Share News

మెగా డీఎస్పీ కోసం ఆశావహుల ఎదురుచూపులు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:37 AM

మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని నమ్మి డీఎస్సీ నోటిపికేషన్‌ కోసం ఎదురుచూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్లుగా శిక్షణ పొందుతున్న ఆశావహులు ప్రభుత్వం తాజాగా 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా డీఎస్పీ కోసం ఆశావహుల ఎదురుచూపులు
మెగా డీఎస్పీ కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు (ఫైల్‌ఫొటో)

అవనిగడ్డ, ఫిబ్రవరి 6 : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి పైగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7900 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ ఇచ్చిన సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం కేవలం 7900 పోస్టులు భర్తీ చేసిందని.. తాను అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్ని భర్తీ చేయటమే కాక, ప్రతీ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, క్రమం తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి నిరుద్యోగ యువత ప్రభుత్వ నోటిఫికేషన్‌ కోసం ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. తాజాగా జగన్‌ ప్రభుత్వం 6100 టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం, అందులో ఎస్జీటీ పోస్టులు కేవలం 1728 మాత్రమే విడుదల చేయటంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫ మారిపోతున్న సిలబస్‌.. తప్పని శిక్షణ

2018లో డీఎస్సీ నాటికీ, నేటికీ పాఠశాలల్లో సిలబస్‌ మారిపోతుండటంతో నిరుద్యోగులు ఎప్పటికప్పుడు మారిన సిలబ్‌సకు అనుగుణంగా శిక్షణ పొందాల్సిన పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి మూడుసార్లు సిలబస్‌ మారగా, శిక్షణకు ఒక్కొక్క విద్యార్థి రూ.20 వేల వంతున, సుమారు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఇదిగో, అదిగో నోటిఫికేషన్‌ అంటూ ప్రభుత్వ ప్రకటనలతో నిరుద్యోగులు ప్రైవేట్‌ పాఠశాలల్లో, ఇతర సంస్థల్లో చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను కూడా వదిలివేసి శిక్షణ పొందటంలోనే నిమగ్నమయ్యారు. ఒక్క అవనిగడ్డ శిక్షణా కేంద్రాలలోనే సుమారు మూడువేల మందికిపైగా నిరుద్యోగులు ఐదేళ్లుగా శిక్షణ పొందుతూ ఇక్కడే ఉండి హాస్టల్‌లోనూ, బయట రూములు తీసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

ఫ శరాఘాతంగా 117 జీవో..

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ, విద్యావిధానంలో మార్పులు తెచ్చేందుకు 117 జీవోను తీసుకురాగా, ఈ జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయటంతో ఎలిమెంటరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరం క్రమేణా తగ్గుతూ వచ్చింది. సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపు 50 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉండగా, 117 జీవో కారణంగా పాఠశాలల విలీనం, రేషనలైజేషన్‌ కారణంగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దీనికి తోడు రిటైర్‌మెంట్‌ వయస్సును 62 సంవత్సరాలు పెంచటంతో ఇప్పటికే ఖాళీ అవ్వాల్సిన దాదాపు 20 వేలకుపైగా పోస్టుల్లో 60 సంవత్సరాలు నిండిన వారే పని చేస్తున్నారని, దీంతో తాము నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నామని, డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ విద్యార్థుల ఆగ్రహానికి గురిచేసిన ప్రకటన

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 6200 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, అందులో ఎస్‌జిటి పోస్టుల సంఖ్యను భారీగా తగ్గించేశారు. బిఇడి, టిటిసి చేసిన వారిలో దాదాపు 4 లక్షల మంది ఎస్‌జిటి పోస్టుల కోసం పోటీపడే పరిస్థితి ఉండగా, సుమారు 3 లక్షల మంది బిఇడి పోస్టుల కోసం పోటీ పడుతుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చూపిన ఖాళీల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎస్‌జిటి పోస్టుల ఖాళీలు సున్నా అని, అనంతపురంలో నాలుగు ఖాళీ పోస్టులను చిత్తూరులో 7 పోస్టులు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 8 చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో 14 ఎస్‌జిటి పోస్టులు అందుబాటులో ఉన్నట్టుగా చూపించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1646 ఎస్‌జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1728 పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో స్థానిక కోటా కింద కొన్ని పోస్టులు ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకపోవటంతో వీరంతా స్థానికేతర కోటాలో కర్నూలు జిల్లా అభ్యర్థులతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికేతర కోటాలో తమకు 10 శాతం పోస్టులు కూడా అందులో దక్కవని, దాదాపు ఆరేళ్లుగా తమను ఆశల్లో ఓలలాడించి నేడు ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నామని దగా చేసిందని డీఎస్సీ ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ కడుపు మండి రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు

మెగా డీఎస్సీ కోసం దాదాపు ఆరేళ్లుగా ఎదురుచూపులు చూసి విలువైన కాలాన్ని డీఎస్సీ ఆశావాహులు శిక్షణ పేరుతో వృఽథా చేసుకున్నారని, దీని కారణంగా తమ కుటుంబాలకు భారమయ్యామన్న ఆక్రోశం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల పలుమార్లు నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం అవనిగడ్డ, విజయవాడల్లో నిరసనలు తెలియజేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగులు తమ భవిష్యత్‌ పట్ల తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:37 AM