Share News

ఇసుక దోపిడీకి బ్రేక్‌

ABN , Publish Date - May 03 , 2024 | 01:01 AM

ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలకు ఈసీ నిర్ణయం గొంతులో వెలక్కాయపడినట్టుగా చేసింది. నందిగామ నియోజక వర్గంలో అధికార పార్టీ పెద్దలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న ఇసుక దోపిడీకి ఎన్నికల కమిషన్‌ జోక్యంతో బ్రేక్‌ పడింది.

ఇసుక దోపిడీకి బ్రేక్‌

నందిగామ నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమ తవ్వకాలు

ఆధారాలతో సహా ఈసీకి టీడీపీ నాయకుడి ఫిర్యాదు

స్పందించిన అధికారులు.. రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు చెక్‌

పరిశీలనకు వెళ్లిన అధికారులు.. చర్యలు మాత్రం శూన్యం

ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలకు ఈసీ నిర్ణయం గొంతులో వెలక్కాయపడినట్టుగా చేసింది. నందిగామ నియోజక వర్గంలో అధికార పార్టీ పెద్దలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న ఇసుక దోపిడీకి ఎన్నికల కమిషన్‌ జోక్యంతో బ్రేక్‌ పడింది.

కంచికచర్ల : నందిగామ నియోజ కవర్గంలోని కొంతమంది అధికారుల అండతో వైసీపీ పెద్దలు ఒకవైపు కృష్ణానదిని, మరోవైపు మునేరును భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కొద్దిరోజుల్లో పోలింగ్‌ జరగనున్నప్పటికీ ఈసీ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇసుకను అక్రమంగా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. అక్రమార్జనకు పూనుకుంటున్నారు. అనధికారికంగా సాగుతున్న ఈ దోపిడీపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో కంచికచర్ల మండలం కొత్తపేటకు చెందిన అబ్బూరు నాగమల్లేశ్వరరావు మూడు రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ రంగంలోకి దిగటంతో తప్పనిపరిస్థితుల్లో కేసు నమోదు చేసి, మంగళవారం సాయంత్రం రీచ్‌ల్లోకి వాహనాలు వెళ్లకుండా రోడ్లకు గండ్లు కొట్టించారు. కాగా, రీచ్‌ల్లో ఉన్న వాహనాలను సీజ్‌ చేయకుండా అధికారులు సురక్షితంగా బయటకు పంపించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నామమాత్రంగా అధికారుల పరిశీలన

కంచికచర్ల మండలం గని ఆత్కూరు, చెవిటికల్లు, మున్నలూరు గ్రామాల పరిధిలోని కృష్ణానదిలో, ఎస్‌.అమరవరం, వేములపల్లి గ్రామాల పరిధిలోని మునేటిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ సంస్థ పేరుతో అధికార పార్టీకి చెందిన పెద్దల కనుసన్నల్లో ఈ దోపిడీ జరుగుతోంది. వాస్తవానికి రీచ్‌లకు అనుమతుల్లేవని అంటున్నారు. అయినప్పటికీ పదుల సంఖ్యలో భారీ యంత్రాలతో కృష్ణానదిని, మునేటిని కొల్లగొడుతున్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దోపిడీ జరుగుతున్నప్పటికీ అధికారులు మౌనం దాల్చారు. అక్రమ తవ్వకాల గురించి పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ చూస్తూ ఊరుకున్నారు. పైగా కొంతమంది అధికారుల అండతో వైసీపీ పెద్దలు నిర్భయంగా రేయింబవళ్లూ దోపిడీ సాగించారు. లోడింగ్‌ను బట్టి ఒక్కో లారీ నుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేసేవారు. హైదరాబాద్‌ వెళ్లే లారీలకు మన రాష్ట్ర పరిధిలో ఎలాంటి ఆటంకం లేకుండా కోదాడ వరకు పంపించేవారు. ఇందుకు ఎక్కడికెక్కడ ముడుపులు ఇవ్వాలంటూ మరో రూ.5 వేలు అదనంగా తీసుకునేవారు. అన్ని రీచ్‌లకు కలిపి రోజూ వందకు పైగా లారీలు వచ్చేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇసుక దోపిడీ గురించి పోలీస్‌, సెబ్‌, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు స్పందించటం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పేర్కొంటూ నాగమల్లేశ్వరరావు గతనెల 27న ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో 30వ తేదీన 142/2024 నెంబరుతో యూ/ఎస్‌ 379, 171-హెచ్‌, ఐపీసీ 27, 35 వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు మంగళవారం సాయంత్రం రీచ్‌ల వద్దకు వెళ్లారు. ముఖ్యంగా మున్నలూరు, ఎస్‌.అమరవరం, వేములపల్లి రీచ్‌ల్లోకి వాహనాలు వెళ్లకుండా రోడ్లకు గండ్లు కొట్టారు. కాగా, అధికారులు వెళ్లినప్పుడు రీచ్‌లలో పదుల సంఖ్యలో యంత్రాలు, లారీలు ఉన్నాయి. వాటిని సీజ్‌ చేయలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పైగా ఆ వాహనాలన్నింటినీ బయటకు పంపించటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 03 , 2024 | 01:01 AM