గుడివాడలో ఘోరం
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:15 AM
గుడివాడలోని బస్టాండ్ సమీ పంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. సోహెల్ (24), సాయి (23), హర్ష.. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి కోతిబోమ్మ సెంటర్ వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
ఆర్టీసీ బస్సు కిందపడి ముగ్గురు యువకుల దుర్మరణం
గుడివాడ, ఫిబ్రవరి 5: గుడివాడలోని బస్టాండ్ సమీ పంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. సోహెల్ (24), సాయి (23), హర్ష.. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి కోతిబోమ్మ సెంటర్ వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. స్థానిక ఈవీఆర్ ఆసుపత్రి వద్ద డివైడర్ నుంచి తిరిగి బస్టాండ్ వైపునకు బండిని తిప్పారు. అయితే, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును గమనిం చలేదు. దీంతో ఏపీ 03 జెడ్ 5091 నెంబరు కలిగిన బస్సు వారిని బలంగా ఢీకొంది. సుమారు 100 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో ఘటనాస్థలంలోనే యువకులు మృతిచెందారు. మృతులు ఇద్దరు స్థానిక ముబారక్ సెంటర్‌కు చెందిన వారు కాగా, మరొకరు కాకర్ల వీధికి చెందినవారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృత్యువులోనూ కలిసే..
మృతులు ముగ్గురూ మంచి స్నేహితులు. మృత్యువు కూడా వీరి స్నేహాన్ని విడదీయలేకపో యింది. సోహెల్ స్థానికంగా ఒక వాటర్ ప్లాంట్‌లో ఆటోడ్రైవర్ కం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. హర్ష బైక్ మెకానిక్‌గా ఉంటూ 17 ఏళ్ల వయసులో కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. సాయి స్థానిక 9వ వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. తమకు అండగా ఉంటారనుకున్న కుమారులు కంటి ముందు అచేతనంగా పడి ఉండటంతో వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
వెనిగండ్ల ఆర్థిక సాయం
రోడ్డు ప్రమాదంలో యువకులు మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.