప్నికుడు. 1978 నుంచి ఆయన ప్రజాజీవితంలో ఉన్నారు. ఆయన రాజకీయ చతురత, వ్యూహాలను చాలామంది చూశారు. పార్టీలో ఉన్న వారికి ఆయనతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. 1984లో ఉమ్మడి రాష్ట్రంలో గవర్నరు రామ్‌లాల్‌ ప్రభుత్వం పడగొట్టినప్పుటి నుంచి టీడీపీ గురించి ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత పార్టీని పటిష్టపరిచడంలో కీలక భూమిక పోషించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంతటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు లేరని చెప్పడానికి కారణం చంద్రబాబు దార్శనికతే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దూరదృష్టిని ప్రజలు చూశారు. విజన్‌ 2020కి అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయించుకుని, సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి వంటి ఊహకు అందని కార్యక్రమాలు నిర్వహించారు. 2004లో టీడీపీ అధికారంలోకి వచ్చినట్టయితే వ్యవస్థలు ఇంకా పటిష్టంగా రూపుదిద్దుకునేవి. 2019లో మళ్లీ మనకు విఘాతం ఏర్పడింది. దీనితో రాష్ట్రానికి అపారమైన నష్టం కలిగింది. ఇప్పుడు రాజకీయాలు సూత్రాల ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని ఆటలాడుతున్నా చంద్రబాబు ఎక్కడా సహనం కోల్పోకుండా ఉన్నారు. 53 రోజులు జైల్లో ఉన్నా సహనం కోల్పోలేదు. ప్రజల కోసం ఆయన రూపొందించుకున్న విజన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

జెండా ఇలా ఉందంటే.. : గద్దె రామ్మోహనరావు

చంద్రబాబుతో అనుబంధం ఉన్న నేతల్లో నేను ఒకడ్ని. ఎన్టీఆర్‌పై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఆయన మరణానంతరం చంద్రబాబు శిష్యుడిగా చేరాను. చంద్రబాబు విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారు. బలమైన వర్గానికి ఎదురు నిలబడి విజయం సాధించారు. పేదలకు అండగా ఉన్న జెండా టీడీపీ జెండా. టీడీపీ జెండా రెపరెపలాడడానికి కారణం చంద్రబాబు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన చేసిన పనులు చెప్తుంటే ఎన్నో విషయాలు మనకు తెలిశాయి. ఒక వ్యక్తి జైలుకు వెళ్తే చేసిన నేరాలు బయటకు వస్తాయి. ఆస్తిలో మహిళలకు సమాన హక్కును ఎన్టీఆర్‌ కల్పిస్తే, పురుషులతో సమానంగా సంపాదించే స్థాయికి మహిళలను తీసుకెళ్లారు.

చంద్రబాబు కోసం పోరాటం చేద్దాం ..

- టీడీ జనార్థన్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు

కలలు కనడానికి ధైర్యం ఉండాలి. వచ్చిన కలలను సాధించడానికి సాహసం ఉండాలి. ఈ రెండూ ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రపంచంలో వచ్చిన ఐటీ విప్లవ ఫలితాలు తెలుగుజాతికి అందాలని అంచనా వేసిన వ్యక్తి ఆయన. రైతులు, పేదలు, మధ్యతరగతి వర్గాల కుటుంబాల్లో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు. ఎన్టీఆర్‌ ఎప్పుడో మహిళలకు ఆస్తిలో ఇచ్చిన సమాన వాటా హక్కును కేంద్రం ఇటీవలే అమలు చేసింది. దేశంలో ఉన్న డ్వాక్రా సంఘాల సంఖ్యతో సమానంగా రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు. తొలి పంచవర్ష ప్రణాళికలో రాసుకున్న నదుల అనుసంధానం ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. ఎన్టీఆర్‌ కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు సాగునీటి సదుపాయం కల్పించారు. గోదావరి నీటిని పటి ్టసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన సీఎంలు 22వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే, ఒక్క చంద్రబాబు మాత్రమే 15వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. సీఎం జగన్‌ ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేయలేదు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. బ్రిటిష్‌ వారు మాదిరిగా ప్రకృతి వనరుల లూటీ జరుగుతోంది. స్వాతంత్రం కోసం ఎలాంటి పోరాటం జరిగిందో అదేవిధంగా చంద్రబాబు పాలన కోసం అలాంటి పోరాటం చేయాలి.

చంద్రబాబు భయపడలేదు..

బాలకోటయ్య, దళిత బహుజన జేఏసీ నేత

దేశంలో ఇలాంటి పుస్తకాలు రాయదగ్గ ఏకైక నాయకుడు చంద్రబాబు. నాయకుడంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు. రాబోయే తరాల కోసం పనిచేసేవాడు. వర్తమానంలో చంద్రబాబు పడిన ఘోష ఈ పుస్తకంలో కనిపించలేదు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రమంతా భయపడింది. ఆయన మాత్రం భయపడలేదు.

రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గోపాలగౌడను కలిశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయనను మహిళా రైతులు శాలువా కప్పి సత్కరించారు. కొద్దిసేపు ఆయన వారితో ముచ్చటించారు. మహిళా రైతులు చెప్పిన సమస్యలు విన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:07 AM