Share News

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:22 AM

మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలను కల్పించి ఆయా వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి   రూ.3 కోట్ల నిధులు

అవనిగడ్డ, మార్చి 17 : మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలను కల్పించి ఆయా వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆదివారం ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని, నాబార్డు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రాజెక్టు కింద చైర్మన్‌ కేవీ షాజితో మాట్లాడి అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో ఉన్న దాదాపు 500 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు ఎంపీ తెలిపారు. ఆయా వర్గాల అభ్యున్నతికి నిధులు ఉపయోగపడతాయని బాలశౌరి తెలిపారు. మొత్తం 500 యానాది కుటుంబాల్లో 150 కుటుంబాలకు 30 చిన్న చిన్న బోట్లు, 30 వలలు అందజేస్తామని, మరో 150 కుటుంబాలకు చేపలు పట్టే 30 కేజ్‌లు అందిస్తామని, 30 కుటుంబాలకు ఆక్వా కల్చర్‌కు అనువుగా ఉన్న భూములను చెరువులుగా మార్చి ఇవ్వనున్నట్టు తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు 20 కుటుంబాలను కలిపి చేపల ఫీడ్‌ తయారు చేసే మిషనరీని కొనుగోలు చేసి వారికి అందిస్తామని, 40 కుటుంబాలకు రొయ్యలు, పీతల సీడ్‌ పెంచేలా రైతులను ప్రోత్సహిస్తామని బాలశౌరి తెలిపారు. యానాదుల కుటుంబాలకు ప్రతీ ఆరు నెలలకొకసారి వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని, రెండు మండలాల్లోని ఐదు గ్రామాల్లో శుద్ధి చేసిన నీటిని అందించేందుకు నీళ్ల ట్యాంక్‌లు ఏర్పాటు చేస్తామని ఎంపీ బాలశౌరి ప్రకటనలో తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 01:22 AM