Share News

కాటేస్తున్న కలుషిత నీరు!

ABN , Publish Date - May 30 , 2024 | 12:32 AM

విజయవాడ మొగల్రాజపురంలో గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంకా వాంతులు, విరేచనాలతో బాధితులు ఆసుపత్రులకు పరిగెత్తుతూనే ఉన్నారు. అస్వస్థతకు అసలు కారణం ఇంకా తేలకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా బాధితులు ఎక్కువమంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం మరొకరి మృతితో అధికారులు హుటాహుటిన పరుగులు పెట్టారు. అప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఇరుకు రోడ్డులో భారీ వాహనాల రాకతో స్థానికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు.

కాటేస్తున్న కలుషిత నీరు!
వాంతులు, విరేచనాలతో శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితురాలు

  • 72 గంటల్లో నలుగురి మృతి

  • ప్రయివేటు ఆసుపత్రులకు బాధితులు

  • డయేరియా కాదంటున్న అధికారులు

  • టూల్‌ రిపోర్టు కోసం నిరీక్షణ : డీఎంహెచ్‌వో

  • కలెక్టర్‌ స్పందించాలి : సీపీఎం బాబూరావు

విజయవాడ మొగల్రాజపురంలో గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంకా వాంతులు, విరేచనాలతో బాధితులు ఆసుపత్రులకు పరిగెత్తుతూనే ఉన్నారు. అస్వస్థతకు అసలు కారణం ఇంకా తేలకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా బాధితులు ఎక్కువమంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం మరొకరి మృతితో అధికారులు హుటాహుటిన పరుగులు పెట్టారు. అప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఇరుకు రోడ్డులో భారీ వాహనాల రాకతో స్థానికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు.

మొగల్రాజపురం, మే 29 : మొగల్రాజపురం ఏరియాలో గత మూడురోజులుగా తాగునీరు కలుషితమై వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరి నలుగురు మృతిచెందారు. అయితే వైద్యాధికారులు ఇప్పటివరకు వారి మరణాలపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నీరు కలుషితం వల్ల కాదని, కెమికల్‌ రిపోర్టు బాగానే ఉందని చెబుతున్నారు. మిగిలిన రిపోర్టులు రావాలంటే ఇంకా మూడు, నాలుగు రోజులు పడుతుందని చెబుతున్నా.. కలుషిత నీటివల్ల కాకపోతే వాంతులు విరేచనాలు ఎందుకు అవుతున్నాయన్న దానికి సమాధానం చెప్పేవారులేరు. శనివారం నుంచి సోమవారం వరకు శికా ఇందిర (45), కాకర్లమూడి ఇందిర (55) వల్లూరి దుర్గారావు (46)లు మృతిచెందారు. వాంతులు, విరేచనాలతో కళ్యాణ్‌ అనే యువకుడు ప్రభుత్వాసుపత్రిలో చేరి మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని విస్సన్నపేట మండలం వేమిరెడ్డి పల్లెకు బంధువులు తీసుకెళ్లారు. ఇతను ఎలా మరణించాడనే దానిపై స్పష్టత రాలేదు.

వీఎంసీ సిబ్బందిపై చర్యలు శూన్యం

మొగల్రాజపురం 7వ డివిజన్‌ ప్రజలకు బాలభాస్కర్‌ నగర్‌, పటమట వారి వీధిలో కొండ మీద ఉన్న ట్యాంకు నుంచి మంచినీరు సరఫరా అవుతుంది. ఈ రెండు ట్యాంకులకు వీఎంసీ సిబ్బంది బోరు వాటర్‌ ఎక్కిస్తారు. ఎక్కించే ముందు ట్యాంకుల వద్ద ఉన్న బూస్టర్‌ల ద్వారా క్లోరినేషన్‌, ఫిల్టరైజేషన్‌ చేయాల్సి ఉంది. ఈ రెండు చోట్ల ఫిల్టరైజేషన్‌ సరిగా జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్యాంకులు కూడా రెండు వారాలకు ఒకసారి శుభ్రం చేయాల్సి ఉండగా అది కూడా సరిగా జరగడం లేదన్నారు. మంగళవారం దుర్గారావు మృతిచెందాడని తెలిసి అప్పటికపుడు స్కవరింగ్‌ పేరుతో పైపుల్లో ఉన్న మురికి నీటిని బయటకు వదిలేశారని చెబుతున్నారు. స్కవరింగ్‌ అయిన తరువాత శాంపిల్స్‌ తీసి కెమికల్‌ పరిక్ష చేసి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎక్కడా బయటకు పొక్కనివ్వడం లేదు. ‘పైపుల్లో నీరు తాగద్దు.. ట్రాక్టర్‌ల ద్వారా వచ్చే నీరు మాత్రమే తాగండి.. నీటిని కాచి చల్లార్చుకోండి..’ అని మాత్రం కొండ కింద మైక్‌లు పెట్టి ప్రచారం చేస్తున్నారు.

