Share News

బుసక తవ్వకాలు.. అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:36 AM

చల్లపల్లి మండలం నడకుదురు రేవులో బుసక తవ్వకాల వివాదం సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. పాగోలు లేఅవుట్‌ మెరక పేరుతో రాత్రి వేళ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి బయటకు విక్రయిస్తున్నారంటూ రైతులు శుక్రవారం అర్థరాత్రి తవ్వకాలను అడ్డుకున్న విషయం తెలిసిందే.

బుసక తవ్వకాలు.. అడ్డుకున్న  రైతులు
తహసీల్ధార్‌ సుమతితో మాట్లాడుతున్న ఇరుపక్షాల పెద్దలు

చల్లపల్లి, ఫిబ్రవరి 5 : చల్లపల్లి మండలం నడకుదురు రేవులో బుసక తవ్వకాల వివాదం సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. పాగోలు లేఅవుట్‌ మెరక పేరుతో రాత్రి వేళ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి బయటకు విక్రయిస్తున్నారంటూ రైతులు శుక్రవారం అర్థరాత్రి తవ్వకాలను అడ్డుకున్న విషయం తెలిసిందే. లేఅవుట్‌కు బుసక రవాణా నిలిచిపోవటంతో పాగోలు లబ్ధిదారులు సోమవారం ఉదయం నడకుదురు రేవుకు తరలివచ్చారు. గ్రామ సర్పంచ్‌ తోటశ్రీనివాసరావు లబ్ధిదారులకు మద్ధతుగా అక్కడకు వచ్చారు. స్థానిక రైతాంగం, నాయకులతో తొలుత చర్చలు జరపగా, తవ్వకాలను ఒప్పుకోబోమని వారు తెగేసి చెప్పారు. మధ్యాహ్నం ఎండలో లబ్ధిదారులు రేవులోనే ఉండటంతో వారికి భోజనాలు అక్కడికే తీసుకువచ్చారు. మధ్యాహ్నం సమయంలో బుసక కోసం టిప్పర్‌ను పిలిపించటంతో తవ్వకాలను అడ్డుకునేందుకు రైతులు, స్థానిక నేతలు రేవులోకి వచ్చారు.

ఇరుపక్షాల వాగ్వాదం

టిప్పర్‌తో తవ్వకాలకు సిద్ధమవుతుండగా రైతులు నిలదీశారు. లే అవుట్‌ పేరుచెప్పి బుసక బయటకు విక్రయిస్తున్నారనీ, ఉప్పునీటి చొరబాటును ఆపే దిబ్బలు తవ్వటం పంట పొలాలకు తీవ్ర నష్టమని తెలిపారు. లేఅవుట్‌కు వచ్చే మెరకను అడ్డుకోవటం సరికాద ని మహిళలు తెలిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అధికారుల రంగప్రవేశం

సమాచారం అందుకున్న చల్లపల్లి ఇన్‌చార్జి ఎస్‌ఐ ప్రతాపరెడ్డి సంఘటనా ప్రదేశానికి వచ్చి ఇరుపక్షాలతో మాట్లాడారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు, తహసీల్ధార్‌కు తెలియజేయటంతో తహసీల్ధార్‌ బి.సుమతి అక్కడకు వచ్చారు. లే అవుట్‌కు బుసక తోలకంపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. సీఆర్‌జడ్‌ పరిధిగా కోర్టు సూచించిన కారణంగా ఎప్పటినుంచో తవ్వకాలు నిలుపుదల చేశారనీ, గతంలో క్వారీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు ఆదేశాల ప్రకారం డిపాజిట్‌ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయటం జరిగిందని పురిటిగడ్డ మాజీ సర్పంచ్‌ పరుచూరి సురేష్‌బాబు తెలిపారు. సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్నట్టు గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్టీఐ సమాచారాన్ని ఫోన్‌లో న్యాయవాది కొర్రపాటి వీరసింహుడు తహసీల్ధార్‌కు చూపించారు. లే అవుట్‌ కోసమని తవ్వకాలు చేపట్టి బయటకు విక్రయిస్తున్నారనీ, లే అవుట్‌ మెరక కోసం అనుమతి ఇస్తే ఇష్టానుసారం తవ్వుతారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని తహసీల్ధార్‌కు చూపి ఉప్పునీటి చొరబాటు గురించి వివరించారు. బుసక కోసం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్నామనీ, తమ లే అవుట్‌కు మెరక తోలేందుకు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు తహసీల్ధార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరుపక్షాల్లో ముఖ్యులను మంగళవారం ఉదయం కార్యాలయానికి రావాలనీ, సీఆర్‌జెడ్‌ పరిధిని పేర్కొంటూ ఉన్న ఉత్తర్వులను గానీ, కోర్టు డాక్యుమెంట్స్‌ను గానీ తీసుకురావాలని తహసీల్ధార్‌ రైతులకు సూచించారు. కార్యక్రమంలో మాజీసర్పంచ్‌ మాతంగి వేణు, రైతు ప్రముఖులు నాదెళ్ల వెంకట నరసయ్య, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:36 AM