Share News

బైపాస్‌ రోడ్డుకు మళ్లీ బీటలు

ABN , Publish Date - May 27 , 2024 | 01:09 AM

కాజ - విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగమైన విజయవాడ పశ్చిమ బైపాస్‌ ప్యాకేజీ - 3 పనుల్లో మళ్లీ లోపం బయటపడింది. ఈ రోడ్డు ప్రారంభం కాకుండానే ఇప్పటికి రెండుసార్లు బీటలు వారగా.. మూడోసారి మర్లపాలెం ఫ్లైఓవర్‌ ఫుట్‌పాత్‌కు బీటలు వారటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పనులు కాంట్రాక్టు సంస్థ తరపున సైట్‌ ఇంజనీర్‌, ఎన్‌హెచ్‌ తరపున సైట్‌ ఇంజనీర్ల వైపు నుంచి సరైన పర్యవేక్షణా లోపం వల్లే ఈ పగుళ్లు వచ్చాయని చర్చ నడుస్తోంది.

బైపాస్‌ రోడ్డుకు మళ్లీ బీటలు

మర్లపాలెం ఫ్లై ఓవర్‌ ఫుట్‌పాత్‌కు పగుళ్లు

క్రాష్‌ బ్యారియర్స్‌ పనులు చేస్తుండగా గుర్తించిన కార్మికులు

కాంట్రాక్టు సంస్థకు ఫిర్యాదు చేసినా చలనం శూన్యం

ఎన్‌హెచ్‌ అధికారుల మొక్కుబడి పరిశీలనలు

ఇప్పటికి రెండుసార్లు వేర్వేరు ప్రాంతాల్లో పగుళ్లు

తాజాగా మూడోసారి ఫ్లైఓవర్‌ ఫుట్‌పాత్‌కు నెర్రెలపై ఆందోళన

కాజ - విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగమైన విజయవాడ పశ్చిమ బైపాస్‌ ప్యాకేజీ - 3 పనుల్లో మళ్లీ లోపం బయటపడింది. ఈ రోడ్డు ప్రారంభం కాకుండానే ఇప్పటికి రెండుసార్లు బీటలు వారగా.. మూడోసారి మర్లపాలెం ఫ్లైఓవర్‌ ఫుట్‌పాత్‌కు బీటలు వారటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పనులు కాంట్రాక్టు సంస్థ తరపున సైట్‌ ఇంజనీర్‌, ఎన్‌హెచ్‌ తరపున సైట్‌ ఇంజనీర్ల వైపు నుంచి సరైన పర్యవేక్షణా లోపం వల్లే ఈ పగుళ్లు వచ్చాయని చర్చ నడుస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్యాకే జీ - 3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 27 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో విజయవాడ పశ్చిమ బైపాస్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 16వ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ - 16), 65వ నెంబర్‌ జాతీయ రహదారులను అనుసంధానించే విజయవాడ అవుటర్‌ మార్గం ఇది. ఎన్‌హెచ్‌ - 16 మీద పిన్నమనేని మెడికల్‌ కాలేజీకి అభిముఖంగా విజయవాడ పశ్చిమ బైపాస్‌ ప్రారంభమౌతోంది. గన్నవరం తర్వాత వచ్చే మర్లపాలెం గ్రామం వెలుపల రైల్వే ట్రాక్స్‌పై కాంట్రాక్టు సంస్థ ‘మేఘా’ మర్లపాలెం ఫ్లైఓవర్‌ పనులు చేపట్టింది. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయింది. ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా రెండువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఫుట్‌పాత్‌లకు సహజంగా ఎండ్‌ పాయింట్‌లో మాత్రమే క్రాష్‌ బ్యారియర్స్‌ నిర్మించాల్సి ఉండగా.. ఫుట్‌పాత్‌కు ఈవల రోడ్డు పోర్షన్‌వైపు కూడా కలిపి రెండు వైపులా క్రాష్‌ బ్యారియర్స్‌ నిర్మాణం చేపడుతున్నారు. రోడ్డు మీద హైస్పీడ్‌తో వెళ్లే వాహనాల నుంచి రక్షణ కల్పించటానికి, విద్యుత్‌ పోల్స్‌ వంటివి మరమ్మతులు చేయటానికి వీలుగా డబుల్‌ సైడ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో, స్థానిక సిబ్బంది ఫుట్‌పాత్‌ కాంక్రీటు శ్లాబు బీటలు వారటాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కాంట్రాక్టు సంస్థ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. బీబీగూడెం నుంచి మర్లపాలెం వచ్చే మార్గంలో కుడిచేతి వైపున ఫ్లై ఓవర్‌ రైల్వే పోర్షన్‌ ప్రారంభంలోనే ఫుట్‌ఫాత్‌ శ్లాబుకు బీటలు వారాయి. దీంతో క్రాష్‌ బ్యారియర్స్‌ పనులు చేపట్టే సిబ్బంది భయపడిపోతున్నారు. ఈ పనుల్లో సైట్‌ ఇంజనీర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇతర రాష్ర్టాల నుంచి పనుల కోసం వచ్చిన కూలీలు ఈ విషయాన్ని కాంట్రాక్టు సంస్థ దృష్టికితీసుకు వచ్చే వరకు ఉభయ సైట్‌ ఇంజనీర్లు ఈ విషయాన్ని కనిపెట్టకపోవటం గమనార్హం.

గతంలోనూ బీటలు..

విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఇంతకు ముందు కూడా రెండు సార్లు బీటలు వారాయి. మొదటిసారి ఇదే మర్లపాలెం దగ్గర ఫ్లై ఓవర్‌కు అప్రోచ్‌ మార్గం బీటీ రోడ్డు బీటలు వారింది. రెండోసారి గన్నవరం, బీబీ గూడెం నుంచి కొండపావులూరు వెళ్లే మార్గంలో బీటీ రోడ్డుకు బీటలు వారాయి. ఈ రెండు ఉదంతాలను ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రచురించింది. కాంట్రాక్టు సంస్థ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆ భాగాలను తొలగించి కొత్తగా మళ్లీ పనులు చేపట్టింది. తాజాగా మూడోసారి మర్లపాలెం ఫ్లై ఓవర్‌ ఫుట్‌పాత్‌కు బీటలు వారింది. మర్లపాలెం దగ్గర బీటలు వార టం ఇది రెండోసారి. విజయవాడ బైపాస్‌ దాదాపుగా 90 శాతంపైగా పనులు అయినా నాలుగైదు చోట్ల ఆర్‌ఓబీల పనులు పూర్తి కాలేదు. ఈ కారణంగా విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఇంకా అందుబాటులోకి రాకుండానే.. వరుసగా బీటలు వారుతున్న ఉదంతాలు బయట పడటంతో.. నాణ్యతను ఎన్‌హెచ్‌ అధికారులు సరిగా పరిశీలించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - May 27 , 2024 | 01:09 AM