నలుగురి మృతిపై స్పష్టత ఇవ్వని అధికారులు

మూడు రోజుల వ్యవధిలో నాలుగు మరణాలు సంభవించినా కారణాలను వీఎంసీ గాని ఆరోగ్యశాఖగాని, ఫుడ్‌ సేఫ్టీ అధికారులుగానీ చెప్పడం లేదు. దీంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. మృతులకు వేరే ఆరోగ్య సమస్యలున్నాయని అఽధికారులు చెబుతున్నా.. వాంతులు, విరేచనాలు ఎందుకు అవుతున్నాయో అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై డీఎంహెచ్‌వో సుహాసినిని వివరణ కోరగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన యువకుడు బయట ఫుడ్‌ తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మరణాలపై స్పష్టత కావాలంటే టూల్‌ రిపోర్డు రావాలని ఆమె చెప్పారు. డివిజన్‌లో భగత్‌ సింగ్‌ గ్రంథాలయంలో ఆరు పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు.

బుధవారం వీఎంసీ వాటర్‌ సప్లై అధికారులు డివిజన్‌లో వాంతులు విరేచనాలతో మరణించిన వారి ఇళ్లకు మంచినీటి సరఫరా పైపు లైన్లను డమ్మీలు చేశారు. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ సర్వేలో ఆరు కేసులను గుర్తించారు. మరికొందరు కోలుకుని ఇంటి వద్దే ఉండగా, ఇద్దరు మాత్రం వైద్యశిబిరానికి వచ్చారు. చికిత్స అనంతరం వారిని ఇంటికి పంపేశారు.

ట్రాఫిక్‌ సమస్యతో స్థానికుల పాట్లు

7వ డివిజన్‌లోని బోయపాటి మాధవరావు రోడ్డులో సీపీఎం కార్యాలయం ఉండగా పక్క వీధిలోనే మృతుడు దుర్గారావు నివాసం ఉంది. దీంతో పార్టీ కార్యాలయంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఆరు పడకలను సిద్ధం చేశారు. అన్ని శాఖల అధికారులు ఇక్కడకు రావడం సుమారు 100 మంది సిబ్బంది పనిచేస్తుండటం, పైపులైన్లు, యూజీడీ పూడిక తీసే యంత్రాలు, చెత్త తరలించే వాహనాలు అన్నీ అక్కడకు చేరుకోవటంతో బుధవారం ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. మాచవరం సీఐ గుణరాం సిబ్బందితో వచ్చి పరిస్థితి పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రజా సమస్యలు పట్టని కార్పొరేటర్‌!

శనివారం నుంచి డివిజన్‌లో మృత్యుఘోష మోగుతుంటే స్థానిక కార్పొరేటర్‌ ఎక్కడా కనిపించలేదు. అధికారులు వచ్చినపుడు మాత్రం వైసీపీ డివిజన్‌ నాయకులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బాధితులను గాని, మృతుల కుటుంబాలను గాని పరామర్శించిన దాఖలాలు లేవు.

బాధ్యులపై చర్యలకు సీపీఎం డిమాండ్‌

మొగల్రాజపురంలో తాగునీరు కలుషితం వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అస్వస్థతకు గురై మరణిస్తున్నా నాయకులు మాత్రం ఇంకా ఓట్ల లెక్కల్లోనే ఉన్నారని, అఽధికారులు కూడా సమస్య తీవ్రతను గోప్యంగా ఉంచుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబురావు విమర్శించారు. బుధవారం ఆయన మృతుల కుటుంబాలను, బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. బాధితుల మృతికి కారణాలు ఇప్పటికీ గుర్తించకపోవడంపై ఆయన డీఎంహెచ్‌వో సుహాసినిని నిలదీశారు. ఆసుపత్రుల్లో చేరి నలుగురు మరణించినా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌, ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి

రెండు నెలలుగా మంచినీరు కలుషితం గురించి చెబుతున్నా పట్టించుకోని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బాబూరావు ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, బాధితుల కుటుంబాలకు రూ.25వేలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నగర కార్యదర్శి గుండిమెడ క్రాంతి కుమార్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి.కృష్ణా, అప్పరబోతు రాము, నగర కమిటీ సభ్యులు మురహరి, క్రాంతి, టి శేఖర్‌, కె.రమణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:32 AM