Share News

వైసీపీ సమర్పించు బుసకాసురుడు!

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:09 AM

అధికార పార్టీ నాయకుల బుసక దందాకు అంతులేకుండా పోతోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా ఉన్న ఒక ద్వితీయశ్రేణి నాయకుడు ఈ అక్రమానికి తెగబడుతున్నాడు. ఎన్నికల తరువాత మళ్లీ అవకాశం దక్కుతుందో లేదోనని హడావుడిగా బుసక వ్యాపారం చేస్తూ ప్రైవేటు ఖాళీ స్థలాలను మెరక చేసే పనులు ప్రారంభించాడు. బందరుపోర్టు పనుల్లో భాగంగా తవ్వుతున్న మట్టిని టిప్పర్ల ద్వారా తరలించి ప్రైవేటు స్థలాల మెరకకు అమ్ముకుంటున్నాడు. విషయం తెలుసుకుని అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై చిందులు తొక్కాడు. నేనేంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

వైసీపీ సమర్పించు బుసకాసురుడు!

బందరులో అధికార పార్టీ నాయకుడి బుసక దందా

కరగ్రహారం ఇళ్ల స్థలాల మెరక పేరుతో అనుమతులు

ప్రైవేటు స్థలాలకు అమ్మి రూ.కోట్లలో ఆర్జన

అక్రమాన్ని అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందికి బెదిరింపులు

అడ్డుకుంటే నేనేంటో చూపిస్తానని తీవ్ర హెచ్చరిక

అధికార పార్టీ నాయకుల బుసక దందాకు అంతులేకుండా పోతోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా ఉన్న ఒక ద్వితీయశ్రేణి నాయకుడు ఈ అక్రమానికి తెగబడుతున్నాడు. ఎన్నికల తరువాత మళ్లీ అవకాశం దక్కుతుందో లేదోనని హడావుడిగా బుసక వ్యాపారం చేస్తూ ప్రైవేటు ఖాళీ స్థలాలను మెరక చేసే పనులు ప్రారంభించాడు. బందరుపోర్టు పనుల్లో భాగంగా తవ్వుతున్న మట్టిని టిప్పర్ల ద్వారా తరలించి ప్రైవేటు స్థలాల మెరకకు అమ్ముకుంటున్నాడు. విషయం తెలుసుకుని అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై చిందులు తొక్కాడు. నేనేంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం శివారునున్న కరగ్రహారం జగనన్న లే అవుట్‌లోని 350 ఎకరాలను మెరకచేసే పనులు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడికి అప్పగించారు. ఆయన మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు స్థలాలను మెరక చేసే పనులకు కాంటాక్ర్టుకు తీసుకున్నాడు. బందరుపోర్టు వద్ద తవ్వే బుసకను కరగ్రహారం జగనన్న లే అవుట్‌కు తరలించకుండా తాను కాంట్రాక్టుకు తీసుకున్న ప్రైవేటు స్థలాలకు తరలించి విక్రయిస్తున్నాడు. ఇప్పటికే జలాల్‌పేటలోని రెండెకరాల ప్రైవేటు స్థలంలోకి మట్టిని తరలించి మెరక చేశాడు. ఈ వ్యాపారం బాగుండటంతో మచిలీపట్నం-ఒంగోలు జాతీయ రహదారి 216-ఏ పక్కనే ఎస్‌ఎన్‌ గొల్లపాలెం సమీపంలోని పంట భూముల్లోకి పోర్టు వద్ద తవ్విన బుసకను టిప్పర్ల ద్వారా తరలించే పనిని బుధవారం ప్రారంభించాడు. పోర్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో 10 టిప్పర్లలో బుసకను నింపితే నాలుగు టిప్పర్లను కరగ్రహారం లే అవుట్‌కు, ఆందులో ఆరింటిని ప్రైవేటు స్థలాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో టిప్పర్‌ బుసకను రూ.7,500కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.

రెవెన్యూ అధికారికి బెదిరింపులు..

బందరుపోర్టు పనుల్లో భాగంగా తవ్విన బుసకను కరగ్రహారం లే అవుట్‌ వద్దకు కాకుండా ఎస్‌ఎన్‌ గొల్లపాలెం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న పంట భూముల్లోకి తరలిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సిబ్బంది బుసక తరలింపు అనుమతులు చూపాలన్నారు. అనుమతులు చూపకపోవడంతో టిప్పర్లను తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించాలని ఆదేశించారు. అక్కడున్న అధికార పార్టీ నాయకుడికి ఈ సమాచారం అందింది. ‘ఈ భూమిని మెరకచేసే పనులను నేనే కాంట్రాక్టుకు తీసుకున్నాను. టిప్పర్లను ఆపవద్దు. బుసక రవాణాను అడ్డుకుంటే నేనేంటో చూపిస్తా’ అని ఆ అధికారిని బెదిరించాడు. పంట భూములను మెరక చేసేందుకు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా, సీనరేజి కట్టకుండా బుసకను ఎలా తరలిస్తారని రెవెన్యూ సిబ్బంది ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. ‘బుసక తరలింపును ఆపేది లేదు. ఎవరు అడ్డుకుంటారో చూస్తా’ అని ఫోన్‌లోనే రెవెన్యూ సిబ్బందిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టిప్పర్లలో ఉన్న బుసకను జాతీయ రహదారిపై దింపేసి వాహనాలను తీసుకువచ్చేయాలని తన అనుచరులకు సూచించి వాహనాలను తీసుకుపోయాడు.

జగనన్న లే అవుట్ల పేరుతో దందా..

మచిలీపట్నంలో జగనన్న లే అవుట్‌ల మెరక పనుల్లో అధికశాతం ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న ద్వితీయశ్రేణి నాయకుడికే కట్టబెట్టారు. గిలకలదిండిలో 20 ఎకరాల్లో జగనన్న లే అవుట్‌ మెరక పనులు ఇతనే చేశాడు. ప్రభుత్వ భూముల్లో ఉన్న బుసకను తరలించేసి రూ.3కోట్లకుపైగా బిల్లులు చేసుకున్నట్టు ఆపార్టీ నాయకులే చెబుతున్నారు. గిలకలదిండిలోని లే అవుట్‌ను పూర్తిస్థాయిలో మెరకచేయకుండా రూ.3కోట్లు బిల్లులు చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సక్రమంగా మెరక పనులు చేయని నేపథ్యంలో స్థానిక పెద్దలు ప్రశ్నిస్తే వారికి కొంతనగదు ముట్టచెప్పి ఈ విషయంపై మాట్లాడకుండా చేశాడు. కరగ్రహరం లే అవుట్‌ పనులను ఈ ద్వితీయశ్రేణి నాయకుడికే అప్పగించడంతో దీనిని సాకుగా చూపి బయటి ప్రాంతాలకు బుసకను విక్ర యిస్తూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నాడు. బందరుపోర్టు వద్ద తవ్విన బుసకను కృష్ణా యూనివర్సిటీ ఆవరణకు తరలించి మెరక చేస్తామని చెప్పినా ఇంతవరకు ఒక్క టిప్పరు మట్టిని కూడా తరలించలేదు. బయటి ప్రాంతాలకు మాత్రం యథేచ్ఛగా బుసకను విక్రయించేస్తుడటం గమనార్హం.

Updated Date - Feb 29 , 2024 | 01:09 AM