Share News

బండిపోటు

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:14 AM

వెనకటికి బందిపోట్లు రైళ్లను అడ్డగించి ప్రయాణికులను అందినకాడికి దోచుకుపోయేవారు. ఇప్పుడు అలాంటి బందిపోటు ఉదంతాలు లేకపోయినా కొందరు రైల్వే సిబ్బందే ఆ అవతారమెత్తి కదులుతున్న రైళ్లలోనే ప్రయాణికులను దోచుకుంటూ కొత్త రకంగా దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రం కాని వారిని నిలువునా దోచేస్తున్నారు. విజయవాడ డివిజన్‌కు చెందిన ఓ రైల్వే స్క్వాడ్‌ ఇన్‌చార్జి బందిపోటు అవతారమెత్తినా ఉన్నతాధికారులు ఉపేక్షిస్తూ కూర్చుంటున్నారు.

బండిపోటు

రైళ్లలో ప్రయాణికులను దోచేస్తున్న ఓ అధికారి

స్క్వాడ్‌ ఇన్‌చార్జిగా ఇష్టానుసారంగా తనిఖీలు

ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికులే టార్గెట్‌

టికెట్‌ ఉన్నా.. దబాయించి మరీ దందా

ఇంతకుముందు పలు రైళ్లలో ఇదే పరిస్థితి

అనేకమార్లు సస్పెన్షన్‌.. అయినా మారని తీరు

ఉపేక్షిస్తున్న ఉన్నతాధికారులు

వెనకటికి బందిపోట్లు రైళ్లను అడ్డగించి ప్రయాణికులను అందినకాడికి దోచుకుపోయేవారు. ఇప్పుడు అలాంటి బందిపోటు ఉదంతాలు లేకపోయినా కొందరు రైల్వే సిబ్బందే ఆ అవతారమెత్తి కదులుతున్న రైళ్లలోనే ప్రయాణికులను దోచుకుంటూ కొత్త రకంగా దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రం కాని వారిని నిలువునా దోచేస్తున్నారు. విజయవాడ డివిజన్‌కు చెందిన ఓ రైల్వే స్క్వాడ్‌ ఇన్‌చార్జి బందిపోటు అవతారమెత్తినా ఉన్నతాధికారులు ఉపేక్షిస్తూ కూర్చుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పశ్చిమ బెంగాల్‌, అసోం, బిహార్‌, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ వంటి ఈశాన్య రాష్ర్టాల ప్రయాణికులను అవినీతి రుచి మరిగిన విజయవాడ డివిజన్‌కు చెందిన ఓ రైల్వే స్క్వాడ్‌ ఇన్‌చార్జి దోచుకుతింటున్నాడు. బతుకుతెరువు కోసం మన రాష్ట్రానికి వస్తున్న వారిని పిండేస్తున్నాడు. సాధారణంగా టికెట్లు తీసుకోని వారికి జరిమానాలు విధించాల్సి ఉండగా, టికెట్‌ తీసుకున్న వారి వద్ద కూడా బెదిరించి డబ్బు వసూలు చేయడం ఈయన నైజం. గతంలోనూ ఇతనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇతని దోపిడీకి మూడు గంటల పాటు ఓ రైలు ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండుసార్లు సస్పెండ్‌ వేటుపడినా అధికారులను పట్టుకుని మళ్లీ అదే పోస్ట్‌ దక్కించుకున్నాడు. ఇతనిపై ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రయాణికుడైనా రైల్లో ఎదురుతిరిగితే పిడిగుద్దులు కురిపించటం, దందాగిరీ చేయటం వెన్నతో పెట్టిన విద్య.

దోపిడీ ఇలా..

