Share News

అసైన్డ్‌ మంత్రం

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:08 AM

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మొన్నటి వరకు రహదారుల పక్కన నివసించే వారికి తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా ఇంటి పట్టాలు ఇచ్చారు. తాజాగా అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని తెరపైకి తెచ్చి రైతులకు ఆశలు చూపుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే అసైన్డ్‌ భూములకు పట్టాలు మంజూరు అంశాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు వస్తున్నాయి.

అసైన్డ్‌ మంత్రం

అసైన్డ్‌ భూమికి పట్టాలిస్తామంటూ అధికార పార్టీ హడావుడి

మచిలీపట్నంలో 11 గ్రామాల్లోని భూములపై కన్ను

9,729 ఎకరాలు ఇతరుల చేతుల్లో..

హడావుడిగా సర్వేలు.. వీఆర్వోలపై ఒత్తిడి

ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగమే..

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మొన్నటి వరకు రహదారుల పక్కన నివసించే వారికి తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా ఇంటి పట్టాలు ఇచ్చారు. తాజాగా అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని తెరపైకి తెచ్చి రైతులకు ఆశలు చూపుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే అసైన్డ్‌ భూములకు పట్టాలు మంజూరు అంశాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : మచిలీపట్నం మండలం తీరప్రాంతంలో ఉన్న పోలాటితిప్ప, కొత్తపల్లెతుమ్మ లపాలెం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం, పల్లెతుమ్మలపాలెం, కోన, రుద్రవరం, గుండుపాలెం, చిన్నాపురం, వాడపాలెం గ్రామాల్లో వేలాది ఎకరాల అసైన్డ్‌, మడ అడవుల భూములు న్నాయి. వీటిని గతంలో పేదలకు ఇవ్వగా, వారు విక్రయిం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన బడాబాబులు ఈ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నారు. మత్స్యకారుల గ్రామాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కుటుం బానికి రెండున్నర ఎకరాలు, అంతకుమించి ప్రభుత్వ భూములను స్థానికులు పంచుకుని కొంతకాలానికి విక్రయించేశారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకున్నా బడాబాబులు ఈ భూములను కొని చేపలు, రొయ్యలు సాగు చేసున్నారు. ఒక్కో బడాబాబు వద్ద 200 నుంచి 1,500 ఎకరాలు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అసైన్డ్‌, ప్రభుత్వ భూములకు సంబంధించి ఎలాంటి క్రయవిక్ర యాలు జరగకూడదనే నిబంధన ఉన్నా, వివిధ రూపాల్లో వేలాది ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూమి నలుగురైదుగురు రైతుల చేతులు మారినట్లుగా రికార్డులు సృష్టించారు. ఈ తరహా భూములను సర్వే చేసి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చే ప్రతిపాదనను ఇటీవల తెరపైకి తెచ్చారు.

వీఆర్వోలపై ఒత్తిడి

గత మే 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సమయంలో అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ప్రతిపాదన పెట్టారు. దీంతో మచిలీపట్నం మండలంలో అసైన్డ్‌ భూములను సర్వే చేసిన అధికారులు ఈ భూములకు పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. మచిలీపట్నం మండలం తహసీల్దార్‌ ఈ తరహా పట్టాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన భూమి రికార్డులు తయారు చేయాలని ఇటీవల కాలంలో వీఆర్వోలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అసైన్డ్‌ భూముల వ్యవహారమంతా గజిబిజిగా ఉన్న నేపథ్యంలో ఎవరి పేరున పట్టాలు రాయాలనే అంశంపై వీఆర్వోలు గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని వీఆర్వోలు అంటున్నారు. భూమి పట్టాదారులు, లేదా వారి వారసులు, ప్రస్తుతం భూమిని సాగు చేసుకుంటున్న వారికి ఫారం-1, 2లను జారీ చేసే పనిలో ఉన్నారు. ఈ నోటీసులపై తహసీల్దార్‌ సంతకమే కాకుండా, వీఆర్వోలను కూడా సంతకాలు చేయాలని చెబుతుండటంతో భయం పట్టుకుంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అందిన ఈ నోటీసులో 15 రోజుల్లో సంజాయిషీ, అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంటున్నారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత అసైన్‌మెంట్‌ దారులకు పట్టాలు తహసీల్దార్‌ మంజూరు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం స్థానిక శాసనసభ్యుడి కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సర్వే వివరాలు

ఈ 11 గ్రామాల్లో భూములు గతంలో ఎవరి పేరున ఇచ్చారు. ప్రస్తుతం ఎవరు సాగు చేసుకుంటున్నారు, ఎంతమంది రైతుల చేతులు మారింది, సాగు చేసుకుంటున్న రైతుల వద్ద భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా, లేవా..? తదితర అంశాలపై గత ఏడాదిలో సర్వే చేయించారు. అధికారుల సర్వేలో 12,311 ఎకరాల అసైన్డ్‌ భూమి మచిలీపట్నం మండలంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 2,183 ఎకరాల భూమి 1,570 మంది అసలు రైతులు, లేదా వారి వారసులే సాగు చేసుకుంటున్నారని, 9,729 ఎకరాల భూమి ఇతరుల స్వాధీనంలో ఉన్నట్లుగా గుర్తించారు. మరో 387 ఎకరాల భూమి అసైన్‌మెంట్‌ చేయడానికి అవకాశం లేదని తేల్చారు.

ఇతరుల చేతుల్లో ఉంటే స్వాధీనం చేసుకుంటాం : కలెక్టర్‌

మచిలీపట్నం మండలంలోని 11 గ్రామాల్లో అసైన్డ్‌ భూమిని పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సర్వే చేశామని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. గురువారం తన చాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం మండలంలో అసైన్‌మెంట్‌ భూమికి పట్టాలు ఇచ్చే అంశంపై ఆయన మాట్లాడుతూ అర్హుల చేతిలో లేకుండా, వేరే వ్యక్తుల స్వాధీనంలో అసైన్డ్‌ భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని తెలిపారు. నోటీసులు అందుకున్న రైతులు 15 రోజుల వ్యవధిలోగా భూమికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయంలో చూపాలని ఆయన సూచించారు.

Updated Date - Feb 02 , 2024 | 01:08 AM