రామోజీ సంస్మరణ సభ ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈనాడు సంస్థల చైర్మన్, స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు పూర్తయినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

పెనమలూరు, జూన్ 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈనాడు సంస్థల చైర్మన్, స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు పూర్తయినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వందడుగుల రోడ్డులోని అనుమోలు గ్రౌండ్సులో గురువారం జరగనున్న కార్యక్రమానికి రామోజీరావు కుటుంబసభ్యులు, ప్రముఖ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, ప్రముఖ పాత్రికేయులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించనున్నారని కలెక్టర్ తెలిపారు. అనుమోలు ప్రాంగణం సమీపంలో బుధవారం అధికారులతో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజనింగ్(ఏఎ్‌సఎల్) సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రామోజీరావు సంస్మరణసభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. రామోజీరావు కుటుంబసభ్యులు, సమీప బంధువులు, మంత్రులు, వీవీఐపీలు ఏ-1 గ్యాలరీ వేదిక పైన ఆశీనులవుతారని, వీరికి ప్రక్కనే ఉన్న ఏ-1 పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఎం-1గ్యాలరీ, వీరికి శ్రీచైతన్య కళాశాలలో ఎం-1 పార్కింగ్ సదుపాయం కల్పించినట్టు తెలిపారు. వినోదం, ఈనాడు గ్రూపుసంస్థల ప్రతినిధులు, జాతీయ మీడియాకు బీ-1 గ్యాలరీ, వీరికి అదే రోడ్డులోని కృష్ణవేణి కళాశాల ఆవరణలో బీ-1 పార్కింగ్ పేరుతో పార్కింగ్ సదుపాయం కల్పించామని, అధికారుల వాహనాలు, జనరల్ పబ్లిక్‌కు సంబంధించిన బస్సులు, ఇతరులు వాహనాలకు వీఆర్ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పాసులు లేని వారు తమ వాహనాలను వీఆర్ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలలో పార్కు చేయాలని కోరారు. సమావేశానికి ముందు సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఇరువురు కలెక్టర్లు, కృష్ణా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనరు స్వప్నిల్ దినకర్, కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, వివిధ శాఖల అధికారులు సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
వేదికను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
బుధవారం సాయంత్రం వందడుగుల రోడ్డులోని సభా ప్రాంగణాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్, స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్‌లు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, పేదల ఆర్థిక పరిస్థితులు వారి అవసరాలకు అనుగుణంగా మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.