ఈయన ఏ రైలు పడితే ఆ రైలెక్కడు. పశ్చిమ బెంగాల్‌, అసోం, బిహార్‌, జార్ఖండ్‌ ప్రాంతాలు వెళ్లే రైళ్లలోనే డ్యూటీ చేస్తాడు. కొన్నేళ్లుగా అలెప్పీ-ధన్‌బాద్‌ల మధ్య నడిచే బొకారో ఎక్స్‌ప్రెస్‌, గోరఖ్‌పూర్‌-త్రివేండ్రం మద్య నడిచే గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎర్నాకుళం-పాట్నా మధ్య నడిచే రైళ్లలోనే చెకింగ్‌ డ్యూటీలు నిర్వహిస్తాడు. ఇందుకు అంతని ఈఎఫ్‌టీలే సాక్ష్యం. తన వెంట ఉండే జీఆర్పీ పోలీసులతో ఈయన హడావుడిగా రైలెక్కుతాడు. టికెట్లు తనిఖీ చేస్తాడు. టికెట్‌ లేని వారిని తనిఖీ చేసి జరిమానాలు విధించాల్సిన ఈ అధికారి టికెట్లు ఉన్నవారిని కూడా హడల్‌ కొడతాడు. టికెట్‌ ఉందని చెప్పినా, చూపించినా చెల్లదంటాడు. అది ఆ రైలు టికెట్‌ కాదంటాడు. జీఆర్పీ పోలీసులు కూడా ఈ బందిపోటు బాస్‌ చెప్పిందే నిజమంటారు. దీంతో తాము ఏ టికెట్‌ తీసుకున్నారో తెలియక ప్రయాణికులు కంగారు పడతారు. ఈ కంగారులోనే డబ్బు తీయమని డిమాండ్‌ చేస్తాడు. ఎలా మాట్లాడో కూడా తెలియక భాష రాని ప్రయాణికులు తమ అమాయకత్వంతో డబ్బు ముట్టజెబుతారు.

రెండుసార్లు సస్పెండ్‌ అయినా..

ఈ బందిపోటు బాస్‌ రెండుసార్లు పట్టుబడ్డాడు. రైల్వే అధికారులు సస్పెండ్‌ వేటు కూడా వేశారు. 2014-15లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసి పారిపోయాడు. ఈ ఘటనతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో మూడు గంటల పాటు ఆగిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే కానీ రైలు కదల్లేదు. ఈ వ్యవహారంలో బందిపోటు బాస్‌పై సస్పెండ్‌ వేటు పడింది. మళ్లీ కొన్నాళ్లకు ఇదే పోస్టులోకి వచ్చాడు. మళ్లీ మామూలే. 2021లో గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తనను బెదిరించి మరీ డబ్బు వసూలు చేయటంపై ఓ ప్రయాణికుడు నేరుగా రైల్వే బోర్డుకే ఫిర్యాదు చేయటంతో మళ్లీ సస్పెండ్‌ అయ్యాడు. ఉన్నతాఽధికారులను పట్టుకుని మళ్లీ అదే పోస్టులోకి వచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తనపై కేసులున్నా, సస్పెండ్‌ అయినా ఒకే పోస్టులో కొనసాగటం గమనార్హం.

అవినీతి అంచెలంచెలుగా..

రైల్వేలో క్లాస్‌-4 పోస్టు నుంచి ఈ బందిపోటు బాస్‌ అంచెలంచెలుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఒక ఆఫీసర్‌ దగ్గర బంగ్లా ప్యూన్‌గా మొదలై టీఐగా, సీటీఐగా ప్రస్తుతం స్క్వాడ్‌ ఇన్‌చార్జిగా దోపిడీ చేస్తున్నాడు. ఏబీసీడీలు కూడా సరిగ్గా రాని ఇతను అంటే రైల్వే ఉన్నతాధికారులకు ఎందుకంత ప్రేమో అర్థం కాదు. ఇటీవలే ముగ్గురు ఉద్యోగులు ఆయన దగ్గర పనిచేయలేమంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ బాస్‌ అక్రమ సంపాదనతో కావలి నుంచి సింగరాయకొండ వరకు భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు. ఈ విషయంపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.

Updated Date - Feb 06 , 2024 | 01:14 AM